భర్తను కూర్చోబెట్టుకుని లారీ డ్రైవ్ చేస్తూ.. ఈ ప్రేమకథ విన్నారా?

సాధారణంగా పెళ్లిలో భాగంగా వధూవరులు ఏ కార్లోనో, జట్కా బండిలోనో పెళ్లి వేదిక వద్దకు రావడం చూస్తుంటాం. ఇక ఈ కాలపు మోడ్రన్‌ వధువులైతే.. స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ, బుల్లెట్‌ బండ్లు నడుపుతూ మరీ తమ పెళ్లికొచ్చిన అతిథులు, బంధువుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. అయితే కేరళకు చెందిన ఈ వధువు మాత్రం....

Updated : 10 Jan 2023 18:36 IST

(Photos: Screengrab)

సాధారణంగా పెళ్లిలో భాగంగా వధూవరులు ఏ కార్లోనో, జట్కా బండిలోనో పెళ్లి వేదిక వద్దకు రావడం చూస్తుంటాం. ఇక ఈ కాలపు మోడ్రన్‌ వధువులైతే.. స్వయంగా గుర్రపు స్వారీ చేస్తూ, బుల్లెట్‌ బండ్లు నడుపుతూ మరీ తమ పెళ్లికొచ్చిన అతిథులు, బంధువుల్ని సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. అయితే కేరళకు చెందిన ఈ వధువు మాత్రం ఈ రెండింటికీ భిన్నం! వృత్తిరీత్యా ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ అయిన ఆమె.. అదే లారీలో తనకు కాబోయే భర్తను ఎక్కించుకొని మరీ షికారు చేసింది. ఇలా ఓవైపు తన వృత్తి పట్ల తనకున్న ఇష్టాన్ని, గౌరవాన్ని ప్రదర్శిస్తూనే.. మరోవైపు వినూత్నంగా పెళ్లి వేదిక వద్ద ఆమె చేసిన సందడి ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది.

దలీషా, హన్సన్‌.. కేరళలోని త్రిస్సూరుకు చెందిన ఈ జంట ఎంగేజ్‌మెంట్ ఇటీవలే అక్కడి సెయింట్‌ ఆంథోనీ చర్చిలో ఘనంగా జరిగింది. అయితే వేడుక అనంతరం అందరిలా ఏ కార్లోనో, జట్కా బండిలోనో వేదికను వీడలేదీ జంట. తమ షికారు కోసం భారీ ఆయిల్‌ ట్యాంకర్‌ లారీని ఎంచుకున్నారు. నిజానికి దీని వెనుకా ఓ చిన్న ప్రేమ కథ లేకపోలేదు.

లారీలో పుట్టిన ప్రేమ!

దలీషా, హన్సన్‌.. నిజానికి వీరిద్దరిదీ ప్రేమ వివాహం. పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లికి సిద్ధపడ్డారు. గత కొంత కాలంగా దుబాయ్‌లోని ఓ కంపెనీలో భారీ ఆయిల్‌ ట్యాంకర్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తోంది దలీషా. హన్సన్‌ కూడా అదే సంస్థలో లారీ డ్రైవర్‌గా చేరాడు. ఇలా వారిద్దరికీ పరిచయమై.. కొంత కాలానికి అది ప్రేమగా మారింది. దీంతో ఇరు కుటుంబాలకూ వారి ప్రేమ విషయాన్ని తెలియజేసిందీ జంట. ఇరువైపులా ఒప్పుకోవడంతో వీరి వివాహం నిశ్చయమైంది. అయితే అందరిలా కాకుండా కాస్త విభిన్నంగా, వినూత్నంగా తమ ఎంగేజ్‌మెంట్ జరుపుకోవాలనుకున్న ఈ కేరళ కపుల్‌.. వేడుకలో భాగంగా కలిసి షికారు చేయడానికి తమ ప్రేమకు కారణమైన లారీ డ్రైవింగ్‌నే ఎంచుకోవడం విశేషం.. దీంతో ఆయిల్‌ ట్యాంకర్‌ లారీలోనే కాసేపు సరదాగా తిరుగుతూ సందడి చేశారీ లవ్లీ కపుల్‌. ఇక అందులోనూ వధువు దలీషా, వరుడిని ఎక్కించుకొని తిప్పడంతో వేడుకకు వచ్చిన అతిథులు, బంధువులు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో చిత్రీకరించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్నాయి.

నాన్న స్ఫూర్తితో..!

ఈ జంటకు సంబంధించిన వీడియోలు చూసిన చాలామంది ‘వధువేంటి..? లారీ నడపడమేంటి?’ అని తొలుత ఆశ్చర్యపోయారు. కానీ దలీషా వృత్తి అదేనని తెలిశాక ఆమెను ప్రశంసించారు. అయితే లారీ డ్రైవింగ్‌పై తనకున్న మక్కువ ఈనాటిది కాదంటోందీ కొత్త పెళ్లికూతురు.

‘మా నాన్న వృత్తిరీత్యా ఆయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌. చిన్నతనం నుంచీ ఆయన్ని చూస్తూ పెరిగిన నాకూ ఇదే వృత్తిలో స్థిరపడాలనిపించేది. అందుకే సెలవు రోజుల్లో నాన్నతో కలిసి లారీలో షికారుకు వెళ్లేదాన్ని. అంతేకాదు.. లారీ డ్రైవింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నా. డ్రైవింగ్‌ లైసెన్స్‌ వచ్చాక ఇక్కడే ఓ సంస్థలో విధుల్లో చేరా. ఈ క్రమంలో కొచ్చి నుంచి మలప్పురానికి పెట్రోల్‌ సరఫరా చేసే లారీని తోలేదాన్ని. ఈ సమయంలోనే దుబాయ్‌లోని ఓ జర్మన్‌ కంపెనీలో పనిచేసే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నా. నాకిష్టమైన వృత్తిలో పనిచేసే వ్యక్తినే ప్రేమించి పెళ్లి చేసుకోవడం సంతోషంగా అనిపిస్తోంది.. లారీ డ్రైవింగ్‌లో ఎంత ప్రావీణ్యం ఉన్నా.. పెళ్లి దుస్తుల్లో లారీ ఎక్కడం కాస్త ఇబ్బందే అయింది.. అందుకే ఆ సమయంలో హన్సన్‌ నాకు సహకరించాడు..’ అంటూ మురిసిపోతోంది దలీషా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్