Meesakkari: నా మీసం.. నా ఇష్టం.. మీకేంటి సమస్య?!

ముఖంపై అవాంఛిత రోమాలుంటే అసౌకర్యానికి గురవుతాం.. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటాం. అందుకే అవి పెరగకముందే తొలగించుకుంటాం.. కానీ తాను మాత్రం ఇందుకు భిన్నం అంటోంది కేరళలోని కన్నూరుకు చెందిన శైజ. ఆమెకు యుక్త వయసు నుంచే పైపెదవి పైభాగంలో....

Published : 23 Jul 2022 16:31 IST

(Photos: Instagram)

ముఖంపై అవాంఛిత రోమాలుంటే అసౌకర్యానికి గురవుతాం.. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటాం. అందుకే అవి పెరగకముందే తొలగించుకుంటాం.. కానీ తాను మాత్రం ఇందుకు భిన్నం అంటోంది కేరళలోని కన్నూరుకు చెందిన శైజ. ఆమెకు యుక్త వయసు నుంచే పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరగడం ప్రారంభమై.. కొన్నేళ్లకు అది కోరమీసంలాగా మారిపోయింది. ఈ క్రమంలో సమాజం నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నా.. స్వీయ ప్రేమకే ఓటేసిందామె. ‘నా మీసం.. నా ఇష్టం.. దీనివల్ల నాకే ఇబ్బందీ లేనప్పుడు మీకెందుకు సమస్య?!’ అంటూ బాడీ పాజిటివిటీని చాటుతోన్న శైజ కథేంటో తెలుసుకుందాం రండి..

ఈ ప్రపంచంలో ఎవరి సమస్యలు వారివి. అయినా అన్నీ నాకే కావాలన్నట్లు.. కొంతమంది ఎదుటివారిలో లోపాలు వెతకడం, వారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. నిజానికి వాటిని పట్టించుకుంటేనే అసలు సమస్య మొదలవుతుంది. అదే తనలా వదిలేస్తే.. ‘అవతలి వారికి అనే అవకాశం, మనకు పడే అవకాశం.. రెండూ ఉండవం’టోంది శైజ.

‘అసలా? నకిలీనా?’ అనడిగేవారు!

కేరళ కన్నూరులోని కుతుపరంబ అనే ప్రాంతంలో పుట్టిపెరిగిన శైజ చిన్న వయసు నుంచే అన్ని అంశాల్లో చురుగ్గా ఉండేది. పైగా ప్రతి విషయంలో తనను తాను ప్రేమించుకోవడం, తన నిర్ణయాల్ని తాను గౌరవించుకోవడం చేసేది. ఇలా ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే నడుచుకునేదామె. అయితే యుక్తవయసులోకి అడుగుపెట్టాక.. తన పైపెదవి పైభాగంలో అవాంఛిత రోమాలు పెరగడం ప్రారంభమయ్యాయి. క్రమంగా అవి ఎక్కువవడంతో కొన్నాళ్లకు అది నూనూగు మీసంలాగా కనిపించసాగింది. మరికొన్నాళ్లకు అది కోరమీసంలాగా ఒత్తుగా మారిపోయింది. ఇది చూసి చాలామంది ఆమెకు ఉచిత సలహాలిచ్చేవారు. వీటిని తొలగించుకోవడానికి పలు చిట్కాలు, పద్ధతులు సూచించేవారు. మరికొందరు ‘అసలు ఇది నిజమైందేనా? నకిలీదా?’ అని హేళన చేసేవారు.. ఇంకొందరు విచిత్రంగా చూసేవారు. ఇలా ఇవన్నీ భరించినా తాను మాత్రం తన మీసాన్ని తొలగించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదంటోంది శైజ.

‘మీసక్కరి’ పేరుతోనే..!

