Published : 05/05/2022 20:02 IST

పెళ్లి వేళ ఈ విషయాలు గుర్తుంచుకోండి!

పెళ్లనగానే జీవితంలో ఓ మధుర ఘట్టంగా నిలిచిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే వివాహ సమయంలో తీరిక లేకపోవడం, అలసిపోవడం.. వంటి పలు కారణాల వల్ల నవ వధువులు వారికి తెలియకుండానే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అసౌకర్యానికి, అసహనానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రతి వధువు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలేంటో తెలుసుకుందాం రండి..

సర్దుకుపోవాలి..

ఆహ్వాన పత్రికల దగ్గర్నుంచి పెళ్లి మండపం వరకు, మెహెందీ దగ్గర్నుంచి పూల జడ వరకు.. ఇలా పెళ్లంటే అన్నీ మనకు నచ్చినట్లుగానే జరగాలనుకోవడం సహజం. అయితే ఒక్కోసారి ఇవన్నీ అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. కాబట్టి పనులన్నీ తమకు నచ్చినట్లుగా జరగకపోయినా, సకాలానికి పూర్తి కాకపోయినా లేక చేసిన పని సంతృప్తికరంగా లేకపోయినా.. ఆ ఉన్న కొద్ది పాటి సమయంలో అంతే అవుతుందిలే.. అని సర్దుకుపోవాలి. అంతే తప్ప దాని గురించే బాధపడడం, అవతలి వ్యక్తులపై అరవడం.. వంటివి సరికాదు. దీనివల్ల ఒత్తిడి పెరగడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు. కాబట్టి మీకు సంబంధించిన పెళ్లి పనులన్నీ వీలైనంతగా పూర్తిచేయాలి. ఏదైనా వస్తువు కొనుక్కోవడం మర్చిపోయినా వాటి గురించి ఆలోచించడం మానేసి.. ఉన్న అలంకరణ వస్తువులతోనే సాధ్యమైనంత వరకు ముందుగానే పెళ్లికి ముస్తాబు కావాలి. ఒకవేళ వీలైతే వాటిని ఫ్రెండ్స్‌తో తెప్పించుకోవడం, మీకు నచ్చినవి ఆన్‌లైన్లో బుక్ చేసుకోవడం.. వంటి ప్రత్యామ్నాయ మార్గాలు పాటించాలి. ఫలితంగా ఎలాంటి టెన్షన్ లేకుండా పెళ్లిని ఆస్వాదించగలుగుతారు.

మెసేజ్ పెట్టి వదిలేయద్దు..

ఫేస్‌బుక్, వాట్సాప్.. వంటి సామాజిక అనుసంధాన వేదికల్ని ఉపయోగించి విభిన్న తరహా ఆహ్వాన పత్రికల్ని స్నేహితులకు, దగ్గరి వారికి పంపి వూరుకోవడం కాకుండా.. వీలుంటే వాళ్లను కలిసి వ్యక్తిగతంగా పిలవడం, అదీ వీలు కాదంటే కనీసం ఫోన్లోనైనా వారిని పెళ్లికి రమ్మని ఆహ్వానించడం.. మర్చిపోవద్దు.. ఇలా చేయడం మర్యాదపూర్వకంగానూ ఉంటుంది.

ఇవి కూడా..

* పెళ్లి వేడుకల్లో ప్రతి ఘట్టానికీ ముహూర్తాలు నిర్ణయిస్తారు. బాగా రడీ అవ్వాలని వాటికి ఆలస్యం కాకుండా ముందుగానే పక్కాగా ప్లాన్ చేసుకోవాలి.

* స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీలు వంటివి చేసుకోవాలనుకుంటే మరీ పెళ్లికి వారం రోజుల ముందు వాటిని ప్లాన్ చేసుకోకూడదు. నిశ్చితార్థానికి, పెళ్లికి మధ్య సమయం ఎక్కువగా ఉన్న వారు కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.

* ఎంత తీరిక లేకుండా ఉన్నా సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీళ్లు తాగడం తప్పనిసరి అన్న విషయం మరవద్దు.

* సౌందర్య సంరక్షణకు సంబంధించి నెల రోజుల ముందు నుంచే ప్రత్యేకమైన ఫేస్ ప్యాక్స్, ఫేషియల్స్.. చేసుకోవాలి. అవసరమైతే ఒక వ్యక్తిగత సౌందర్య నిపుణురాలిని నియమించుకొని సమస్యలకు తగిన చికిత్స తీసుకోవాలి.

* రోజూ తప్పనిసరిగా ఎనిమిది గంటల పాటు ప్రశాంతంగా నిద్ర పోవాలి.S

* పెళ్లి వేడుకకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. చివరి నిమిషంలో హైరానా పడడం, ఆందోళన చెందడం వల్ల అటు పనులు సక్రమంగా జరగవు. ఇటు వేడుకను కూడా మనస్ఫూర్తిగా ఆస్వాదించలేరు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని