నా తీరని కోరికలు అవే..!

లతా మంగేష్కర్.. భారత చిత్ర సంగీత చరిత్రలో శిఖరాగ్రాన నిలిచిన ఈ మహా గాయని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! తాను పుట్టింది పాటలు పాడడానికేనేమో అన్నంతగా సినీ సంగీత ప్రపంచంలో లీనమైపోయిందామె. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎనలేని ఘనకీర్తి గడించిన ఆమె.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే

Updated : 06 Feb 2022 15:32 IST

లతా మంగేష్కర్.. భారత చిత్ర సంగీత చరిత్రలో శిఖరాగ్రాన నిలిచిన ఈ మహా గాయని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! తాను పుట్టింది పాటలు పాడడానికేనేమో అన్నంతగా సినీ సంగీత ప్రపంచంలో లీనమైపోయిందామె. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఎనలేని ఘనకీర్తి గడించిన ఆమె.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్మేవారు. తన మాటలతోనే తనలోని నిరాడంబరతను చాటుకునేవారు. ఇందుకు పలు ఇంటర్వ్యూల్లో ఆమె ఇచ్చిన ఈ సమాధానాలే నిదర్శనం!

*మీరు ఇంతటి ఘన కీర్తిని సంపాదించుకున్నారు... దాని ప్రభావం మీ నిరాడంబర వ్యక్తిత్వంపై పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

నేను ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటాను. నా విషయంలో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్లని క్షమించి, ఆ విషయం గురించి మర్చిపోయి ముందుకు వెళ్లే స్వభావాన్ని చిన్నతనం నుంచే నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు.

*మీకున్న క్షమాగుణం, సాధుగుణాలను ఆసరాగా తీసుకొని వాటిని తమ స్వార్థానికి ఉపయోగించుకున్న వాళ్లపై మీ అభిప్రాయం?

వాళ్లందరికీ ఆ దేవుడి ఆశీస్సులు తప్పక లభించాలి అని కోరుకుంటాను. నేనెప్పడూ నా సామర్థ్యాలను చూసుకొని అహంకారంగా ప్రవర్తించలేదు. ఎందుకంటే నాకు ఈ గాత్రాన్ని ఆ భగవంతుడు, నా తల్లిదండ్రులు ఇచ్చిన వరంగా నేను భావిస్తాను. ఇది నా అదృష్టం.

*మీలో మీరు మార్చుకోవాల్సిన లక్షణాలు ఏవైనా ఉన్నాయా?

గతంలో నాకు కోపం చాలా ఎక్కువగా ఉండేది. నాకున్న అతి పెద్ద చెడు లక్షణం అదే..! చిన్నప్పటి నుంచీ అంతే..! నాకు కోపం చాలా త్వరగా వచ్చేది. వయసు పెరుగుతున్న కొద్దీ అది తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం అది పూర్తిగా తగ్గింది. ఇప్పుడు నాకు అసలు కోపమే రాదు. నా కోపం ఏమైపోయిందని ఒక్కోసారి నాకే ఆశ్చర్యమేస్తుంటుంది.

*మీ గాత్రం అసాధారణమని ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్ అన్నారు. మీ గాత్రంలో మీరు మెరుగుపరుచుకోవాల్సింది ఇంకేమైనా ఉందా?

కచ్చితంగా ఉంది..! నేను పాడిన చాలా పాటల్లో తప్పులు దొర్లిన సందర్భాలున్నాయి. అవి మీకు అర్థం కావు.. నాకు మాత్రమే అర్థమవుతాయి. అవి విన్న ప్రతిసారీ భయంతో నా మొహం చాటేసుకోవాలనిపిస్తుంటుంది.

*కొత్త సింగర్స్‌కు మీరిచ్చే సలహా?

సాధన చేయండి..! సింగర్‌గా గుర్తింపు పొందాలనుకునే వారికి కఠినమైన సాధన అవసరం. నేనూ ప్రతినిత్యం సాధన చేస్తూనే ఉంటాను.

*పాటలు కాకుండా మీలో ఉన్న మరో అభిరుచి?

అప్పట్లో నాకు అవకాశం లభిస్తే వీణ చేత పట్టుకొని స్టేజ్‌పై నిర్విరామంగా రెండు గంటల పాటు ప్రదర్శన ఇవ్వాలనిపించేది. కానీ, అప్పుడంత సమయం ఎక్కడుండేది..? రోజంతా పాటల రికార్డింగ్స్‌తోనే సరిపోయేది.

*మీకు నెరవేరని కోరికలు ఏవైనా ఉన్నాయా?

నాకు ఫొటోగ్రఫీ, పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. వాటిని నేర్చుకునేందుకు సమయం దొరకాలని ఆశిస్తున్నాను.

*ఈ ప్రపంచానికి మీరిచ్చే సందేశం?

కష్టపడనిదే ఏదీ లభించదు. మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి.. మీ కర్మను గౌరవించండి. విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్