అందుకే ఈ ధన్య కథ ఎంతో స్పెషల్!

సాధారణంగా మనం ఏ యాడ్‌ చూసినా చూడకపోయినా నగల ప్రకటనల్ని మాత్రం మిస్సవ్వం. అందులో మోడల్స్‌ ధరించే ఆభరణాల్ని కళ్లార్పకుండా చూస్తుంటాం. తమకూ ఇలాంటి నగలు ధరించే అవకాశమొస్తే బాగుండు అనుకునే వారూ లేకపోలేదు.

Published : 05 Sep 2021 14:55 IST

(Photo: Instagram)

సాధారణంగా మనం ఏ యాడ్‌ చూసినా చూడకపోయినా నగల ప్రకటనల్ని మాత్రం మిస్సవ్వం. అందులో మోడల్స్‌ ధరించే ఆభరణాల్ని కళ్లార్పకుండా చూస్తుంటాం. తమకూ ఇలాంటి నగలు ధరించే అవకాశమొస్తే బాగుండు అనుకునే వారూ లేకపోలేదు. అయితే తాజాగా వైరలవుతోన్న ఓ జ్యుయలరీ యాడ్‌లో మాత్రం ఆభరణాలతో పాటు అవి ధరించిన అమ్మాయిని చూసి అందరూ ముగ్ధులవుతున్నారు. బాబ్డ్ హెయిర్‌కట్‌, తెలుపు రంగు గౌన్‌ ధరించి.. ఆభరణాలతో ముస్తాబైన ఈ అమ్మాయి అచ్చం ప్రిన్సెస్‌ను తలపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక బాలీవుడ్‌ బ్యూటీ కరీనా కపూర్‌ అయితే ఏకంగా ‘Special Bride Of India’ అంటూ ఈ ప్రిన్సెస్‌ను తెగ పొగిడేసింది. అయితే ఇది తెరకు ముందే..! తెర వెనుక మాత్రం ఆమెది ఓ విషాద గాథ. ఓ అరుదైన సమస్యతో బాధపడుతూ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందామె. అయినా ఈ బాధలన్నీ మర్చిపోయి తన చిరునవ్వుతో అందరినీ కట్టిపడేసింది. మరి, ఇంతకీ ఎవరా అమ్మాయి? ఏంటి ఆమె కన్నీటి కథ? తెలుసుకుందాం రండి..

కేరళలోని తోడుపుజాలో పుట్టి పెరిగింది 20 ఏళ్ల ధన్యా సోజన్‌. చిన్నప్పట్నుంచీ చాలా చురుకైన అమ్మాయి.. చదువంటే ప్రాణం. ఆమెకు స్వతంత్ర భావాలెక్కువ! యుక్త వయసుకొచ్చాక తల్లిదండ్రులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. ఇటు చదువుకుంటూ, అటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకుంటూ.. పేరెంట్స్‌కి చేదోడువాదోడుగా ఉండాలనుకుంది. ఇదే ఆశయంతో 2019లో ప్లస్‌ టూ పూర్తి చేసుకొని పైచదువుల కోసం కెనడా చేరుకుంది.

న్యుమోనియా అనుకున్నారు.. కానీ!

తాను అనుకున్నట్లుగానే టొరంటోలో అకౌంటెంట్‌గా ఉద్యోగం వెతుక్కున్న ఆమె.. ఆర్థికంగా తన పేరెంట్స్‌కి అండగా ఉండే అవకాశం దొరికిందంటూ సంబరపడిపోయింది. ‘ఓవైపు చదువుకోవచ్చు.. మరోవైపు ఉద్యోగం చేయచ్చన్న ఉద్దేశంతోనే కెనడా వచ్చాను. అనుకున్నట్లుగానే ఉద్యోగం వచ్చింది.. రోజూలాగే ఆ రోజూ సైకిల్‌పై ఆఫీస్‌కి వెళ్తున్నా. ఉన్నట్లుండి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా అనిపించింది.. ఆగకుండా దగ్గు రావడం మొదలైంది. డాక్టర్లు పరీక్షించి న్యుమోనియా అన్నారు.. యాంటీబయోటిక్స్‌ ఇచ్చారు.. కానీ అవేవీ నా శరీరంపై ప్రభావం చూపలేకపోయాయి. ఆ తర్వాత కొన్నిసార్లు నేను స్పృహ తప్పి పడిపోవడం, ఆస్పత్రిలో చేరడం జరిగాయి. అయితే దీనికి కారణమేంటో మాత్రం వైద్యులు ముందు తేల్చలేకపోయారు. ఆఖరికి ఇంకొన్ని పరీక్షలు చేసిన తర్వాత నాకు Congestive Heart Failure సమస్య ఉందని చెప్పారు డాక్టర్లు. అంటే నా గుండె 20 శాతం మాత్రమే పనిచేస్తుందని దాని అర్థం!’ అని తన ఆరోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చింది ధన్య.

మూడు ఆప్షన్లిచ్చారు!

ఏదైనా పాజిటివ్‌గా తీసుకోవడం ధన్యకు చిన్నప్పట్నుంచీ అలవాటు! అయితే తనకు అరుదైన గుండె జబ్బుంది అని వైద్యులు చెప్పిన ఆ క్షణం కూడా తనకేమీ కాదన్న ధైర్యం, సానుకూల దృక్పథంతోనే ఉన్నానని చెబుతుంది ధన్య. 
‘నాకు గుండె జబ్బు ఉందని చెప్పిన ఆ క్షణం నా గురించి నేను ఆలోచించలేదు.. నేను కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయేమోనన్న భయం ఒక్క క్షణం నా మనసును ఉక్కిరిబిక్కిరి చేసింది. అయినా నేను బాగానే ఉన్నాను కదా.. సమస్యల్లా నా గుండెలో ఉంది అనుకున్నా.. అయితే డాక్టర్లు నాకు మూడు ఆప్షన్లిచ్చారు.

ఒకటి - మందులు వాడడం.. అయినా అవి శాశ్వత పరిష్కారం కావన్నారు.

రెండోది - Implantable Cardioverter Defibrillator (ICD) పరికరాన్ని అమర్చడం. ఆకస్మిక గుండెపోటు/మరణం నుంచి ఇది తప్పిస్తుంది.

మూడోది - గుండె మార్పిడి ఆపరేషన్.

ఇలా వైద్యులు ఒక్కో ఆప్షన్‌ చెబుతున్నా నేను మానసికంగా దృఢంగానే ఉన్నా. నేను తప్పకుండా ఈ జబ్బు నుంచి బయటపడి తిరిగి టొరంటో చేరుకుంటానన్న నమ్మకం నాకుంది.. అదే ఆశతో ఆపరేషన్‌ కోసం తిరిగి ఇండియా చేరుకున్నా..’ అంటుంది ధన్య.

‘ఒక్క ఛాన్స్‌’ అడిగింది!

చిన్నతనం నుంచీ ధన్యకు మరో బలమైన కోరిక ఉంది. అదేంటంటే.. తనెప్పటికైనా మోడల్‌ కావాలని! ఈ ఆలోచనతో ఉన్న ఆమె ఓ రోజు సోషల్‌ మీడియాలో ‘బ్రైడ్స్‌ ఆఫ్‌ ఇండియా’ క్యాంపెయిన్‌ యాడ్‌ ఫిల్మ్‌ చూసింది. అవకాశమొస్తే వచ్చింది లేకపోతే లేదు.. ఓ ఛాన్స్‌ అయితే అడిగి చూద్దామని ఆ యాడ్‌ ఫిల్మ్‌ కింద ఓ కామెంట్‌ పెట్టింది.

‘నాకూ ఇలా వజ్రాభరణాలు ధరించి బోలెడన్ని ఫొటోషూట్స్‌లో పాల్గొనాలని ఉంది.. మీ యాడ్‌ షూట్‌లో నాకొక్క అవకాశమిస్తారా?’ అంటూ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ సంస్థ వారిని కోరుతూ సందేశం రాసింది. ఇక ఆ తర్వాత ఈ విషయం గురించి మర్చిపోయిందామె. ఆగస్టు మొదటివారంలో పెట్టిన ఆమె మెసేజ్‌కు ఆగస్టు 20న స్పందన వచ్చింది. ‘నేను కామెంట్‌ పెట్టానన్న విషయమే మర్చిపోయా. ఆగస్టు 20న మలబార్‌ సంస్థ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. కొచ్చి యాడ్‌ షూట్‌లో పాల్గొనమని వారు నాకు ఆహ్వానం పంపించారు. అది చూసి నేను, నా కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా షాక్‌. నాకైతే చెప్పలేనంత ఆనందమేసింది..’ అంటూ ఉబ్బితబ్బిబ్బైంది ధన్య.

పేషెంట్‌నన్న ఫీలింగే రాలేదు!

