ఉత్తరాలతో పలకరిస్తోంది!

ఈ డిజిటల్‌ యుగంలో మాటలు మార్చుకోవాలన్నా, ఫొటోలు-వీడియోలు పంచుకోవాలన్నా.. అందరూ సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు. కానీ కేరళకు చెందిన రెజ్బిన్‌ అబ్బాస్‌ అనే యువతి మాత్రం నేటికీ ఉత్తరాల ఒరవడినే కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 40 దేశాలకు చెందిన యువతీయువకులతో చెలిమి పెంచుకుందామె.

Published : 28 Nov 2021 12:32 IST

(Photos: Facebook)

ఈ డిజిటల్‌ యుగంలో మాటలు మార్చుకోవాలన్నా, ఫొటోలు-వీడియోలు పంచుకోవాలన్నా.. అందరూ సోషల్‌ మీడియానే ఆశ్రయిస్తున్నారు. కానీ కేరళకు చెందిన రెజ్బిన్‌ అబ్బాస్‌ అనే యువతి మాత్రం నేటికీ ఉత్తరాల ఒరవడినే కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 40 దేశాలకు చెందిన యువతీయువకులతో చెలిమి పెంచుకుందామె. ముక్కూ మొహం తెలియకపోయినా.. వారిని ఒక్కసారి కూడా నేరుగా కలవకపోయినా.. ఉత్తర-ప్రత్యుత్తరాలతోనే ఎంతోమంది విదేశీ స్నేహితుల్ని సంపాదించుకుంది. మరి, టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ కాలంలోనూ ఉత్తరాలు రాయడమేంటని అడిగితే.. దీని వెనకా ఓ కథ ఉందని చెబుతోంది.

సోషల్‌ మీడియా తెరమీదకొచ్చాక ఉత్తరాలు రాసే పద్ధతి చాలావరకు కనుమరుగైపోయిందనే చెప్పాలి. నన్నడిగితే.. ఆన్‌లైన్‌లో క్షణాల్లో చేరే సందేశానికి, మనసులోని భావాలన్నీ రంగరించి స్వయంగా మన చేత్తో రాసే ఉత్తరానికి చాలా తేడా ఉందని చెప్తా. ఎందుకంటే మనం రాసిన లేఖకు అవతలి వారు స్పందించి పంపే ప్రత్యుత్తరం కోసం చూసే ఎదురుచూపుల్లో ఎంతో ఆనందం ఉంటుంది. మన గురించి, మన మంచి గురించి ఆలోచించే మరో వ్యక్తి మనకు తోడుగా ఉన్నారన్న భావనను మనకు కలిగిస్తుంది. అంతేకాదు.. ఈ ఉత్తరాల అలవాటు మన మనసులోని ప్రతికూలతల్నీ తొలగిస్తుంది. ఇందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ.

తొమ్మిదో ఏట కుదుపు!

చిన్నతనంలో నేనూ అందరు పిల్లల్లాగే తోటి స్నేహితులతో ఆడుకోవడం, అన్ని విషయాల్లో చురుగ్గా ఉండడం.. చేసేదాన్ని. ఇక ఎప్పుడైతే నా తొమ్మిదో ఏట మా అమ్మానాన్నలు విడిపోయారో.. అప్పట్నుంచి నా జీవితం మరో మలుపు తిరిగింది. అమ్మనాన్న విడాకులు తీసుకున్నాక నేను, నా సోదరుడు అమ్మతోనే ఉండిపోయాం. ఎంతైనా తండ్రి అండ లేని పిల్లలంటే ఈ సమాజానికి ఎప్పుడూ చులకన భావమే! ఈ క్రమంలో నేనూ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ‘నీకు నాన్న లేడు’ అంటూ స్కూల్లో తోటి పిల్లలు నన్ను దూరం పెట్టేవారు. వాళ్లతో ఆడుకోనిచ్చే వారు కాదు. ఇరుగుపొరుగు వాళ్లు మా అమ్మను, నా సోదరుడిని నానా మాటలూ అనే వారు. ఇవన్నీ నా మనసు మీద దెబ్బకొట్టాయి. ఈ ఫీలింగ్‌తోనే నా బాల్యమంతా ఒంటరిగా, ఏదో కోల్పోయినట్లుగా గడిచిపోయింది. దీన్ని జయించి నన్ను నేను సంతోషంగా ఉంచుకోవడానికి నాలోని ప్రతిభకు పదును పెట్టేదాన్ని. నాకు చిన్నప్పట్నుంచే ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ అంటే చాలా ఇష్టం. ఇవి రూపొందిస్తూ.. ఆయా ఫొటోల్ని నా సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసేదాన్ని.

