Published : 27/11/2022 14:30 IST

పిల్లల్లో ఆ సమస్యల పరిష్కారానికే ఈ స్టార్టప్!

ఎదిగే క్రమంలో పిల్లలకేమైనా సమస్యలు ఎదురైతే..? తల్లిదండ్రుల్లో టెన్షన్‌ మొదలవుతుంది. దాన్నెలా పరిష్కరించుకోవాలో, తిరిగి పిల్లల్ని ఎలా గాడిలో పెట్టాలో అర్థం కాదు. అలాంటి పేరెంట్స్‌కి తామున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు వైజాగ్‌కు చెందిన షిరీన్‌ సుల్తానా. వయసుకు తగ్గట్లుగా చిన్నారుల ఎదుగుదలను గుర్తించి; ప్రత్యేకించి నేర్చుకోవడంలో, మాట్లాడడంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వివిధ థెరపీల ద్వారా సరిచేయడానికి తన స్నేహితురాలు సుమేధాతో కలిసి ఓ యాప్‌ని రూపొందించారామె. శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్‌గా.. ఇలా ప్రతి కోణం నుంచి చిన్నారుల ఎదుగుదలను గుర్తిస్తూ, వాటికి పరిష్కార మార్గాలు చూపిస్తూ.. పిల్లల బంగారు భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో భరోసా నింపుతోన్న షిరీన్‌.. తమ స్టార్టప్‌ ప్రయాణాన్ని ‘వసుంధర.నెట్‌’తో ఇలా పంచుకున్నారు.

నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్‌లోనే! నాకు చిన్నతనం నుంచీ డాక్టర్‌ కావాలన్న కోరిక ఉండేది. కానీ కొన్ని కారణాల రీత్యా కామర్స్‌ డిగ్రీ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐఐఎం ఇండోర్‌లో సుమేధ పరిచయమైంది. తను నా బ్యాచ్‌మేట్‌, రూమ్‌మేట్‌. తక్కువ కాలంలోనే మంచి స్నేహితులమయ్యాం. సమాజానికి ఉపయోగపడే మంచి వ్యాపారమొకటి ప్రారంభించాలన్న ఆలోచన మా ఇద్దరికీ ఉండేది. సందర్భం వచ్చినప్పుడల్లా దాని గురించే చర్చించుకునేవాళ్లం. ఈలోపు రెండేళ్లు గడిచిపోయాయి. 2003లో కోర్సు పూర్తయ్యాక నేను దాదాపు పదేళ్ల పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేశాను. సుమేధ సింగపూర్‌ వెళ్లిపోయి.. అక్కడే P&G కంపెనీలో చేరింది. ఇలా ఎవరి ఉద్యోగాల్లో వాళ్లున్నప్పటికీ వ్యాపారం గురించిన ఆలోచనలు మాత్రం కొనసాగుతూనే ఉండేవి.

బాబు పుట్టాకే అర్థమైంది!

మన అనుభవాలే మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయంటుంటారు. నా విషయంలోనూ ఇలాగే జరిగింది. పెళ్లై 2012లో గర్భం దాల్చాక.. కాబోయే అమ్మగా ఆ అనుభూతుల్ని ఆస్వాదించా. ఇక బాబు పుట్టాక.. పిల్లల పెంపకం, చిన్నారుల్లో మానసిక ఎదుగుదల గురించి సైన్స్‌ ఏం చెబుతోంది? వంటి విషయాల గురించి ఓ చిన్నపాటి అధ్యయనమే చేశాను. ఇదే సమయంలో సుమేధ కూడా తల్లైంది. తానూ ఇవే విషయాల గురించి వెతకడం మొదలుపెట్టింది. కానీ వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం మాకు లభించలేదు. పిల్లల విషయాల్లో ఇంట్లోని పెద్దలతో తమ సందేహాలు పంచుకోవడం తప్ప.. సంబంధిత నిపుణుల ద్వారా సలహాలు, సూచనలు పొందే తల్లిదండ్రుల శాతం చాలా తక్కువగా ఉందని మాకు అర్థమైంది. అందుకే ఈ బాధ్యత మేం తీసుకోవాలనుకున్నాం. ఈ అంతర్మథనమే మాతో 2020 జనవరిలో ‘కిండర్‌ పాస్‌’ అనే యాప్‌ను ప్రారంభించేలా చేసింది. ‘కిండర్‌’ అంటే జర్మన్‌లో చిన్నారి అని అర్థం.

సమస్యను గుర్తించడంతో మొదలుపెట్టి..!

తొలుత పిల్లల ఎదుగుదలలో లోపాలు, జాప్యాలు గుర్తించడం కోసం ఈ యాప్‌ను అభివృద్ధి చేసిన మేము.. ఆరు నెలల పాటు ఉచితంగా సేవలు అందించాం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగానే కాదు.. అమెరికా, ఆఫ్రికా, యూరప్‌ దేశాల వినియోగదారుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘కరోనా సమయంలో మా పిల్లలకు మీ యాప్‌ గ్రాండ్‌పేరెంట్స్‌లా పనిచేసింది’ అని తల్లిదండ్రులు ఫీడ్‌బ్యాక్‌ ఇవ్వడం చాలా సంతృప్తిగా అనిపించింది. ఆ తర్వాత నేర్చుకోవడంలో లోపాలు, జాప్యాలతో పాటు ఆటిజం, డౌన్‌ సిండ్రోమ్‌.. వంటి ఎదుగుదల సమస్యల్ని గుర్తించిన చిన్నారులకు.. వాళ్ల సమస్యలకు తగిన థెరపీలు అందించే దిశగా యాప్‌ను అభివృద్ధి చేశాం.

ఈ క్రమంలో 0-5 వయసున్న పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉందో, లేదో తెలుసుకోవడానికి మైల్‌స్టోన్‌ చెక్‌లిస్ట్‌ ఏర్పాటుచేశాం. వివిధ స్క్రీనింగ్‌ టూల్స్, అసెస్‌మెంట్స్‌ సహాయంతో.. అభ్యసన, గ్రాహ్యక శక్తి, శారీరక కదలికలు, భావోద్వేగ నైపుణ్యాలు.. మొదలైన అంశాల్ని ఆధారంగా చేసుకొని పిల్లల ఎదుగుదలను ట్రాక్‌ చేస్తాం. ఏవైనా లోపాలుంటే.. దాన్ని మరింత లోతుగా విశ్లేషించి.. వినియోగదారుల్ని సంబంధిత థెరపిస్ట్‌కి కనెక్ట్‌ చేస్తాం. పిల్లల సమస్యను బట్టి ఆయా నిపుణుల సహాయంతో ఆన్‌లైన్‌ థెరపీ సెషన్స్‌ నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో సంబంధిత టూల్స్‌ ఉపయోగించి పేరెంట్స్ పిల్లల చేత సాధన చేయించేలా చేస్తున్నాం. అలాగే ప్రతి సెషన్‌ తర్వాత సాధన చేయించడానికి వీలుగా వర్క్‌షీట్స్, లెసన్ ప్లాన్స్‌ ఇస్తున్నాం.

అనుభవజ్ఞులైన నిపుణుల సహాయంతో..!

గణాంకాల ప్రకారం.. 6 ఏళ్ల లోపు చిన్నారులు సుమారు ౧౬ కోట్ల మంది ఉంటే కేవలం 25 వేల మంది పిల్లల వైద్య నిపుణులున్నారు. ఇలా వైద్యుల కొరత వల్ల పిల్లల ఎదుగుదల విషయంలో నిపుణుల నుంచి పేరెంట్స్‌కి సరైన సలహాలు అందట్లేదు. మన దేశంలో ఇలాంటి కేసులు పెరగడానికి ఇదీ ఓ కారణమే! చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధిలో లోపాలు, వైకల్యాలున్న జాబితాలో ప్రపంచంలో మన దేశమే టాప్‌లో ఉంది. ఇలాంటి సమస్యను టెక్నాలజీ సహాయంతో అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం మా వద్ద 50-60 మంది అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఉంది. వారిలో ఆక్యుపేషనల్‌ థెరపిస్టులు, లాంగ్వేజ్‌ స్పెషలిస్టులు, స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్టులు, సైకాలజిస్టులు.. ఇలా వివిధ అంశాల్లో నైపుణ్యాలున్న వారున్నారు. కరోనా తర్వాత పిల్లల్లో మాటలు ఆలస్యం కావడం, నేర్చుకోవడంలో లోపాలు, ఆటిజం, ADHD.. వంటి కేసులు పెరిగినట్లు పలు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మా వద్దకొచ్చే కేసుల్లోనూ స్పీచ్‌ డిలేకు సంబంధించి సుమారు 50 శాతం ఉన్నాయంటే సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆటిజం కేసులు కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు మా యాప్‌కు 1.3 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌ అయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 10 వేలకు పైగా థెరపీ సెషన్స్‌ నిర్వహించాం. మా యాప్‌ను 2-12 ఏళ్ల పిల్లల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేశాం. అలాగే స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో కొంతమంది పిల్లలకు ప్రత్యేక తరగతుల్ని నిర్వహిస్తున్నాం.