ఇక ఆ సంస్థ ఆహ్వానం మేరకు ఇటీవలే కొచ్చిలో జరిగిన ఫొటోషూట్‌లో పాల్గొంది ధన్య. ఈ క్రమంలో ప్రిస్టీన్‌ వైట్‌ గౌన్‌ ధరించిన ఆమె.. షార్ట్‌ హెయిర్‌కట్‌తో మోడ్రన్‌ బ్రైడ్‌లా దర్శనమిచ్చింది. ఇక వజ్రాభరణాలతో తన లుక్‌ని పూర్తి చేసిన ధన్య.. తానెప్పట్నుంచో కలలు కన్న ఫొటోషూట్‌లో చిరునవ్వులు చిందిస్తూ అందరినీ కట్టిపడేసింది.. ఆభరణాలను తడుముతూ, తనని తాను అద్దంలో చూస్తూ ఒకింత భావోద్వేగానికి గురైంది.

‘షూట్‌కి ముందు మందులు వేసుకున్నా.. అయితే ఈ సంతోషకరమైన క్షణాన నేను పేషెంట్‌నన్న విషయమే మర్చిపోయా. ఈ అవకాశమిచ్చిన మలబార్‌ వారికి ధన్యవాదాలు. ఈ ఒక్క యాడ్‌తో నా జన్మ ధన్యమైంది.. నా కోరిక నెరవేరింది. ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు..’ అంటూ పట్టలేనంత ఆనందంలో మునిగిపోయిందీ కేరళ బ్రైడ్‌. ఈ యాడ్‌లో నటించిన ముగ్గురు చెలికత్తెల్లో ధన్య అక్క దివ్య కూడా ఒకరు.

ధైర్యమే నా ఔషధం!

అనారోగ్యముందని బాధపడే కంటే ధైర్యంగా ఉన్నప్పుడే జబ్బు త్వరగా నయమవుతుందని తన ఇన్‌స్టా పోస్ట్‌లతో చెప్పకనే చెబుతుంటుందీ కేరళ టీన్.

*గ తేడాది ఆగస్టులో ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే తన పుట్టినరోజు వేడుక చేసుకున్న ఆమె.. ఈసారి తన కుటుంబ సభ్యుల మధ్య తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఘనంగా జరుపుకొంది. పైగా ఇదే నెలలో యాడ్‌ ద్వారా తను పాపులర్‌ అవడం మరింత సంతోషాన్నిచ్చిందని చెబుతోంది.

అంతేకాదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మూడో సెమిస్టర్‌ పరీక్షలు కూడా రాసిందామె.

* అరుదైన వ్యాధితో ఆస్పత్రిలో ఉన్నా తనకేమీ కాలేదన్నంత ధైర్యంగా ఉండడం ధన్యకే చెల్లింది. ఆ సమయంలోనూ తనకిష్టమైన పాటలకు కళ్లతోనే డ్యాన్స్‌ చేస్తూ.. భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడే బదులు ఈ క్షణాన్ని ఆస్వాదించడంలోనే ఆనందముంది అని చెప్పకనే చెప్పింది ధన్య.

* ఫ్యాషనబుల్‌గా తయారవడమంటే ధన్యకు చాలా ఇష్టం. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఓనమ్‌కి కసావు లెహెంగాలో మెరిసిన ఆమె.. గతంలోనూ పలు ఫ్యాషనబుల్‌ దుస్తుల్లో ఆకట్టుకుంది.

* ఇక చికిత్స తీసుకునే క్రమంలో తన జుట్టు రాలిపోయినా నిరాశ చెందకుండా.. షార్ట్‌ హెయిర్‌తోనే స్టైలిష్‌గా ఎలా కనిపించచ్చో విభిన్న హెయిర్‌స్టైల్స్‌ చేయించుకొని అందరికీ చూపించింది.

ఇలా ధైర్యం, చురుకుదనం, అందం కలగలిసిన ధన్యను చూసి అందరూ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా యాడ్‌ షూట్‌లో పెళ్లికూతురిగా ముస్తాబైన ఆమె చిరునవ్వుకు సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీల దాకా ఫిదా అయిపోతున్నారు. ‘బ్యూటిఫుల్‌ బ్రైడ్‌’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. తమన్నా, కరీనా కపూర్‌ వంటి తారలు ఆమె యాడ్‌ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ నేటి యువతకు ధన్య స్ఫూర్తి అని ప్రశంసిస్తున్నారు. త్వరలోనే ఆమె తన జబ్బును జయించి పూర్తి ఆరోగ్యంతో ముందుకెళ్లాలని, తన కలల్ని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.

ఆల్‌ ది బెస్ట్‌ బ్యూటీ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్