Updated : 18/11/2021 18:31 IST

కార్తీకం ఆచారాలు.. శాస్త్రీయ కారణాలు..

కార్తీక మాసం.. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో స్త్రీలు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడిని పూజిస్తారు. అనేక వ్రతాలు, నోములు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే లేవడం, చన్నీటితో స్నానం, నదిలో దీపాలు వదలడం, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం, కాళ్లకు పసుపు రాసుకోవడం, ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం.. ఇలా చాలా రకాల పద్ధతులు పాటిస్తుంటారు. వీటివల్ల దైవానుగ్రహం పొందడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలున్నాయి. మరి ఆ మాటకొస్తే.. హైందవ సంప్రదాయంలో పాటించే ప్రతి ఆచారం వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉందన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆచరించే కొన్ని పద్ధతులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

నదీస్నానం..

కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేచి నదులకు వెళ్లి స్నానం చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఫలితంగా ఆరోగ్యం కూడా చేకూరుతుంది. అదెలాగంటే.. నది నీరు కొండలు, కోనలు, చెట్లు.. ఇలా అన్నింటినీ తాకుతూ ప్రవహిస్తుంది. దీనివల్ల వాటిపై ఉండే మూలికల రసం ఆ నీటిలో కలుస్తుంది. కాబట్టి ఈ నీటితో స్నానం చేయడం ఆరోగ్యదాయకం. అలాగే నది నీరు చల్లగా ఉంటుంది. కాబట్టి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. అందుకే ఈ మాసంలో చాలామంది చన్నీటి స్నానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయితే కలుషితమైన నదుల్లో, చెరువుల్లో స్నానం చేసే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే.

దీపాలు వదలడం..

నదీస్నానం ముగిసిన తర్వాత నదిలో దీపాల్ని వదలడం కూడా కార్తీకమాసంలో పాటించే ముఖ్యమైన ఆచారం. ఇందుకోసం.. బియ్యప్పిండిలో కొన్ని నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. దాంతో ప్రమిద ఆకారంలో చేసి అందులో ఆవు నెయ్యి, వత్తులు వేసి దీపం వెలిగించాలి. అలాగే ఉసిరి కాయతో అయితే.. ఉసిరి కాయ పైభాగంలో తొక్క తీసేసి లోపలి గుజ్జంతా తొలగించాలి. దానిలో ఆవునెయ్యి, వత్తులు వేసి దీపం వెలిగించాలి. వాటిని అరటి దొప్పలో పెట్టి నదిలో వదిలేయాలి. దీనివల్ల దీపాల వేడికి వాతావరణంలోని క్రిములు, కీటకాలు, దోమలు నశించిపోయి గాలి శుద్ధవుతుంది. దాన్ని మనం పీల్చుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు.

దీపారాధన..

కార్తీక మాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దీపారాధన. సాయం సంధ్యలో ఇంటి ముంగిలిలో, ఇంటి చుట్టూ, తులసి కోట దగ్గర.. ఇలా దీపాలతో అలంకరిస్తే ఇళ్లంతా శోభాయమానంగా కనిపిస్తుంది. అలాగే చలికాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి దీపాల వేడికి, పొగకు దోమలు పారిపోతాయి. ఫలితంగా దోమకాటు బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే గుళ్లలో కూడా చాలామంది దీపారాధన చేస్తుంటారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున, కొంతమంది కార్తీక సోమవారాల్లో 365 వత్తులతో అఖండ దీపం వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందన్నది భక్తుల విశ్వాసం.

గుమ్మాలకు తోరణాలు..

ఏ శుభకార్యానికైనా, పండగలకైనా గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం మన సంప్రదాయం. ఇలా పచ్చటి ఆకుల్ని ముఖద్వారాలకు కట్టడం వల్ల ఆ ఆకులు గాలిలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను మనకు అందిస్తాయి. ఇలా గాలిని శుద్ధిచేసి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి మామిడాకులకు ఉంది.

కాళ్లకు పసుపు..

