Healty Eating: తినిపిస్తూ.. నేర్పించండి..

పిల్లలు.. వాళ్ల చిన్న పొట్ట నిండా అన్నం తిన్నప్పుడే హాయిగా ఆడుకోగలుగుతారు. కానీ వీళ్ల బొజ్జలు నింపడమే అమ్మలకు పెద్ద టాస్కు. ఏం ఇచ్చినా తిననని విసిగించే గడుగ్గాయులే ఎక్కువ మరి! వాళ్ల వంకలతో మనకేమో చిరాకొస్తుంది.

Published : 17 Apr 2023 00:24 IST

పిల్లలు.. వాళ్ల చిన్న పొట్ట నిండా అన్నం తిన్నప్పుడే హాయిగా ఆడుకోగలుగుతారు. కానీ వీళ్ల బొజ్జలు నింపడమే అమ్మలకు పెద్ద టాస్కు. ఏం ఇచ్చినా తిననని విసిగించే గడుగ్గాయులే ఎక్కువ మరి! వాళ్ల వంకలతో మనకేమో చిరాకొస్తుంది. అలాంటి వారికి నోటి కంటే ముందు కంటికి రుచిగా కనిపించేలా చేయాలంటున్నారు నిపుణులు. అదెలాగో చదివేయండి మరి..

* ముందు చిన్నారులకు భోజనం పెట్టే ప్లేటు లేదా గిన్నె అందంగా ఉండేలా చూసుకోవాలి. ఆకృతిలోనైనా, రంగుల్లోనైనా ఇంట్లో ఉండే సాధారణ పాత్రలకు భిన్నంగా వారివి ఉండాలి. వాళ్లు మెచ్చే, చూపుని ఆకర్షించే ప్రింట్‌లు, రంగులతో ఉన్నవి తీసుకోండి. వారినే ఎంపిక చేసుకోనిస్తే ఇంకా మంచిది. ఇకప్పుడు భోజనం ఇష్టంగా తింటారు.

* మంచిది అన్న ప్రతిదీ వాళ్లకి నచ్చాలని లేదు. అందుకే చూడగానే వద్దు అనేస్తుంటారు. ‘మొన్న నీకు కడుపులో నొప్పి వచ్చింది కదా! చాలా ఏడ్చేశావు కదూ.. ఇది తింటే రాదు. తిని చూడు’ ఇలా ఒక్కోదాని వల్ల లాభాలేంటో వాళ్ల భాషలో వివరించాలి. అప్పుడు కొత్త విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది. ఆనందంగానూ తినేస్తారు.

* జంక్‌ఫుడ్‌ కావాలని మారం చేస్తోంటే.. నష్టాల గురించి వివరిస్తే సరి. పూర్తిగా వద్దన్నా వాళ్లతో కష్టమే. కాబట్టి.. వారంలో ఇన్నిసార్లే తినాలని చెబితే వింటారు. అలాకాదని కోప్పడితే మొండిగా ప్రవర్తించే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి, నెమ్మదిగా చెబుతూనే.. దూరంగా ఉంచాలి.

* ఒకేసారి బొజ్జ నింపేయాలనుకుంటారు కొందరు అమ్మలు. దీంతో పిల్లలకీ తిండిపై విరక్తి వస్తుంది. పెద్ద వాళ్లలా మూడు పూటలా భోజనం పద్ధతి వీళ్లకి పాటించొద్దు. వయసుని బట్టి ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వండి. ప్రతిసారీ అన్నమే కాదు.. తాజా కూరగాయలు, పండ్లనూ ఇవ్వాలి.

* ముఖ్యంగా పిల్లలకు భోజనం పెడుతున్న సమయంలో టీవీలు, ఫోన్‌లు పక్కన పెట్టేయండి. వాటిని చూస్తూ తినడం అలవాటయితే రోజూ అలాగే కావాలని మారాం చేస్తారు. అది చెడ్డ అలవాటని నచ్చజెప్పి మొదట్లోనే ఆపే ప్రయత్నం చేయండి. టేబుల్‌ మ్యానర్స్‌ నేర్పించండి. ఇంట్లో పద్ధతిగా ఉండటం అలవాటు చేస్తేనే బయటా కొనసాగించగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్