NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
అంతరిక్షంలోకి వెళ్లడం, అంతులేని విశ్వ రహస్యాలను తెలుసుకోవడం.. ఎవరికైనా ఆసక్తే! అయితే ఈ కలను సాకారం చేసుకునే అదృష్టం మాత్రం అతి తక్కువమందికే దక్కుతుంది. తాజాగా ఆ అరుదైన అవకాశం అందుకుంది కేరళలోని తిరువనంతపురానికి చెందిన 24 ఏళ్ల అథిరా ప్రీతా రాణి. అంతరిక్షంలోకి వెళ్లాలని చిన్న వయసు నుంచే కలలు కన్న ఆమె.. .....
అంతరిక్షంలోకి వెళ్లడం, అంతులేని విశ్వ రహస్యాలను తెలుసుకోవడం.. ఎవరికైనా ఆసక్తే! అయితే ఈ కలను సాకారం చేసుకునే అదృష్టం మాత్రం అతి తక్కువమందికే దక్కుతుంది. తాజాగా ఆ అరుదైన అవకాశం అందుకుంది కేరళలోని తిరువనంతపురానికి చెందిన 24 ఏళ్ల అథిరా ప్రీతా రాణి. అంతరిక్షంలోకి వెళ్లాలని చిన్న వయసు నుంచే కలలు కన్న ఆమె.. తాజాగా నాసా నిర్వహించే ‘వ్యోమగామి శిక్షణ కార్యక్రమా’నికి ఎంపికైంది. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లబోయే మూడో భారతీయ మహిళగా అథిరా చరిత్ర సృష్టించనుంది. ‘లక్ష్యం ఏర్పరచుకోవడమే కాదు.. దాన్ని చేరుకునే దిశగా ప్రయత్నం చేసినప్పుడే విజయం సాధించగలం..’ అంటోన్న ఈ యువ ఆస్ట్రోనాట్ స్ఫూర్తి గాథ ఇది!
కేరళలోని తిరువనంతపురానికి చెందిన వేణు-ప్రీతాల గారాలపట్టి అథిరా ప్రీతా రాణి. ఆమెకు చిన్న వయసు నుంచే అంతరిక్షమంటే విపరీతమైన ఆసక్తి. అదెంతలా అంటే.. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే స్థానిక ఆస్ట్రనామికల్ సొసైటీ ‘ఆస్ట్రా’లో నిర్వహించే ప్రత్యేక తరగతులకు హాజరయ్యేదామె. ఇలా క్రమంగా అంతరిక్షంపై ఆమెకు పట్టు పెరిగింది.
మార్గం సుగమమయ్యేందుకు..!
అంతరిక్షంపై అథిరాకు ఉన్న ఆసక్తిని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఈ రంగంలోనే ఆమెను ప్రోత్సహించారు. అయితే ఆమె మాత్రం కోర్సు ఫీజుల కోసం వారిపై ఆధారపడాలనుకోలేదు. పార్ట్‌టైమ్ క్లాసులు, పిల్లలకు ట్యూషన్లు చెప్తూనే డబ్బు కూడబెట్టుకుంది. అంతేకాదు.. పైలట్ అయితే తన అంతరిక్ష కలను మరింత త్వరగా, సునాయాసంగా చేరుకోవచ్చని నిర్ణయించుకున్న ఆమె.. తాను పోగేసుకున్న డబ్బుతోనే కెనడాలో పైలట్ ట్రైనింగ్ తీసుకుంది. ఇదే సమయంలో అక్కడి Algonquin Collegeలో రోబోటిక్స్ కోర్సులో చేరేందుకు స్కాలర్‌షిప్ లభించిందామెకు. ఓవైపు పైలట్ ట్రైనింగ్ తీసుకుంటూనే.. మరోవైపు రోబోటిక్స్ కోర్సును కూడా మెరిట్‌తో పూర్తి చేసింది. చదువు పూర్తికాగానే తాను ఇష్టపడిన గోకుల్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి కెనడాలోనే Exo Geo Aerospace అనే సంస్థను ప్రారంభించారు. అంతరిక్ష అధ్యయనాలకు సంబంధించిన పరిశోధనలు నిర్వహించే సంస్థ ఇది.
అందివచ్చిన అదృష్టం!
ఓవైపు తన సంస్థ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. మరోవైపు ‘వ్యోమగామి శిక్షణ కార్యక్రమాల’ గురించి ఆరా తీయడం ప్రారంభించింది అథిరా. ఈ క్రమంలోనే నాసా, కెనెడియన్ స్పేస్ ఏజెన్సీ, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడా.. సంయుక్తంగా నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకుంది. ఈ ప్రోగ్రామ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 12 మంది ఎంపిక కాగా.. అందులో భారత్ నుంచి అథిరా చోటు దక్కించుకుంది. ఇందులో భాగంగా శారీరక, మౌఖిక, వైద్య పరీక్షల అనంతరం ఆమెను ఎంపిక చేశారు. 3 నుంచి 5 ఏళ్ల పాటు కొనసాగే ఈ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే.. అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఆమెకు అవకాశం దక్కుతుంది. తద్వారా భారత్ నుంచి కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న మూడో మహిళగా చరిత్రలో అథిరా పేరు నిలిచిపోనుంది.
అది నాకు గర్వకారణం!
నాసా శిక్షణకు ఎంపికవడంతో తన కలకు అతి చేరువలోకి వచ్చిన అథిరా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. దేశం తరఫున ఈ అరుదైన శిక్షణ కార్యక్రమానికి అర్హత సాధించడం గర్వంగా ఉందంటోందీ యువ కెరటం. ‘కెనడాలో స్థిరపడ్డా ఒక భారత పౌరురాలిగా ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేశా. భారతీయురాలిగానే ఈ శిక్షణ పొందనున్నా.. ఈ క్రమంలో నా ట్రైనింగ్ సూట్‌పై మువ్వన్నెల జెండాను ధరించడం నాకెంతో గర్వంగా అనిపిస్తోంది. ఇక శిక్షణలో భాగంగా మొదటి రెండు నెలలు యుద్ధ విమాన పైలట్‌గా మెలకువలు నేర్పుతారు. స్కూబా డైవింగ్‌లోనూ శిక్షణనిస్తారు..’ అంటూ తన తదుపరి శిక్షణ గురించి చెప్పుకొచ్చింది అథిరా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.