ఆ డైమండ్ రింగ్‌కి ‘గిన్నిస్’ రికార్డు!

‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే బద్దలుకొట్టాల’నుకుంటారు కొందరు. కేరళకు చెందిన రిజీషా ఇందుకు మినహాయింపు కాదు. డిజైనింగ్‌పై మక్కువతో జ్యుయలరీ డిజైనింగ్‌ కోర్సు చేసిన ఆమె.. తొలి ప్రయత్నంలోనే ప్రత్యేకమైన డిజైన్‌తో వజ్రపుటుంగరాన్ని తయారుచేసింది. వంద కాదు, వెయ్యి కాదు.. ఏకంగా 24 వేల పైచిలుకు వజ్రాలు....

Updated : 22 Jul 2022 19:11 IST

(Photo: Instagram)

‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే బద్దలుకొట్టాల’నుకుంటారు కొందరు. కేరళకు చెందిన రిజీషా ఇందుకు మినహాయింపు కాదు. డిజైనింగ్‌పై మక్కువతో జ్యుయలరీ డిజైనింగ్‌ కోర్సు చేసిన ఆమె.. తొలి ప్రయత్నంలోనే ప్రత్యేకమైన డిజైన్‌తో వజ్రపుటుంగరాన్ని తయారుచేసింది. వంద కాదు, వెయ్యి కాదు.. ఏకంగా 24 వేల పైచిలుకు వజ్రాలు పొదిగిన ఈ ఉంగరం.. ఇటీవలే ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు’ల్లో చోటు సంపాదించింది. దీనికి సంబంధించిన షార్ట్‌ వీడియోను గిన్నిస్‌ బుక్‌ వారు తమ అధికారిక సోషల్‌ మీడియా పేజీలో పోస్ట్‌ చేయగా.. ఆ ఉంగరం అందానికి ప్రపంచమంతా ఫిదా అయిపోతోంది. మరి, అనుకోకుండా తన సొంతమైన ఈ అరుదైన రికార్డు గురించి రిజీషా ఏమంటుందో తెలుసుకుందాం రండి..

రిజీషా పూర్తి పేరు.. రిజీషా తఝాతు వీటిల్ కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఈ 27 ఏళ్ల అమ్మాయిది స్వర్ణకారుల కుటుంబం. అయితే తన కుటుంబంలో ఈ తరంలో కులవృత్తిని చేపట్టిన వారెవరూ లేరు. దాంతో తాను ఈ వృత్తిని స్వీకరించాలని నిర్ణయించుకుంది. చిన్న వయసు నుంచే డిజైనింగ్‌పై ఉన్న మక్కువతో జ్యుయలరీ డిజైనింగ్‌ చేయాలని సంకల్పించుకుంది రిజీషా.

అనుకోని అవకాశం.. అరుదైన డిజైన్!

అనుకున్నట్లే బీటెక్‌ పూర్తయ్యాక కోజికోడ్‌లోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో ‘లైఫ్‌స్టైల్‌ యాక్సెసరీ డిజైనింగ్‌’లో ఇటీవలే మాస్టర్స్‌ పూర్తిచేసిన ఆమెకు ఓ అరుదైన అవకాశం వచ్చింది. ఆమె ప్రతిభ, జ్యుయలరీ డిజైనింగ్‌పై ఆసక్తిని తెలుసుకున్న మలప్పురానికి చెందిన SWA Diamonds వారు ఆమెను ఓ ప్రత్యేకమైన ఉంగరం తయారుచేయమని సంప్రదించారు. దాన్నే మహదవకాశంగా భావించిన రిజీషా.. ఇందుకోసం ఓ అరుదైన మోడల్‌ని ఎంచుకుంది. పింక్‌ ఆయిస్టర్‌ మష్రూమ్‌ను పోలినట్లుగా ఉండే ఉంగరం తయారుచేయాలనుకుంది. అదే బొమ్మను కాగితంపై అందంగా చిత్రించింది. మరో నలుగురు కళాకారులతో కలిసి కేవలం 90 రోజుల్లో ఈ ఉంగరాన్ని తయారుచేసిందామె. అయితే దీని డిజైన్‌ ఎంత ప్రత్యేకమైందో.. దీని అణువణువూ పొదిగిన తెల్లటి వజ్రాలూ ఉంగరానికి అంతకుమించిన అందాన్ని తీసుకొచ్చాయని చెప్పచ్చు.

‘గిన్నిస్‌’ రికార్డు.. ఉద్యోగమూ..!

‘ది టచ్‌ ఆఫ్‌ అమీ’గా నామకరణం చేసిన ఈ ఉంగరం తయారీలో భాగంగా.. ప్లాస్టిక్‌ మౌల్డ్‌ సహాయంతో 41 రకాల మష్రూమ్‌ పెటల్స్‌ని తయారుచేసింది రిజీష. ఆపై 3-D ప్రింటింగ్‌ టెక్నాలజీతో వాటిని రీక్రియేట్‌ చేసి.. పింక్‌ ఆయిస్టర్‌ మష్రూమ్‌ ఆకృతిని తీసుకొచ్చింది. దానికి బంగారంతో పూత పూసి.. ఉంగరం అణువణువునూ మొత్తంగా 24,679 వజ్రాలతో చేత్తోనే పొదిగింది. దీని బరువు 344 గ్రాములు, కాగా ధర సుమారు రూ. 80 లక్షలకు పైమాటే! అయితే ఇలా ఇన్ని వజ్రాలు పొదిగి ఓ ఉంగరం తయారుచేయడం ఇదే తొలిసారి కావడంతో.. ఈ ఆభరణం ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’తో పాటు ఇటీవలే ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌’నూ సొంతం చేసుకుంది. గతంలో ఓ భారతీయ వజ్రాభరణాల సంస్థ 12,638 వజ్రాలతో ఉంగరం తయారుచేసి గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కింది. ఇప్పుడు ఆ రికార్డును తన సృజనాత్మకతతో బద్దలు కొట్టింది రిజీషా. అంతేకాదు.. తన ప్రతిభను మెచ్చిన SWA Diamonds వారు ఆమెకు ‘చీఫ్‌ డైమండ్‌ డిజైనర్‌’గా ఉద్యోగమిచ్చి గౌరవించడం విశేషం.

అరుదైన రికార్డు తెచ్చిన సంతోషమిది!

కేరళ రాష్ట్రంలోనే జ్యుయలరీ డిజైనింగ్‌లో చీఫ్‌ డైమండ్‌ డిజైనర్‌ వంటి ఉన్నత స్థానాన్ని అందుకున్న తొలి మహిళగా నిలిచింది రిజీషా. ‘ఆభరణాల తయారీపై మక్కువకు తోడు మా కుల వృత్తికి ఆధునికతను జోడించి సరికొత్త డిజైన్లను రూపొందించడానికే ఈ కెరీర్‌ను ఎంచుకున్నా. అందుకే బీటెక్‌ పూర్తి కాగానే NIT లో ప్రత్యేక కోర్సు చేశా. ఇక్కడ జ్యుయలరీ డిజైనింగ్‌లో ఉన్న అమ్మాయిలు తక్కువ. ఒకవేళ ఉన్నా.. వారికి ఇక్కడ ప్రోత్సాహం కరువవడంతో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో తమ నైపుణ్యాలను చాటుతున్నారు. ఏదేమైనా నా తొలి డిజైన్‌కే ప్రతిష్టాత్మక గిన్నిస్‌ రికార్డు రావడం చాలా సంతోషంగా ఉంది..’ అంటూ ఉప్పొంగిపోతోందీ యువ డిజైనర్‌. ఇక ఈ విలువైన ఉంగరం తాలూకు వీడియోను ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ వారు తమ అధికారిక ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. దాని అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఇక SWA Diamonds సంస్థ కూడా తమ ఉంగరాన్ని త్వరలోనే అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఇక రిజీషాకు డిజైనింగ్‌ అంటే ఎంత మక్కువో.. ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఆమె త్రీడీ చిత్రాలే చెబుతాయి. అంతేకాదు.. తానో బైక్‌ లవర్‌ కూడా! బుల్లెట్పై ఎంత దూరమైనా అలుపు లేకుండా రయ్‌ మంటూ దూసుకుపోగలనంటోందీ యంగ్‌ డిజైనర్.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్