పూజలు, వ్రతాలు, శుభకార్యాలు.. ఇలాంటి సందర్భాల్లో స్త్రీలు అత్యంత పవిత్రంగా భావించే పద్ధతి కాళ్లకు పసుపు రాసుకోవడం. ఈ మాసంలో చలి అధికంగా ఉంటుంది కాబట్టి కాళ్లు కూడా ఎక్కువగా పగులుతుంటాయి. ఇలా పసుపు రాసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పగుళ్లను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ క్రమంలో కొంతమంది మహిళలు స్నానానికి ముందు ఒంటికి కూడా పసుపు పెట్టుకుని స్నానం చేస్తారు.

ఉసిరి, తులసి.. పూజ

కార్తీక మాసంలో ఉసిరి, తులసి మొక్కలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వీటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు మొక్కల్ని ఆరాధించడం వల్ల సౌభాగ్యంతో పాటు ఆరోగ్యం కూడా కలకాలం తోడుంటుంది. అలాగే ఈ కాలంలో ఉసిరి కాయలు ఎక్కువగా లభిస్తాయన్న విషయం తెలిసిందే. వీటివల్ల శీతాకాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, గొంతునొప్పి.. తదితర రుగ్మతల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలు కూడా తొలగిపోతాయి. మరికొంతమందైతే ఉసిరి కాయల్ని మెత్తగా నూరి ఆ గుజ్జును స్నానం చేసే నీటిలో కలుపుకుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీనివల్ల నీటిలో ఉండే క్రిములు నశించిపోతాయి. అలాగే చర్మానికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తపడచ్చు.

వనభోజనాలు..

కార్తీక మాసం దైవారాధనకు మాత్రమే కాదు.. వినోదానికి, సామాజిక సంబంధాల పునరుద్ధరణకు కూడా పెట్టింది పేరు. ఈ క్రమంలో కార్తీక వనభోజనాల గురించి అందరికీ తెలిసిందే. కొంతమంది కలిసి ఇంట్లో చేసుకున్నవి కావచ్చు.. లేదంటే ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడ చేసుకున్నవి కావచ్చు.. ఇలా కొన్ని రకాల వంటకాలు తయారు చేసుకుని అందరూ కలిసి ఒకచోట కూర్చుని ఆనందంగా ఆరగిస్తారు. ముఖ్యంగా ఉసిరి చెట్టుకింద కూర్చుని భోజనం చేయడం విశేషంగా భావిస్తారు. ఇలాంటి సందర్భంలో పై నుంచి ఉసిరి ఆకులు మనపై పడుతుంటాయి. ఈ ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. కాబట్టి ఇలా పైన పడినప్పుడు అందులోని ఔషధ గుణాల్ని మన శరీరం గ్రహించడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చు. అలాగే అందరూ కలిసి ఒకచోట చేరి వనభోజనాల పేరిట సత్కాలక్షేపం చేయడం వల్ల వ్యక్తుల మధ్య సంబంధబాంధవ్యాలు కూడా మెరుగవుతాయి.

అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లో వనభోజనాలకు వెళ్లాలనుకునే వారు కేవలం కుటుంబ సభ్యులతో అది కూడా తక్కువమంది వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇక భోజనాల విషయంలోనూ వీలైతే ఇంటి నుంచే వండుకొని వెళ్లడం శ్రేయస్కరం. అలాగే ఈ క్రమంలో అందరూ మాస్కులు పెట్టుకోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరవద్దు.

ఉపవాసం చేయడం..

కార్తీక మాసంలో ఎక్కువగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి.. మొదలైన రోజుల్లో ఎక్కువమంది ఉపవాస దీక్ష చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల శరీరంలో క్లెన్సింగ్ ప్రక్రియ జరిగి విషపదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా శరీరానికి చురుకుదనం, ఉత్సాహం, శక్తి అందుతాయి.

మాంసం ముట్టరు..

ఈ మాసంలో కొంతమంది మాంసాహారం తినకపోవడం తెలిసిందే. కార్తీక మాసం పవిత్రతతో పాటు దీనికీ ఓ శాస్త్రీయ కారణం ఉంది. వాతావరణంలో వేడి తక్కువగా ఉండడం వల్ల ఈ కాలంలో మాంసాహారం సులభంగా జీర్ణం కాదు. దీనివల్ల పలు జీర్ణసంబంధ సమస్యలు తలెత్తడంతో పాటు శరీరానికి ఇన్ఫెక్షన్లు కూడా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో మాంసాహారం తినకపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండచ్చనేది పలువురి విశ్వాసం.


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి