అమ్మ చెప్పిన చిట్కాలతోనే ఈ అందం!

అందాల తారలనగానే ముందుగా మేకపే గుర్తొస్తుంది.. అయితే అది కెమెరా ముందు మాత్రమేనని, తెర వెనుక న్యాచురల్‌గా ఉండడమంటేనే తమకిష్టమని చెబుతుంటారు కొందరు ముద్దుగుమ్మలు. అంతేనా.. సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలకే ఓటేస్తుంటారు. తాను కూడా ఇదే కోవలోకొస్తానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ. తన మేని మెరుపుకి కారణమైన బ్యూటీ చిట్కాలను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకుందీ ముద్దుగుమ్మ.

Published : 20 Aug 2021 17:15 IST

(Photo: Instagram)

అందాల తారలనగానే ముందుగా మేకపే గుర్తొస్తుంది.. అయితే అది కెమెరా ముందు మాత్రమేనని, తెర వెనుక న్యాచురల్‌గా ఉండడమంటేనే తమకిష్టమని చెబుతుంటారు కొందరు ముద్దుగుమ్మలు. అంతేనా.. సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలకే ఓటేస్తుంటారు. తాను కూడా ఇదే కోవలోకొస్తానంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కియారా అడ్వాణీ. తన మేని మెరుపుకి కారణమైన బ్యూటీ చిట్కాలను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకుందీ ముద్దుగుమ్మ.

అది అమ్మ చిట్కా!

అమ్మ నా కోసం ప్రత్యేకంగా ఇంట్లోనే ఓ బ్యూటీ రెసిపీని సిద్ధం చేస్తుంటుంది. అదేంటంటే.. టేబుల్‌స్పూన్‌ శెనగపిండిలో కొద్దిగా తాజా క్రీమ్‌ వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల పాటు ఉంచుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ చిట్కాను నేను నెలకోసారి పాటిస్తుంటా.. అప్పుడప్పుడూ శెనగపిండిలో పాలు, తేనె, నిమ్మరసం.. వంటివి కలుపుకొని కూడా ఉపయోగిస్తా.

తక్షణ మెరుపు కోసం ఇలా చేస్తా!

అందాన్ని సంరక్షించుకోవడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు అప్పటికప్పుడు ముఖానికి మెరుపును అందించాలనుకుంటే.. నేను ఉపయోగించే పదార్థం టొమాటో పేస్ట్‌. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని నెమ్మదిగా మర్దన చేయాలి. కొద్ది సేపటి తర్వాత కడిగేసుకుంటే మోముకు తక్షణ మెరుపు వస్తుంది. ఇదిలాగే కొనసాగాలంటే తరచూ ఈ చిట్కా పాటించడం మంచిది.. టొమాటో పేస్ట్‌తో పాటు అప్పుడప్పుడూ బొప్పాయి గుజ్జు కూడా వాడతా. ఈ చిట్కా తప్పకుండా వర్కవుట్‌ అవుతుంది. కావాలంటే మీరూ ట్రై చేయండి.

వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్‌!

చాలామంది వర్షాకాలంలో సన్‌స్క్రీన్‌ రాసుకోరు.. ఎందుకంటే సూర్యరశ్మి ఉండదు.. ఒకవేళ ఉన్నా సూర్యకిరణాల ప్రభావం అంతగా ఉండదనుకుంటారు. కానీ ఈ కాలంలోనూ సన్‌స్క్రీన్‌ రాసుకోవాల్సిందే! అది కూడా ఆయిల్‌ రహితమైనది ఎంచుకోవాలి. అప్పుడే చర్మం తేమను కోల్పోకుండా, మరీ జిడ్డుగా మారకుండా ఉంటుంది. నేను ఏ కాలమైనా సన్‌స్క్రీన్‌ లేనిదే బయట అడుగుపెట్టను. ఇక క్లెన్సింగ్‌, మాయిశ్చరైజేషన్‌.. ఈ రెండూ నిత్యం నా బ్యూటీ రొటీన్‌లో ఉండాల్సిందే! ఇక రాత్రుళ్లు ఎంత ఆలస్యమైనా మేకప్‌ తొలగించనిదే నిద్రపోను.

ఆహారంతో అందం!

మనం రోజంతా తీసుకునే ఆహారం కూడా ముఖ సౌందర్యాన్ని ఇనుమడిస్తుంది. అందుకే ఈ విషయంలో నేను కచ్చితంగా వ్యవహరిస్తుంటా. ఉదయం లేవగానే గ్లాసు గోరువెచ్చటి నీళ్లతో రోజును ప్రారంభిస్తా. చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకునేందుకు నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు-కాయగూరలు తీసుకోవడం.. వంటివి చేస్తా. చక్కెర, ఉప్పు, బటర్‌ ఎక్కువగా ఉపయోగించి తయారుచేసే పదార్థాల్ని పూర్తిగా దూరం పెడతా.

జుట్టుకు గుడ్డు!

పొడవాటి జుట్టే అమ్మాయిలకు అందమంటారు. నా జుట్టు నాకెంతో విలువైంది. అందుకే కేశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తా.

*గుడ్డు, పెరుగు కలిపిన హెయిర్‌మాస్క్‌ను చిన్నతనం నుంచే పాటిస్తున్నా. ముఖ్యంగా హోలీ సమయంలో రంగుల కారణంగా నిర్జీవమైన జుట్టుకు పునరుత్తేజం కలిగించడానికి ఈ మాస్క్‌ ఉపయోగపడుతుంది.

*పొడిగా మారిన జుట్టును కత్తిరించుకోవడం చాలామంది చేసే పొరపాటు.. దీనికి బదులు తరచూ నూనె రాస్తుంటే ఈ సమస్య ఎదురుకాదు. నేనూ వారానికోసారి ఈ చిట్కా పాటిస్తుంటా.

*చుండ్రు సమస్య ఎదురైనప్పుడు కుదుళ్లు, జుట్టుకు పెరుగు పట్టిస్తా. తద్వారా సమస్య దూరమవుతుంది.

*చిట్లిన జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు ట్రిమ్‌ చేస్తుంటా. తద్వారా సమస్య పెద్దదవకుండా జాగ్రత్తపడచ్చు.

వీటన్నింటితో పాటు మన అందంలో వ్యాయామం పాత్ర కూడా ఉంటుంది. అందుకే రోజూ ఓ 20 నిమిషాల పాటు పరుగుకు సమయం కేటాయిస్తా. ఈ సింపుల్‌ వర్కవుట్‌ చర్మానికి తరగని మెరుపును అందిస్తుంది.

‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు వారిని అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ‘భూల్‌ భులయా 2’, ‘జగ్‌ జగ్‌ జీయో’, ‘మిస్టర్‌ లేలే’.. వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ బాలీవుడ్‌ బేబ్‌ నటించిన ‘షేర్‌షా’ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్