వరలక్ష్మీ వ్రతం.. ఏ రాష్ట్రంలో ఎలా?

‘వరలక్ష్మీ వ్రతం’.. తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో చేసుకునే సౌభాగ్య వ్రతం. అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Updated : 24 Aug 2023 21:17 IST

‘వరలక్ష్మీ వ్రతం’.. తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో చేసుకునే సౌభాగ్య వ్రతం. అష్టలక్ష్మి అనుగ్రహాన్ని పొందాలని ఈ వ్రత దీక్ష చేపట్టిన రోజున ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని ఎనిమిది పేర్లు గల శ్రీ మహావిష్ణువు సతి అయిన లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా కొలుస్తూ, సకల అరిష్టాలను దూరం చేయాలని ఆ అమ్మను వేడుకుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోనూ వరలక్ష్మీ వ్రతాన్ని పోలిన పూజలు, వ్రతాలను పండగలా జరుపుకొనే ఆనవాయితీ కొనసాగుతోంది.

వరమహాలక్ష్మి పూజ

'వరమహాలక్ష్మి పూజ'ను కర్ణాటకలో జరుపుకొంటారు. మనం చేసే 'వరలక్ష్మీ వ్రతం' రోజునే కన్నడిగులు ఈ పూజ చేస్తారు. ఈ పూజ కూడా దాదాపుగా వరలక్ష్మీ వ్రతాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ తోరాలు కట్టుకునే పద్ధతిని అక్కడ 'రక్ష'గా పిలుస్తారు. అలాగే ఒబ్బట్టు, పులియోగరె, హుళి అన్న, పాయస లాంటి వంటకాలను కన్నడిగులు నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు.

మహాలక్ష్మి వ్రతం..

తెలుగువారు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్న విధంగానే ఉత్తరాది మహిళలు 'మహాలక్ష్మి వ్రతాన్ని' జరుపుకొంటారు. ప్రధానంగా బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భాద్రపద మాసం శుక్లపక్షంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. భవిష్య పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం గురించి విశదీకరించి చెప్పినట్లు ఓ కథ ఉంది. ఈ రోజున పసుపు, కుంకుమతో 'స్వస్తిక్' ఆకారాన్ని చిత్రించి అందులో నాలుగు రేఖలను నాలుగు వేదాలుగా భావించి పూజ చేయడం 'మహాలక్ష్మి వ్రతం' లోని ప్రత్యేకత. ఈ వ్రత సందర్భంగా వివిధ రకాల పూలతో తోరణాలు కట్టి మహాలక్ష్మికి స్వాగతం పలకడం విశేషం. సాధారణంగా ఉత్తరాదిలో దీపావళి సందర్భంగా చేసే 'లక్ష్మీ పూజ'కు విశేష ప్రాధాన్యం ఉన్నప్పటికీ, మహాలక్ష్మి పూజను కూడా చాలా చోట్ల భక్తి శ్రద్ధలతో జరుపుకొనే సంప్రదాయం కొనసాగుతోంది.

కలశం పూజ..

వరలక్ష్మీ వ్రతాన్ని పోలిన మరో పర్వదినమే కేరళలో జరుపుకొనే 'కలశం పూజ'. మనం వ్రతం చేసేటప్పుడు పూర్ణకుంభాన్ని ఎలా వాడతామో, కలశాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుతామో.. కేరళలో కూడా అలాగే కలశాన్ని తయారుచేసే సంప్రదాయం ఉంది. ఈ కలశాన్ని బియ్యంతో నింపి, పైన నీళ్లు చల్లి నిమ్మకాయను పెడతారు. అలాగే కొన్ని నాణేలను కూడా అందులో వేస్తారు. ఈ శుభదినాన కేరళ ప్రాంతంలోని మదియన్ కులూమ్ ఆలయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వర్ణాభరణాలతో లక్ష్మీదేవిని అలంకరించే సంప్రదాయం కూడా ఈ పూజలో కనిపిస్తుంది. ఈ పూజ చేయడం ద్వారా అష్టలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

శరత్ పూర్ణిమ..

శరత్ పూర్ణిమ సాధారణంగా సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో వస్తుంది. గుజరాత్, పశ్చిమ బంగ, ఒడిశా.. తదితర రాష్ట్రాల్లో ఈ పండగ సందర్భంగా లక్ష్మీదేవిని పూజించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 'శరత్ పూర్ణిమ'ను పురస్కరించుకొని భక్తులు రాత్రిళ్లు జాగారం కూడా చేస్తుంటారు. 'శరత్ పూర్ణిమ' నాడు లక్ష్మీదేవి రాత్రివేళ ప్రతి ఇంటి గడప దగ్గరకు వస్తుందని ఒక నమ్మకం ఉంది. ఒడిశాలో 'గజలక్ష్మీ పూజ' గాను, గుజరాత్ ప్రాంతంలో 'వైభవ లక్ష్మి పూజ' గాను లక్ష్మీదేవిని పూజిస్తారు.

కొజగరి లక్ష్మీ పూజ..

పశ్చిమ బంగ రాష్ట్రంలో దుర్గాపూజ జరిగిన కొన్ని రోజుల తర్వాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకంగా మరో పూజను చేస్తారు. వివిధ మంత్రాలతో లక్ష్మీదేవికి పుష్పాంజలి ఘటిస్తూ, కుటుంబ సమేతంగా ఈ పూజను జరుపుకొంటారు.

లక్ష్మీ దేవి కరుణా కటాక్షాల కోసం వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు వివిధ పేర్లతో ఆచరించే పూజలు, వ్రతాలు ఇవీ! సంప్రదాయాలు, సంస్కృతులు భిన్నమైనా అందరి సంకల్పం మాత్రం ఆ దేవి ఆశీస్సులు అందుకోవడమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని