Khushboo Gandhi : కొబ్బరి పీచుతో పర్యావరణహిత ప్యాకింగ్‌!

ఈ రోజుల్లో ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకుంటున్నాం.. ఇలా మనం కొనుక్కున్న వస్తువుల్ని బబుల్‌ ర్యాపర్‌, ఫోమ్‌ షీట్స్‌లో ర్యాప్‌ చేసి ఇంటికి పంపిస్తున్నాయి ఆయా సంస్థలు. అయితే ఎంతసేపూ వస్తువులు డ్యామేజ్‌ కాకుండా.. జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నాయా, లేదా అనేదే పట్టించుకుంటామే తప్ప.. ఈ ర్యాపర్స్‌ తయారీలో వాడే ప్లాస్టిక్‌ గురించిన కనీస ఆలోచన చేసే వారు అరుదు.

Published : 24 Jun 2024 13:09 IST

(Photos: Instagram)

ఈ రోజుల్లో ఏది కావాలన్నా ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకుంటున్నాం.. ఇలా మనం కొనుక్కున్న వస్తువుల్ని బబుల్‌ ర్యాపర్‌, ఫోమ్‌ షీట్స్‌లో ర్యాప్‌ చేసి ఇంటికి పంపిస్తున్నాయి ఆయా సంస్థలు. అయితే ఎంతసేపూ వస్తువులు డ్యామేజ్‌ కాకుండా.. జాగ్రత్తగా ఇంటికి చేరుకున్నాయా, లేదా అనేదే పట్టించుకుంటామే తప్ప.. ఈ ర్యాపర్స్‌ తయారీలో వాడే ప్లాస్టిక్‌ గురించిన కనీస ఆలోచన చేసే వారు అరుదు. ఖుష్బూ గాంధీ ఇలాగే ఆలోచించింది. పర్యావరణహితమైన వస్తువులకే తన ఇంట్లో, జీవితంలో చోటిచ్చే ఆమె.. ఇదే సూత్రాన్ని అందరితో పాటింపజేసేందుకు ఏకంగా ఓ సంస్థనే స్థాపించింది. ఈ వేదికగా పర్యావరణహిత ప్యాకింగ్‌ ఉత్పత్తుల్ని తయారుచేస్తూ.. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తన వంతుగా కృషి చేస్తోంది. ‘పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటోన్న ఖుష్బూ పరిచయం ఇది!

పుణేలో పుట్టి పెరిగిన ఖుష్బూ పర్యావరణ ప్రేమికురాలు. ఈ మక్కువతోనే చిన్న వయసు నుంచే సస్టెయినబుల్‌ లైఫ్‌స్టైల్‌ను అలవర్చుకుంది. అంటే.. ఆమె ఉపయోగించే ప్రతి వస్తువూ పర్యావరణహితంగానే ఉండేలా జాగ్రత్తపడుతుంది. నిఫ్ట్‌లో ‘డిజైన్‌-మెటీరియల్‌ డెవలప్‌మెంట్‌’ విభాగంలో ఉన్నత విద్య పూర్తిచేసిన ఆమె.. ఇక్కడే తనకు ప్యాకేజింగ్‌ డిజైనింగ్‌పై ఆసక్తి పెరిగిందని చెబుతోంది.

చిన్నతనం నుంచే.. ఆ అలవాట్లు!

‘నేను పుట్టి పెరిగిన వాతావరణం పర్యావరణహితంగానే ఉండేది. తీసుకునే ఆహారం దగ్గర్నుంచి, వేసుకొనే దుస్తుల దాకా.. ఇంట్లో అమ్మానాన్నలు ప్రతిదీ ఎకో-ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్తపడేవారు. మాకూ ఆ అలవాట్లు నేర్పించారు. చిన్నతనంలో నాకు గిఫ్ట్‌గా వచ్చిన ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తుల్ని ఎంతో అపురూపంగా దాచుకునేదాన్ని. ఆఖరికి గిఫ్ట్‌ రిబ్బన్లతో సహా! అయితే ట్రెక్కింగ్‌ చేద్దామని 2015లో ఓసారి లడఖ్‌ వెళ్లాను. అక్కడి కొండ ప్రాంతాల్లో, పారే నీటిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోవడం చూసి నా మనసు ముక్కలైంది. ప్లాస్టిక్‌ వల్ల పర్యావరణానికి ఎంతగా నష్టం జరుగుతుందో అప్పుడు నాకర్థమైంది. ఎలాగైనా ఈ సమస్యకు చరమగీతం పాడాలనుకున్నా. బార్సిలోనాలో ‘మెటీరియల్‌ డెవలప్‌మెంట్‌’లో మాస్టర్స్‌ చేసి తిరిగొచ్చాక.. నా ఆలోచనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించా. మాస్టర్స్‌ చదివే సమయంలోనే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ఎలాంటి మెటీరియల్స్‌ ఉపయోగించాలి.. వాటితో డిజైనింగ్‌ ఎలా చేయచ్చు.. వంటి నైపుణ్యాలు నేర్చుకున్నా..’ అంటోంది ఖుష్బూ.

