కోటి గెలవకపోయినా... కోట్లాది మనసులు గెలిచింది!

కౌన్‌ బనేగా కరోడ్‌ పతి... సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తోన్న బుల్లితెర షో. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ గేమ్‌ షో 13 వ సీజన్‌ ఈ మధ్యే ప్రారంభమైంది. ఇటీవల ఈ కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది ఆగ్రాకు చెందిన హిమానీ బుందేల్‌.

Updated : 13 Sep 2022 14:37 IST

(Photos: Screengrab)

కౌన్‌ బనేగా కరోడ్‌ పతి... సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తోన్న బుల్లితెర షో. బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ గేమ్‌ షో 13 వ సీజన్‌ ఈ మధ్యే ప్రారంభమైంది. ఇటీవల ఈ కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది ఆగ్రాకు చెందిన హిమానీ బుందేల్‌. ఇప్పుడు కోల్‌కతాకు చెందిన ఓ డాక్టరమ్మ కేబీసీలో పాల్గొంది. షోలో కోటి రూపాయలు గెల్చుకోకపోయినా తన మంచి మనసుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది.

వెనకబడిన పిల్లలకు విద్యా ఫలాలు!

ఈ సృష్టిలో దేవుడి తర్వాత అందరూ చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్లకే. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూనే ప్రజలకు వైద్య సేవలు అందిస్తోంది కోల్‌కతాకు చెందిన సంచాలీ చక్రవర్తి. ఓ ప్రభుత్వాస్పత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణురాలిగా విధులు నిర్వర్తిస్తోన్న ఆమెకు సామాజిక స్పృహ ఎక్కువ. వెనకబడిన పిల్లలకు కూడా విద్యా ఫలాలు అందించాలన్నది ఆమె కల. అయితే కేబీసీ పుణ్యమా అని ఇప్పుడు తన కలను నెరవేర్చుకునే అవకాశాన్ని అందుకుందీ డాక్టరమ్మ. ఇటీవలే ఈ గేమ్‌ షోలో పాల్గొన్న సంచాలి మొత్తం 6.40 లక్షలు గెల్చుకుంది. అయితే అందరినీ అడిగినట్లే ‘ఈ డబ్బును ఏం చేస్తారు?’ అని అమితాబ్‌ ఆమెను అడగ్గా.. ‘వెనకబడిన, పేద పిల్లలకు విద్యనందించేందుకు వినియోగిస్తాను’ అని చెప్పింది.

11 ప్రశ్నలు.. 6.40 లక్షలు!

చైనాలోని గ్వాంగ్జు సదరన్ మెడికల్‌ యూనివర్సిటీ నుంచి 2016లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది సంచాలి. ఆ తర్వాత మూడేళ్ల ‘పీడియాట్రిక్‌ రెసిడెన్సీ ప్రోగ్రామ్‌ కోర్సు’ చేసింది. ఆపై కోల్‌కతా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌, సేథ్‌ సుఖ్‌లాల్‌ కర్నాణి మెమోరియల్‌ హాస్పిటల్‌ (SSKM) నుంచి డాక్టరేట్‌ అందుకుంది. ప్రస్తుతం పీడియాట్రీషియన్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె ఇటీవల కేబీసీలో పాల్గొంది. 11 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రూ. 6.40 లక్షలు గెల్చుకుంది. అయితే ‘మహిళలకు మొదటిసారిగా నోబెల్‌ బహుమతిని ఎప్పుడు ప్రదానం చేశారు?’ అని అమితాబ్‌ అడిగిన 12వ ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేకపోయింది. అప్పటికీ ఆమెకు ఒక లైఫ్‌ లైన్‌ వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే అసలు తెలియని ప్రశ్నకు రిస్క్‌ చేయడం ఎందుకని ‘క్విట్‌’ చెప్పేసింది. ఈ ప్రశ్నకు ‘1903’ సరైన సమాధానం అని రివీల్‌ చేసిన అమితాబ్... 6.40 లక్షల చెక్కును సంచాలి చేతికి అందించారు.

ఆ పనులు ప్రారంభిస్తాను!

ఇక గేమ్‌ షోలో పాల్గొన్న అందరినీ అడిగినట్లే ‘గెల్చుకున్న డబ్బుతో ఏం చేస్తారు?’ అని బిగ్‌ బీ సంచాలిని అడిగారు. అప్పుడు ఆమె.. ‘నా జీవితంలో మరపురాని రోజు ఇది. అమితాబ్‌ గారి ఎదురుగా కూర్చోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదు. నా వంతు ప్రయత్నంగా కొద్దిమంది పేద పిల్లలకైనా విద్యను అందించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ డబ్బుతో ఆ పనులు ప్రారంభిస్తాను...’ అని చెప్పుకొచ్చింది. దీంతో అమితాబ్‌, గ్యాలరీలో ఉన్న సంచాలి కుటుంబ సభ్యులు, ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు. కోటి గెలవకపోయినా ఇలా తన సమాధానంతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిందీ డాక్టరమ్మ.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్