ఆమె ధైర్యానికి ‘పులిట్జర్’ పురస్కారం!
జీవితంలో మనం ఎదుర్కొన్న కొన్ని కఠిన పరిస్థితులే సమాజాన్ని చూసే దృష్టి కోణంలో మార్పు తీసుకొస్తాయంటుంటారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది కశ్మీర్‌కు చెందిన మహిళా ఫొటో జర్నలిస్ట్ సనా ఇర్షద్. చిన్న వయసు....
(Photos: Instagram)
జీవితంలో మనం ఎదుర్కొన్న కొన్ని కఠిన పరిస్థితులే సమాజాన్ని చూసే దృష్టి కోణంలో మార్పు తీసుకొస్తాయంటుంటారు. తన విషయంలోనూ ఇదే జరిగిందంటోంది కశ్మీర్‌కు చెందిన మహిళా ఫొటో జర్నలిస్ట్ సనా ఇర్షద్. చిన్న వయసు నుంచి కవితల్ని ఇష్టపడుతూ, రాస్తూ పెరిగిన ఆమె.. తన కుటుంబంలో చోటుచేసుకున్న ఓ చేదు సంఘటన తనను ఫొటో జర్నలిజం వైపు అడుగులేసేలా చేసిందంటున్నారు. సున్నితమైన, హృదయవిదారకమైన, భయంకరమైన.. ఇలా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే- ఏమాత్రం వెరవకుండా అక్కడున్న వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ఫొటోల్లో బంధించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ నైపుణ్యాలే ఆమెను అందలమెక్కించాయి. తాజాగా ప్రతిష్టాత్మక ‘పులిట్జర్ పురస్కారం’ అందుకునేలా చేశాయి. దేశంలోని కొవిడ్ పరిస్థితుల్ని తన ఫొటోలతో కళ్లకు కట్టినందుకు గాను ఈ మెడల్‌కు ఎంపికయ్యారామె. మరో ముగ్గురు భారతీయ ఫొటో జర్నలిస్టులతో కలిసి ఈ పురస్కారం పంచుకోనున్న ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!
ఫొటో జర్నలిజం అంటే మాటలు కాదు.. ఎలాంటి కల్లోల పరిస్థితులున్నా వెరవకుండా క్షేత్ర స్థాయిలోకి వెళ్లాలి.. అక్కడున్న పరిస్థితులకు చలించిపోకుండా.. గుండె ధైర్యంతో అక్కడి వాతావరణాన్ని సరళంగా అర్థమయ్యే రీతిలో ఫొటోల్లో బంధించాలి. ఫొటో జర్నలిస్టుగా ఇలాంటి ఎన్నో నైపుణ్యాల్ని పుణికిపుచ్చుకుంది సనా.
కెరీర్ మార్చిన సంఘటన అది!
నిజానికి సనాకు చిన్నతనం నుంచి కవితలు చదవడమన్నా, రాయడమన్నా అమితాసక్తి. సైన్స్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. కన్వర్జెంట్ జర్నలిజంలో మాస్టర్స్ పూర్తి చేసింది. తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన అనూహ్యంగా తన కెరీర్‌ను మలుపు తిప్పిందంటోంది సనా.
‘అది 2010. అప్పుడు నేను 11వ తరగతి చదువుతున్నా. ఆ సమయంలో నా కజిన్ 12 వ తరగతిలో ఉన్నాడు. ఓరోజు ట్యూషన్ ముగించుకొని ఇంటికొచ్చే దారిలో ఏవో అల్లర్లు జరుగుతున్నాయి. ఆ పక్కగా వచ్చిన వాడికి అనుకోకుండా భాష్పవాయువు గోళం తలకు బలంగా తగిలి అక్కడికక్కడే మరణించాడు. దాంతో మా కుటుంబాలు మానసికంగా ఎంతో కుంగిపోయాయి. మా జీవితాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కశ్మీర్లో నిత్యం జరిగే ఇలాంటి అల్లర్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అయితే వాటి కారణంగా అమాయకులెందరో బలవుతున్నారు. ఈ ఆలోచనతోనే వారి కుటుంబాల మానసిక క్షోభను ఫొటోల రూపంలో కళ్లకు కట్టినట్లుగా ప్రపంచానికి చూపాలనుకున్నా. అందుకే సమాజాన్ని చూసే దృష్టిని మార్చుకొని.. ఫొటో జర్నలిజం వైపు అడుగులేశా..’ అంటోందీ యంగ్ జర్నలిస్ట్.
సగంలోనే పూర్తి అర్థముంది!
వెళ్లామా, పని పూర్తి చేసుకొని తిరిగొచ్చామా.. అన్న నైజం కాదు సనాది. క్షేత్ర స్థాయిలో బాధితుల్ని, బాధిత కుటుంబాల్ని పరామర్శించి వారి బాధలు పంచుకోవడానికీ వెనకాడదామె. ఇక వృత్తిలో భాగంగా సనా తీసిన ఫొటోల్లో లోతైన విశ్లేషణ, నిశ్చలత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. అందుకే ఆమె ఫొటోలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయంటూ పులిట్జర్ వెబ్సైట్ కూడా తాజాగా పేర్కొంటూ ప్రశంసించింది. అంతేకాదు.. సనా తీసిన ఫొటోల్ని ఒక్కసారి పరిశీలిస్తే.. శరీరం కింది సగభాగమే కవరయ్యేలా, చేతులు-కాళ్లు కనిపించేలా చాలా ఫొటోలు దర్శనమిస్తాయి. మరి, అదేంటని అడిగితే.. ఆ సగ భాగంలోనే అక్కడి పరిస్థితేంటో పూర్తిగా మనకు అర్థమవుతుందని చెబుతుందామె.
‘అల్లర్లు జరిగే సమయంలో రాళ్ల దాడి, భాష్పవాయు గోళాల దాడి.. వంటి తీవ్ర ఉద్రిక్తతలుంటాయి. అలాంటి పరిస్థితిని ఫొటోల్లో బంధించాలంటే ఒక చోట నిల్చుంటే కుదరదు. పరిస్థితిని విశ్లేషించుకుంటూ.. ఫొటో సరైన యాంగిల్లో వచ్చేందుకు అటూ ఇటూ పరుగులు తీయాల్సి వస్తుంటుంది. అంతేకాదు.. ఈ క్రమంలో మనల్ని మనం కాపాడుకోవడం మరో సవాలు..’ అంటూ ఫొటో జర్నలిస్ట్‌గా నిత్యం తానెదుర్కొంటోన్న సవాళ్ల గురించి పంచుకుంది సనా.
కొవిడ్ కల్లోలానికి నిదర్శనంగా..!
కశ్మీర్ అల్లర్లు, వాటి నడుమ జీవించే అక్కడి ప్రజల జీవనశైలిని కళ్లకు కట్టినట్లు చూపించే ఆమె ఫొటోలు వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆయా ఫొటో ఎగ్జిబిషన్లు, ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమయ్యాయి. అంతేకాదు.. ఓ ఫొటో జర్నలిస్ట్‌గా ఆమె చేస్తోన్న సేవలకు గుర్తింపుగా తాజాగా ప్రతిష్టాత్మక ‘పులిట్జర్ మెడల్’ కూడా వరించింది. సనాతో పాటు అద్నాన్ అబీది, అమిత్ దేవ్, దివంగత డానిష్ సిద్దిఖీ (మరణానంతరం) ‘ఫీచర్ ఫొటోగ్రఫీ’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలోని కొవిడ్ పరిస్థితుల్ని కళ్లకు కట్టినందుకు గాను ఈ నలుగురికి ఈ పురస్కారం వరించింది. ఇక సిద్దిఖీ గతేడాది అఫ్గాన్ సేనలు-తాలిబన్ల మధ్య జరిగిన ఘర్షణల్ని కవర్ చేస్తున్నప్పుడు ఆ తూటాలకు బలయ్యారు.
ప్రస్తుతం రాయిటర్స్ సంస్థలో మల్టీమీడియా జర్నలిస్ట్‌గా సేవలందిస్తోంది సనా. పురుషాధిపత్య రంగం అంటూ ఏదీ ఉండదని, ప్రతి ఒక్కరికీ తమ కెరీర్ గురించిన స్పష్టమైన అవగాహనే వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుందంటూ తన మాటలతోనూ నేటి తరం మహిళల్లో స్ఫూర్తి నింపుతోందీ యంగ్ జర్నలిస్ట్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!