ప్రతి దాంట్లో.. ప్లాస్టికే!

ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయం కనుక్కునే దిశగా ఆలోచించిన ఆమె.. ఏడాది పాటు దీనిపై పలు పరిశోధనలు సాగించింది. ఈ క్రమంలోనే పర్యావరణహిత ప్యాకింగ్‌, ర్యాపింగ్‌ ఉత్పత్తుల్ని తయారుచేయాలన్న ఆలోచన వచ్చిందామెకు. ఇదే 2021లో ‘Go Do Good’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించేలా చేసింది. తన సోదరుడు రోణక్‌, భర్త చాణక్యతో కలిసి ఈ వ్యాపారానికి తెరతీసింది ఖుష్బూ.

‘ప్యాకేజింగ్‌ పరిశ్రమల్లో ప్లాస్టిక్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. ప్యాకింగ్‌ కోసం ఉపయోగించే వస్తువులు మొదలు.. దానిపై ముద్రించే ఇంక్‌ దాకా ప్రతి దాంట్లో ప్లాస్టిక్‌, లోహపు సంకలనాలు, పారాఫిన్‌ మైనం, సింథటిక్‌ రసాయనాలు.. వంటివెన్నో వాడుతున్నారు. ఇవి పర్యావరణానికే కాదు.. ఆరోగ్యానికీ హానికరం. అలాగే వాటర్‌ప్రూఫ్‌ కోసం ప్యాకింగ్‌లపై వాడే ల్యామినేషన్‌, అతికించడానికి వాడే గ్లూ.. వంటివి కూడా ప్లాస్టిక్‌ మెటీరియల్స్‌తో రూపొందించినవే! అందుకే ఈ అంశాలపై దృష్టి సారించాం. వీటికి ప్రత్యామ్నాయంగా ఎకో-ఫ్రెండ్లీ వస్తువుల్ని తయారుచేస్తున్నాం..’ అంటోందీ ఎకో లవర్‌.

వేటికి.. ఏవి ప్రత్యామ్నాయం?

పర్యావరణహిత ప్యాకింగ్‌ను అందించాలన్న ముఖ్యోద్దేశంతో తాను ప్రారంభించిన సంస్థ వేదికగా.. ఆయా ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తుల్ని తయారుచేస్తోంది ఖుష్బూ. ఈ క్రమంలో బబుల్‌ ర్యాప్‌కు బదులుగా కొబ్బరి పీచుతో పౌచ్‌లు; గ్లూ కోసం చింతగింజలు; సముద్రపు నాచు, సహజ రంగులతో ఎకో-ఫ్రెండ్లీ ఇంక్‌; ప్యాకింగ్‌ కోటింగ్‌ కోసం మొక్కల ఆధారిత ఉత్పత్తులతో తయారుచేసిన ప్రత్యేకమైన గమ్‌; ప్లాస్టిక్‌ ఫోమ్‌కు బదులుగా ఉన్ని వ్యర్థాలతో తయారుచేసిన ఫోమ్‌ పౌచ్‌లు.. వంటి ఎకో-ఫ్రెండ్లీ ఉత్పత్తుల్ని తయారుచేస్తోందామె. అలాగే నీటిలో తడవకుండా ప్యాకింగ్‌ను చుట్టడానికి సముద్రపు నాచుతో ప్రత్యేకమైన ఫిల్మ్‌/షీట్‌ను తయారుచేసి త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెబుతోంది ఖుష్బూ.
‘మేం తయారుచేసే ప్యాకింగ్‌ ఉత్పత్తులన్నీ వంద శాతం పర్యావరణహితమైనవే! వాడకం పూర్తయ్యాక వీటిని ఇంటి ఆరుబయట మట్టిలో కప్పి పెడితే 30-45 రోజుల్లో భూమిలో కలిసిపోతాయి. అలాగే వీటి నాణ్యత విషయంలోనూ ఎక్కడా మేం రాజీ పడలేదు. ప్రస్తుతం సీవీడ్‌ షీట్స్‌ తయారుచేస్తున్నాం. త్వరలోనే వీటిని మార్కెట్లోకి తీసుకొస్తాం..’ అంటూ తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి వివరిస్తోందామె.

మార్పు రావాలంటే..!

వ్యాపార రంగంలో మహిళలు రాణించాలంటే స్వీయ నమ్మకం ఉన్నా.. సమాజ పరంగా పలు సవాళ్లను ఎదుర్కోక తప్పదంటోంది ఖుష్బూ. ‘వ్యాపారంలోకి అడుగుపెట్టాక ఓ మహిళగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. చాలామంది నా శక్తిసామర్థ్యాలపై సందేహం వ్యక్తం చేశారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగా. మనం ఎంచుకున్న దారేదైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఎన్ని సవాళ్లు ఎదురైనా అధిగమించి లక్ష్యాన్ని చేరుకోగలం. సమాజంలోనూ మార్పు తీసుకురాగలం..’ అంటూ తన మాటలతోనూ యువ వ్యాపారవేత్తల్లోనూ స్ఫూర్తి నింపుతోందీ మహిళా ఆంత్రప్రెన్యూర్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్