ఆ విషయంలో ఆన్‌లైన్‌ మేలు!

సాధారణంగా థెరపీ అనగానే ఆఫ్‌లైన్‌ పద్ధతిలోనే ఎక్కువ ప్రయోజనాలు చేకూరతాయనుకుంటారు చాలామంది. అయితే  ఇద్దరూ వర్కింగ్‌ పేరెంట్స్‌ అయితే థెరపీ కోసం వారు ప్రత్యేకంగా సమయం కేటాయించలేకపోవచ్చు. అలాగే ట్రాఫిక్‌ కష్టాలు, థెరపీ సెంటర్‌ దగ్గర్లో లేకపోవడం, ఇతర కుటుంబ బాధ్యతల రీత్యా.. తల్లిదండ్రులు పిల్లల్ని తరచూ థెరపీకి తీసుకెళ్లలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ థెరపీ ఎంతో మేలు చేస్తుంది.. సౌలభ్యంగానూ ఉంటుంది. ఈ క్రమంలో మా సేవల్లో పాటించే నాణ్యత వల్ల ఈ రంగంలో పోటీ ఉన్నా రాణించగలుగుతున్నాం.


సరైన గైడెన్స్‌ దొరికింది!

ఈ ఏడాది ప్రారంభంలో మేం వీహబ్‌లో సభ్యత్వం తీసుకున్నాం. ఈ క్రమంలో వ్యాపారాభివృద్ధికి సంబంధించిన మెలకువలు నేర్పించడం, ఈ రంగంలోని నిపుణుల చేత మెంటరింగ్.. వంటి అంశాల్లో మాకు సహకారం లభిస్తోంది. అలాగే వీహబ్‌ ద్వారానే దుబాయ్‌ ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశం వచ్చింది. అక్కడ ఇతర వ్యాపారవేత్తలతో మాట్లాడడం, మా ఆలోచనలు పంచుకోవడం, వాళ్ల ఆలోచనలు తెలుసుకోవడం.. వంటివెన్నో మా వ్యాపార అభివృద్ధికి దోహదం చేశాయి. కమ్యూనిటీ యాక్సెస్‌లో భాగంగా ఇతర దేశాల స్టార్టప్స్‌తో అనుసంధానం కావడం, వ్యాపారాభివృద్ధికి సంబంధించిన ఉత్తమ మార్గాల్ని తెలుసుకోవడం.. వంటి విషయాల్లో సైతం మాకు సహకారం లభిస్తోంది. ఇక సంస్థ అభివృద్ధి కోసం సొంత సేవింగ్స్‌తో పాటు సీడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకున్నాం.


ఏ దేశంలో ఉన్నా..!

భారతీయులు ఏ దేశంలో ఉన్నా వారి మాతృభాషలో మా సేవల్ని అందించాలన్నదే మా లక్ష్యం. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో మా యాప్‌ ఆరు భాషల్లో అందుబాటులో ఉంది. మరో రెండేళ్లలో 15 భాషలకు విస్తరించాలనుకుంటున్నాం. నిపుణుల సంఖ్యను 50 నుంచి 300లకు చేర్చాలనుకుంటున్నాం. అలాగే నెలనెలా పిల్లల అభివృద్ధిని తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేస్తున్నాం. HYSEA- 2021 సదస్సులో ‘టాప్‌ - 10 స్టార్టప్స్‌’లో మా యాప్‌ చోటు దక్కించుకుంది. ఇటీవలే టీ-హబ్‌ నుంచీ గుర్తింపు లభించింది. స్టార్టప్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి ‘బెస్ట్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్‌’ అవార్డూ అందుకున్నాం.


సంకోచం ఎందుకు?!

‘మంచి ఉద్యోగం వదిలేసి సవాలుతో కూడిన వ్యాపారం ఎందుకు ప్రారంభించారు?’ అని అడిగిన వారూ లేకపోలేదు. అయినా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేశా. చేయాల్సిన పనులను ప్రాధాన్యక్రమంలో విభజించుకుంటే వర్క్-లైఫ్ బ్యాలన్స్ సులభమవుతుంది. ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదు.. ఒత్తిడిని అధిగమించడానికి మెడిటేషన్‌, యోగా సాధన చేస్తాను. అలాగే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సక్సెస్‌ కావాలన్నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతు తప్పనిసరి! ఈ విషయంలో నేను చాలా లక్కీ అని చెప్పాలి. పిల్లల్ని వాళ్ల ఆసక్తిని బట్టి మన పనిలో భాగం చేస్తే వాళ్లూ ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు.. ఈ క్రమంలో వాళ్లని మిస్సవుతున్నామన్న సమస్యా ఉండదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని