నిద్రతో ఐదు లక్షలు సంపాదించింది!

నెల జీతం కోసం ఎంతో కష్టపడతాం. రోజుకు కనీసం 10 గంటలైనా పనికి సమయం కేటాయిస్తాం. ఈ క్రమంలో ఒక్కో రోజు కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంటుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. అయితే కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి మాత్రం మంచం దిగకుండా.....

Updated : 06 Sep 2022 15:54 IST

(Photos: Twitter)

నెల జీతం కోసం ఎంతో కష్టపడతాం. రోజుకు కనీసం 10 గంటలైనా పనికి సమయం కేటాయిస్తాం. ఈ క్రమంలో ఒక్కో రోజు కంటి నిండా నిద్ర కూడా కరువవుతుంటుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటాం. అయితే కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి మాత్రం మంచం దిగకుండా ఐదు లక్షలు సంపాదించింది. అలాగని గంటల తరబడి అలాగే కూర్చొని పనిచేసిందేమో అనుకుంటే పొరబడినట్లే! ఎందుకంటే తను కంటి నిండా సుఖంగా నిద్రపోయి.. ఈ డబ్బు గెలుచుకుంది. ‘భారత తొలి స్లీప్‌ ఛాంపియన్‌’గా టైటిల్‌ దక్కించుకుంది. అసలు ఈ నిద్రేంటి? లక్షలకు లక్షలు గెలుచుకోవడమేంటి? ఇంతకీ ఏంటీ పోటీ? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదివేయండి!

పోటీ ఎందుకంటే?!

వేక్‌ఫిట్‌.. ఇదొక పరుపుల తయారీ సంస్థ. సౌకర్యవంతమైన సుఖ నిద్రను ప్రోత్సహించడమే ముఖ్యోద్దేశంగా ‘స్లీప్‌ ఇంటర్న్‌షిప్‌’ పేరుతో ఏటా ఓ పోటీని నిర్వహిస్తోంది. ఇందుకోసం లక్షల కొద్దీ అందిన దరఖాస్తుల్ని పరిశీలించి.. 15 మందిని ఇంటర్న్స్‌గా ఎంపిక చేస్తారు. వీరికి ఒక పరుపుతో పాటు, స్లీప్‌ ట్రాకర్‌ అందిస్తారు. వాటిని ఉపయోగించుకొని ఎవరింట్లో వాళ్లు వరుసగా వంద రోజులు.. రోజుకు 9 గంటల చొప్పున ఎలాంటి అంతరాయం లేకుండా సుఖంగా నిద్ర పోవాల్సి ఉంటుంది. ఇలా వాళ్ల నిద్ర నాణ్యతను పరిశీలించి.. నలుగురిని తుది రౌండ్‌కు ఎంపిక చేస్తారు. వీరిలో ఒకరిని విజేతగా ఎంపిక చేస్తారు. వాళ్ల నిద్ర నాణ్యతను బట్టి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు నగదు బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని కల్పించిందీ సంస్థ. ఈ క్రమంలోనే రెండో సీజన్‌లో 95 శాతం నిద్ర నాణ్యతను సాధించి విజేతగా నిలిచింది కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి. తద్వారా రూ. 5 లక్షల నగదు బహుమతి అందుకుంది. ‘భారత తొలి స్లీప్‌ ఛాంపియన్‌’గా నిలిచింది. ఇక మిగతా ముగ్గురు ఫైనలిస్టులు రూ. లక్ష చొప్పున అందుకున్నారు.

వ్యాపారవేత్త.. వక్త!

త్రిపర్ణ వృత్తి రీత్యా వ్యాపారవేత్త. కవితలు రాయడమంటే మక్కువ. వక్తగానూ ఆమె పేరు సంపాదించింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు అంశాల గురించి మాట్లాడి.. ఎంతోమంది ప్రశంసలందుకుంది కూడా! అలాగని నిద్రను త్యాగం చేసి మరీ తన సమయాన్ని పూర్తిగా వృత్తికే కేటాయిస్తుందేమో అనుకునేరు. ఎందుకంటే ఎన్ని పనులున్నా నిద్రకు తగిన సమయం కేటాయిస్తానంటోందామె. ‘నేను ఎంబీఏ చదివే రోజుల్లోనే నాకు ఈ నిద్ర పోటీ గురించి తెలిసింది. దీనికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఈ పోటీ గురించి నాకు పూర్తి అవగాహన లేదు. అయినా దీన్ని నేను ఓ వృత్తిగా భావించి ప్రతి రౌండ్‌ను దాటుకుంటూ వెళ్లా. ముఖ్యంగా ఈ పోటీలో భాగంగా.. మనం నిద్రకు ఎంత ప్రాధాన్యమిస్తున్నామో నిర్వాహకులు పరిశీలిస్తారు. ఇంటర్వ్యూతో పాటు కొన్ని రౌండ్లలో భాగంగా మన నిద్ర నాణ్యతను గమనిస్తారు. ఈ పోటీకి ఎంపికైన వారికి ఒక పరుపు, స్లీప్‌ ట్రాకర్‌ని ఇంటికే పంపిస్తారు.. అలాగే నిద్ర ప్రాముఖ్యతపై అవగాహన పెంచేందుకు మధ్యమధ్యలో నిపుణుల కౌన్సెలింగ్‌లు కూడా ఉంటాయి..’ అంటూ చెప్పుకొచ్చింది త్రిపర్ణ.

క్లాస్‌లో నిద్ర పోయేదాన్ని!

తనకున్న అతి నిద్ర అలవాటే బహుశా ఈ పోటీలో నెగ్గేలా చేసిందేమో అంటోందీ స్లీప్‌ లవర్‌. ‘పోటీ కోసం బలవంతంగా నిద్రపోవడం నేర్చుకున్నానేమో అనుకోకండి. ఎందుకంటే నేను స్కూల్లో, కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ క్లాస్‌లోనే నిద్రపోయేదాన్ని. గణిత పరీక్ష అంటే చాలు నిద్రొచ్చేసేది. ఓసారి SAT పరీక్షలో నిద్రపోతే ఇన్విజిలేటర్‌ నాకు టీ తెప్పించి ఇచ్చారు. ఇలా నాకు చిన్నప్పట్నుంచి ఉన్న అతి నిద్ర అలవాటు కారణంగా తరచూ స్కూల్‌ బస్‌ మిస్సయ్యేదాన్ని. దాంతో చాలా సార్లు నాన్న నన్ను బైక్‌పై తీసుకెళ్లి బస్సెక్కించేవారు. ఎక్కువగా నిద్ర పోయే వారిని బద్ధకస్తుల కింద లెక్కకడుతుంటారు. నిజానికి మనకు కావాల్సినంత సమయం నిద్రకు కేటాయించడం మన బాధ్యత! ఇది మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. అయితే ఇలా బారెడు పొద్దెక్కే దాకా నిద్ర పోవడం వల్ల అదృష్టం కూడా కలిసి రాదని చాలామంది అనేవారు. ఇప్పుడు వాళ్లే నన్ను చూసి స్ఫూర్తి పొందారు. ప్రశాంతంగా నిద్ర పోవడానికి ప్రయత్నిస్తున్నారు..’ అంటోందీ స్లీపింగ్‌ బ్యూటీ.

మొత్తానికి భలే ఉంది కదూ ఈ స్లీపింగ్‌ పోటీ. ఎంచక్కా అటు నిద్రకు నిద్ర.. ఇటు డబ్బుకు డబ్బు.. బోలెడంత ఆరోగ్యం కూడానూ!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని