నాన్నా... వంట అయ్యిందా?

ప్రతి ఇంట్లో ఉదయాన్నే స్కూల్, ఆఫీసు అంటూ ఊపిరిసలపని పనితో ఇల్లాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. మరోవైపు ఆ పనితో తనకు సంబంధం లేనట్లు పేపరు చదువుతూ, కాఫీ తాగుతూ ఉంటాడు ఆమె భర్త. దాంతో ఇంటి, వంటింటి పని అంతా స్త్రీల బాధ్యతే అనే అభిప్రాయంతో పిల్లలు పెరుగుతున్నారు.

Published : 17 Jun 2024 03:45 IST

ప్రతి ఇంట్లో ఉదయాన్నే స్కూల్, ఆఫీసు అంటూ ఊపిరిసలపని పనితో ఇల్లాలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. మరోవైపు ఆ పనితో తనకు సంబంధం లేనట్లు పేపరు చదువుతూ, కాఫీ తాగుతూ ఉంటాడు ఆమె భర్త. దాంతో ఇంటి, వంటింటి పని అంతా స్త్రీల బాధ్యతే అనే అభిప్రాయంతో పిల్లలు పెరుగుతున్నారు. అలాకాకుండా ఇంటి పనుల్లోనూ లింగసమానత్వం ఉండాలనేదానిపై బాల్యం నుంచే విద్యార్థుల్లో అవగాహన కలిగించాలనుకుంది కేరళ ప్రభుత్వం...

పాఠ్య పుస్తకాలను సవరించి, నవీకరించేలా ఆ ప్రభుత్వం ఓ మిషన్‌ను ప్రారంభించింది. దీనిలో భాగంగా మూడో తరగతి మలయాళం మీడియం, ఇంగ్లిష్‌ టెక్స్ట్‌బుక్స్‌లో లింగ సమానత్వాన్ని చాటే బొమ్మలను ప్రచురించింది. మహిళలకు వంటింట్లో మగవాళ్లు సాయం చేస్తున్నట్లుగా ఆర్ట్‌తో ఇంటి బాధ్యతలన్నీ భార్యాభర్తలు పంచుకోవాలనే అర్థం వచ్చేలా సూచించింది. రాష్ట్ర విద్యాశాఖామంత్రి వి.శివన్‌కుట్టి ఈ కొత్త పాఠ్యాంశం గురించి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తే,  నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నారు. అలాగే తమ తండ్రిని కూడా అమ్మకు సాయం చేయమని అడుగుతామని చెబుతున్నారు విద్యార్థులు. కేరళ వేసిన ఈ ముందడుగు ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తుంటే, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ఆలోచనను చేయొచ్చు కదా అని అభిప్రాయపడుతున్నారు మరికొందరు. దీంతో ఇకపై ‘టైం అవుతోంది. లంచ్‌ అయ్యిందా’ అని అడిగే పిల్లలకు ‘ఇదిగో వంట సిద్ధమవుతోంది’ అని తల్లికి బదులు తండ్రి సమాధానమిస్తాడేమో వేచి చూద్దాం.

అలాగే ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరికీ ఒకేరకమైన దుస్తులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సాధారణంగా స్కూల్స్‌లో బాలికలు స్కర్టు లేదా చుడీదార్‌ వంటివి ధరిస్తారు. అయితే కేరళలో విద్యార్థులంతా ఒకేలా మోకాలి వరకు ప్యాంటు, పైన షర్టు ధరిస్తారు. విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.  మిగతా పాఠశాలలు కూడా ఈ కొత్తరకం యూనిఫామ్‌ను అనుసరిస్తున్నాయి. ఈ ఆలోచన కూడా మెచ్చుకోదగిందే కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్