తనతోనే మొదలైంది!

వీటికి మంచి స్పందన వచ్చేది. ముఖ్యంగా చాలామంది విదేశీయులు నా ఖాతాను ఫాలో అవుతూ.. నాకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టేవారు. అయితే మొదటిసారి మెక్సికో నుంచి సారా అనే అమ్మాయి స్పందిస్తూ.. ‘మీరు రూపొందించే ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ నాకు బాగా నచ్చాయి. మీకో చిన్న కానుక పంపాలనుకుంటున్నా.. అడ్రస్‌ చెప్ప’మని అడిగింది. తనకు మా ఇంటి అడ్రస్‌ ఇచ్చా. అలా సారా దగ్గర్నుంచి నాకు తొలి ఉత్తరం, దాంతో పాటు క్రిస్మస్‌ పోస్ట్‌ కార్డు అందాయి. ఆ తర్వాత నేనూ ధన్యవాదాలు చెబుతూ తనకు ప్రత్యుత్తరం పంపాను. అలా నా ఉత్తర-ప్రత్యుత్తరాల కథ మొదలైంది. ఆపై విదేశాల నుంచి నాకు పరిచయమైన స్నేహితులతోనూ ఉత్తరాల రూపంలోనే నా మనసులోని మాటల్ని పంచుకోవడం మొదలుపెట్టా. ఇప్పటిదాకా సుమారు 43 దేశాలకు చెందిన 15 మంది నాకు స్నేహితులయ్యారు. మా మధ్య సుమారు 50 దాకా ఉత్తర-ప్రత్యుత్తరాలు నడిచాయి.

అదో అందమైన అనుభూతి!

నేరుగా మాట్లాడుకోకపోయినా, ఒకరినొకరు చూసుకోకపోయినా.. మేమంతా ఎంతో చక్కగా కలిసిపోయాం. మా చదువుకు సంబంధించిన పాఠ్యాంశాలు, స్కూల్‌ విషయాలు, ఆయా దేశాల సంస్కృతీ సంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, రుచులు.. ఇలా ఉత్తరాల ద్వారా ఎన్నో విషయాలు పంచుకుంటున్నాం.  అంతేకాదు.. ఈ ఉత్తరాలతో పాటు నా ఫ్రెండ్స్‌ నాకు ప్రేమతో కొన్ని కానుకలు కూడా పంపుతుంటారు. నేనూ నాకు నచ్చిన గిఫ్ట్స్‌ని వాళ్లకు పంపుతున్నా. ఇలా అనతికాలంలోనే మా మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ఒకప్పుడు తోటి స్నేహితుల హేళనకు గురై కుంగిపోయిన నన్ను చూసి అమ్మ బాధపడేది. ఇప్పుడు ఎంతోమంది విదేశీ స్నేహితుల దగ్గర్నుంచి ఉత్తరాలు రావడం, మా మధ్య పెనవేసుకున్న స్నేహబంధాన్ని చూసి తను చాలా సంతోషిస్తుంది.

నిజానికి ఉత్తరాలు పంపడం, ప్రత్యుత్తరాల కోసం ఎదురుచూడడం.. ఈ అనుభూతి క్షణాల్లో అవతలి వారికి చేరవేసే సందేశం వల్ల దక్కదనే చెప్పాలి. వీలైతే మీరూ ఈ పద్ధతిని తిరిగి మొదలుపెట్టండి. నాటి సంప్రదాయం కనుమరుగవకుండా చూడడంతో పాటు.. ఇందులోని మధురానుభూతుల్నీ సొంతం చేసుకోండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్