‘ఎక్కడికెళ్లినా నా మీసం పైనే అందరి దృష్టీ పడేది. మా అమ్మాయిని స్కూల్లో దింపడానికి వెళ్లినా, గుడికెళ్లినా.. అక్కడున్న ప్రతి ఒక్కరూ దీని గురించే ప్రశ్నించేవారు. నిజానికి నా మీసం వల్ల నాకే కాదు.. నా భర్తకు, ఇతర కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యా లేదు. పైగా మేం దీని గురించి అసలు ఆలోచించం కూడా! అలాంటిది ఇతరులకు దీనివల్ల ఏం నష్టమో నాకిప్పటికీ అర్థం కాదు. అందుకే అలాంటి వాళ్ల మాటలు నేను పట్టించుకోను. అంతేకాదు.. గతంలో నేను ఎదుర్కొన్న కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా నన్ను మానసికంగా మరింత దృఢంగా మార్చాయి. ఏదేమైనా ఇలా నలుగురు మాట్లాడే మాటలే నా మీసంపై నాకు మరింత ప్రేమ పెరిగేలా చేశాయి. నాలో ఉన్న ప్రత్యేకత ఇదే. కాబట్టే అందరూ నా గురించి మాట్లాడుకుంటున్నారు. విలువైన సలహాలే కాదు.. ఎన్ని విలువైన బహుమతులిచ్చినా నా మీసాన్ని మాత్రం తొలగించుకోను. కొంతమంది నాకు ‘మీసక్కరి’ (మీసాలున్న మహిళ) అని పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం అదే పేరుతో సోషల్‌ మీడియా పేజీలు క్రియేట్‌ చేసి నా ఫొటోల్ని పోస్ట్‌ చేస్తున్నా.. నా మీసమంటే నాకంత గౌరవం మరి! అందుకే అనవసర విషయాల గురించి ఆలోచించి సమయం వృథా చేసుకోకండి..!’ అంటూ తనను విమర్శించిన వారికి కౌంటర్‌ ఇస్తోంది శైజ.

ఇలా ఆమె స్వీయ ప్రేమను, బాడీ పాజిటివిటీని, ధైర్యాన్ని చూసి కొంతమంది ఆమెను ప్రశంసిస్తూ పోస్టులు కూడా షేర్‌ చేస్తున్నారు.


అసలెందుకిలా?!

శైజ ఒక్కర్తే కాదు.. గతంలో హర్నామ్‌ కౌర్‌ అనే అమ్మాయి కూడా తన మీసం, గడ్డంతో వార్తల్లో నిలిచింది. తన సమస్యతో ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్న ఆమె.. తనలోని బాడీ పాజిటివిటీని చాటుతూనే.. సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా, మోటివేషనల్‌ స్పీకర్‌గా, లైఫ్‌స్టైల్‌ కోచ్‌గా.. పేరు సంపాదించుకుంది. అంతేకాదు.. తనకున్న ఈ ప్రత్యేకతతోనే గిన్నిస్‌ రికార్డూ నెలకొల్పింది.

అయితే కొంతమంది మహిళల్లో ఇలా మీసాలు, గడ్డం పెరగడానికి కారణం.. వాళ్ల శరీరంలో ఆండ్రోజెన్స్‌ (పురుష హార్మోన్లు) అసాధారణ స్థాయిలో ఉత్పత్తి అవడమే! దీన్నే ‘హిర్సుటిజం’గా పేర్కొంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం మనం వాడే కొన్ని రకాల మందులు, పీసీఓఎస్‌.. వంటివి కూడా మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంటాయి. ఫలితంగా కూడా అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవుతుంది.

అయితే దీనివల్ల చాలామంది మహిళలు సమాజం నుంచి విమర్శల్ని ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. కానీ స్వీయ ప్రేమను పెంచుకుంటూ.. నిపుణుల సలహా మేరకు వీటిని సురక్షితంగా తొలగించుకునే పద్ధతుల్ని ఎంచుకోవడం, లేదంటే శైజ, హర్నామ్‌లా బాడీ పాజిటివిటీని చాటుకోవడం.. వంటివి చేస్తే ఇటు శారీరకంగా, అటు మానసికంగా దృఢంగా ఉండచ్చు.. మరి, మీరేమంటారు?!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని