సరిగా నిద్ర పోవడం లేదా? ఈ సమస్యలు తప్పవు..!
ఎవరికైనా సరే.. నిద్ర బంగారంతో సమానం. కానీ, ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం, నైట్ షిఫ్టుల్లో పనిచేయడం, ఇతర కారణాల వల్ల చాలామంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇది నిద్రలేమికి దారితీస్తోంది. దీనివల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా పలు సమస్యలకు.....
ఎవరికైనా సరే.. నిద్ర బంగారంతో సమానం. కానీ, ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం, నైట్ షిఫ్టుల్లో పనిచేయడం, ఇతర కారణాల వల్ల చాలామంది ఆలస్యంగా నిద్రపోతున్నారు. ఇది నిద్రలేమికి దారితీస్తోంది. దీనివల్ల మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా పలు సమస్యలకు కారణమవుతోంది. నిద్రలేమితో హైపర్‌టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయని మనం వింటూనే ఉంటాం. అయితే ఈ సమస్య వల్ల మహిళల్లో సంతాన సమస్యలు కూడా వస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఈ క్రమంలో నిద్రలేమి వల్ల మహిళల్లో వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఏవిధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం రండి...
హార్మోన్ల అసమతుల్యత...
శరీరానికి తగినంత విశ్రాంతి లభించకపోతే ఆ ప్రభావం హార్మోన్లపై పడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా శరీరంలోని అవయవాలన్నీ యాక్టివ్‌గా పనిచేస్తుంటాయి. ఆ సమయంలో శరీరంలోని అంతస్రావక వ్యవస్థ హార్మోన్లను నియంత్రిస్తుంటుంది. ఇందులో సంతానోత్పత్తికి కారణమయ్యే కీలకమైన ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, LH, FSH హార్మోన్లు కూడా ఉంటాయి. నిద్రలేమి వల్ల ఈ హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. ఫలితంగా సంతానలేమికి కారణమయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటికి తోడు లైంగికాసక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు కూడా వస్తాయంటున్నారు.
ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం..
మహిళల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థకు, నిద్రకు దగ్గరి సంబంధం ఉంది. ఈ రెండూ ఒక జీవ గడియారాన్ని ఫాలో అవుతుంటాయి. ఈ క్రమంలో మెలటోనిన్ అనే హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్ సుఖవంతమైన నిద్రకు తోడ్పడమే కాకుండా శరీర జీవగడియారాన్ని నియంత్రిస్తుంది. అదేవిధంగా మన మెదడు ఈ జీవగడియారాన్ని, ప్రత్యుత్పత్తి హార్మోన్లను సమన్వయపరుస్తుంది. అయితే ఈ ప్రక్రియ రోజంతా జరగదు. కాబట్టి జీవగడియారంలో కానీ, నిద్రలో కానీ అవాంతరాలు ఎదురైనప్పుడు ఆ ప్రభావం ప్రత్యుత్పత్తి హార్మోన్లపై పడుతుంది. ఇది సంతానలేమికి కారణమవుతుందంటున్నారు నిపుణులు.
అండం నాణ్యత..
అధిక సమయం స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించడం, ఆలస్యంగా నిద్రపోవడం వల్ల.. ఆ ప్రభావం మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతుంటుంది. స్మార్ట్‌ఫోన్ల నుంచి వచ్చే నీలికాంతి మెలటోనిన్ హార్మోన్ విడుదలపై ప్రభావం చూపిస్తుంటుంది. దీనివల్ల అండం నాణ్యత క్షీణిస్తుంటుంది. ఇది తిరిగి సంతానలేమికి కారణమవుతుంటుంది. కాబట్టి, సాధ్యమైనంత మేరకు స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఒకవేళ తప్పనిసరిగా ఉపయోగించాలనుకుంటే బ్లూలైట్ ఫిల్టర్స్‌కు సంబంధించిన అప్లికేషన్లను వాడడం, నీలికాంతిని అడ్డుకునే కళ్లద్దాలను ఉపయోగించడం మంచిది.
ఎంతసేపు నిద్రపోవాలి?
సాధారణంగా పెద్దలకు ఆరు నుంచి ఏడు గంటల నిద్ర సరిపోతుంది. అయితే కొంతమంది నిద్ర మంచిదేనని 9 గంటలు కూడా పడుకుంటారు. కానీ, ఇది కూడా సంతానలేమికి కారణమవుతుందని అంటున్నారు నిపుణులు. మహిళల గర్భధారణపై నిద్ర ప్రభావం ఏవిధంగా ఉంటుందన్న అంశం పైన ఇటీవలే ఓ సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఇందులో రోజూ 9 గంటలు నిద్రపోయేవారి కంటే 7-8 గంటలు పడుకునేవారిలో ఐవీఎఫ్ ప్రక్రియ విజయవంతమయ్యే అవకాశాలు 25 శాతం అధికంగా ఉన్నాయని తేలింది. అలాగే ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోయేవారిలో 15 శాతం తక్కువగా ఉన్నాయని వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.