Nita Ambani: వాళ్లు మా కోడళ్లే కాదు.. కూతుళ్లు కూడా..!

పెళ్లిళ్లు.. శుభకార్యాలు వంటి సందర్భాలలో చీరకట్టుతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మన భారతీయ మహిళలకు అలవాటు! దేశ సంప్రదాయాల్ని చాటే ఈ కట్టూ-బొట్టు మగువలకు నిండుదనాన్ని, హుందాతనాన్ని అందిస్తుంది.

Updated : 10 Jul 2024 14:07 IST

(Photos: Instagram)

పెళ్లిళ్లు.. శుభకార్యాలు వంటి సందర్భాలలో చీరకట్టుతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం మన భారతీయ మహిళలకు అలవాటు! దేశ సంప్రదాయాల్ని చాటే ఈ కట్టూ-బొట్టు మగువలకు నిండుదనాన్ని, హుందాతనాన్ని అందిస్తుంది. కొన్ని లక్షల కోట్లకు అధిపతి అయిన నీతా అంబానీ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఏ అకేషన్‌ అయినా, ఎక్కడికెళ్లినా పట్టు, బనారసీ చీరల్లోనే దర్శనమిచ్చే ఈ మిసెస్‌ అంబానీ.. ప్రస్తుతం జరుగుతోన్న తన చిన్న కొడుకు అనంత్‌ అంబానీ వివాహంలోనూ చీరకట్టుకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అంతేనా.. ఈ వివాహం కోసం లక్షలు ఖర్చు పెట్టి ఇటీవలే 50కి పైగా బనారసీ చీరల్ని కూడా కొనుగోలు చేశారట నీతా. ఇలా ఎంత ఎదిగినా సంస్కృతీ సంప్రదాయాలకు విలువిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇదొక్క విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా తాను వేసే ప్రతి అడుగూ నేటి మహిళలకు స్ఫూర్తిదాయకం అని చెప్పడం అతిశయోక్తి కాదు.

ఫ్యాషన్‌.. ట్రెండ్‌సెట్టర్!

వారణాసి బనారసీ చీరలకు పెట్టింది పేరు. ఇటీవలే తన కొడుకు అనంత్‌ అంబానీ వివాహ ఆహ్వాన తొలి పత్రికను కాశీ విశ్వేశ్వరుని పాదాల వద్ద ఉంచి.. ఆశీర్వాదం తీసుకునేందుకు వారణాసి వెళ్లారు నీతా. ఈ సందర్భంలోనే అక్కడి చేనేత కళాకారుల్ని కలుసుకున్నారు. వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న దాదాపు 50 బనారసీ చీరల్ని కొనుగోలు చేశారట ఆమె. ఇవన్నీ లక్కా బూటీ, హజారా బూటీ.. అనే రెండు వెరైటీలతో రూపొందించిన పట్టు చీరలు కావడం విశేషం! ఇంతకీ ఏంటీ లక్కా బూటీ, హజారా బూటీ అంటే..

లక్కా బూటీ చీర అంటే.. ఒక లక్ష మోటిఫ్స్‌తో రూపొందించిన చీరలివి. బంగారు, వెండి జరీలతో తయారుచేసే వీటిని ఒకటి, రెండుసార్లు కాదు.. మూడుసార్లు మగ్గంపై నేస్తారట! ఈ మోటిఫ్స్‌ని ఫ్లోరల్‌, జామెట్రిక్‌.. ఇలా వివిధ ప్యాటర్న్స్‌లో తయారుచేస్తారట! ఒక్కో చీర తయారీకి సుమారు రెండు నెలల సమయం పడుతుందని అక్కడి కళాకారులు చెబుతారు.
ఇక హజారా బూటీ చీరలంటే.. వెయ్యి మోటిఫ్స్‌తో తయారుచేసినవి. బంగారు, వెండి జరీలతో విభిన్న డిజైన్లలో, చిన్న-పెద్ద ఆకృతుల్లో ఈ చీరల్ని నేస్తారట! ఈ రెండు రకాల బనారసీ చీరలు వాటి డిజైన్‌ను బట్టి ధర ఒక్కోటి రూ. 1.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ఉంటుందట! దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ చీరలు.. ఇక్కడి కళకు నిదర్శనంగానూ నిలుస్తాయని చెప్పచ్చు.

ఇటీవలే అనంత్‌ పెళ్లి వేడుకల్లో భాగంగా.. ఓ సందర్భంలో గులాబీ రంగు బనారసీ చీరను ధరించి మెరిసిపోయారు నీతా. ఇక మరికొన్ని వేడుకల కోసం భారీగా రూపొందించిన లెహెంగాల్ని ఎంచుకొని నిండుగా దర్శనమిచ్చారు. ఇలా అకేషన్‌ని బట్టి దుస్తుల్ని ఎంచుకునే నీతాను.. ‘ఫ్యాషన్‌ ట్రెండ్‌సెట్టర్‌’గా పిలుచుకుంటారు ఆమె ఫ్యాన్స్.


ఉన్నది ఒక్కటే జిందగీ!

‘గతం ఎలా గడిచినా, భవిష్యత్తు ఎలా ఉన్నా.. ఈ క్షణం మనది.. అందుకే ఈ క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటా’నని పదే పదే చెబుతుంటారు నీతా. తన కెరీర్‌లో భాగంగా పనిని ఎంతగా ప్రేమిస్తారో.. కుటుంబంతో గడపడానికీ అంతే ఇష్టపడతారామె. ఈ క్రమంలోనే పండగలైనా, ప్రత్యేక సందర్భాలైనా, పుట్టినరోజు వేడుకలైనా.. కుటుంబంతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి అస్సలు వెనకాడరు నీతా. ఇలాంటి సంతోషాన్ని నలుగురితో పంచుకున్నప్పుడే ఆ ఆనందం రెట్టింపవుతుందనే ఈ బిజినెస్‌ లేడీ.. ఈ వేడుకల్లో సెలబ్రిటీల్నే కాదు.. సామాన్యుల్నీ, తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్నీ మిళితం చేస్తూ.. తనలోని పాజిటివిటీని చాటుతుంటారు. ఇలా చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహించడం, ప్రేమించడంలో ఎప్పుడూ ముందే ఉంటారీ మిసెస్‌ అంబానీ.


అదీ ఆమె ఆత్మాభిమానం!

‘అమ్మాయిలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి..’ అనేది నీతా చిన్నతనం నుంచి నమ్మిన సిద్ధాంతం. ఈ క్రమంలోనే పెళ్లికి ముందు నుంచే ఉద్యోగం చేస్తున్నారామె. ‘టీచింగ్‌ నాకు ఇష్టమైన వృత్తి. ముకేశ్‌తో పెళ్లికి ముందే నేను సన్‌ఫ్లవర్‌ నర్సరీ స్కూల్లో టీచర్‌గా పనిచేశా. నెలకు రూ. 800 జీతం అందుకున్నా. ఆ డబ్బంతా నా కష్టార్జితం!’ అంటూ నిండైన ఆత్మవిశ్వాసంతో చెప్పిన నీతా.. పెళ్లయ్యాకా ఉద్యోగాన్ని కొనసాగిస్తానని ముకేశ్‌ ముందు కండిషన్‌ కూడా పెట్టారట! దానికి ఆయన అంగీకరించడంతో పెళ్లయ్యాకా కొన్నేళ్లు టీచర్‌గా పనిచేశారట! ఇక ఆ తర్వాత దేశవ్యాప్తంగా రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కూల్స్‌, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటుచేసి.. ఎంతోమంది చిన్నారులకు విద్యాదానం చేస్తున్నారామె. అంతేకాదు.. తన ప్రవృత్తి అయిన భరతనాట్యాన్నీ కొనసాగిస్తూ.. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో తన నృత్య కళను ప్రదర్శిస్తుంటారు నీతా. పెళ్లైనా, పిల్లలు పుట్టినా నచ్చిన కెరీర్‌లో కొనసాగే స్వతంత్రత మహిళల సొంతమంటూ తన జీవితంతో చెప్పకనే చెప్పారీ మిసెస్‌ అంబానీ.


ఒంటి చేత్తో.. ఎన్నో పనులు!

వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌.. చాలామంది మహిళలు ఇబ్బంది పడే అంశమిది! అయితే ఈ విషయంలోనూ నీతా అంబానీ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం తల్లిగా, అత్తగా, బామ్మగా ఇంటి బాధ్యతల్లో లీనమైన ఆమె.. కెరీర్‌లోనూ దూసుకుపోతున్నారు. రిలయన్స్‌ ఫౌండేషన్‌, ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, NMACC.. వంటి సంస్థలకు ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతోన్న నీతా.. ముంబయి ఇండియన్స్‌ జట్టుకు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీగానూ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ‘విజయం సాధించడమంటే నిర్దేశించుకున్న లక్ష్యాల్ని చేరుకోవడమే కాదు.. మీ చుట్టూ ఉండే వారిలో పాజిటివిటీని నింపడం కూడా!’ అంటూ తన మాటలతోనూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటారీ బిజినెస్‌ క్వీన్.


పెద్ద కోడలిగా.. ఇల్లాలిగా!

కోడలంటే మెట్టినింటి గౌరవమర్యాదలు నిలబెట్టేలా ఉండాలి. కోడలిగానే మెట్టినింట్లో అడుగుపెట్టినా.. అత్తమామలతో ఓ కూతురిగా మెలగాలి. అలాంటిది పెద్ద కోడలంటే ఈ బాధ్యతలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న నీతా.. తన అత్తమామలు ధీరూబాయి అంబానీ-కోకిలా బెన్‌ల చేత నూటికి నూరు మార్కులు వేయించుకున్నానంటున్నారు.

‘పెళ్లైన కొత్తలో మా మామగారు రోజూ సాయంత్రం నాకు క్విజ్‌ పోటీ పెట్టేవారు. ప్రపంచం నలుమూలల జరిగే అంశాలపై ప్రశ్నలు అడిగేవారు. ఇందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసేదాన్ని. రోజూ ఉదయం నుంచే ప్రిపేరయ్యేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే.. నన్ను వ్యక్తిగతంగా మరింత ఉన్నతంగా మలిచిన వ్యక్తి మా మామగారు. ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఇప్పుడీ స్థాయిలో ఉన్నా..’ అంటూ మామగారు తనను ప్రోత్సహించిన తీరును ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు నీతా. ఇలా ఇంటికి పెద్ద కోడలిగా తన బాధ్యతలన్నీ చక్కగా నిర్వర్తించే ఆమె.. తన భర్త ముకేశ్‌ ప్రేమనూ పూర్తిగా పొందగలిగానంటూ మరో సందర్భంలో చెప్పుకొచ్చారు. తమ పెళ్లై మూడు దశాబ్దాలు దాటినా అన్యోన్య దాంపత్య బంధానికి నిదర్శనంగా నిలుస్తుందీ అంబానీ జంట. ఎంతోమందికి ప్రేమ పాఠాలు చెబుతుంటుంది.


కోడళ్లు కాదు.. కూతుళ్లు!

ఈ ఏడాది జామ్‌నగర్‌లో తన చిన్న కొడుకు అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ తొలి ప్రి-వెడ్డింగ్‌ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా నీతా ఇచ్చిన స్పీచ్‌లో.. ‘అంబానీ కుటుంబంలోకి రాధికకు స్వాగతం.. ఆమె మా చిన్న కోడలే కాదు.. అంబానీల కూతురు కూడా!’ అంటూ కాబోయే కోడలిపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారామె. తన పెద్ద కోడలు శ్లోకా మెహతానూ తన కూతురిలాగే భావిస్తుంటారు నీతా. ఇలా తన ఇంట్లోకి అడుగుపెట్టే కోడళ్లనూ.. కూతుళ్లుగా ట్రీట్‌ చేస్తుంటారామె. తన కూతురు ఈషాతో సరిసమానంగా ప్రేమను పంచుతుంటారీ మిసెస్‌ అంబానీ. ‘ఇలా ఒక ఫ్యామిలీలో ప్రేమతోనే ప్రతి ఒక్కరి మనసు గెలుచుకోవచ్చం’టూ తన ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌ సీక్రెట్‌ని ఓ సందర్భంలో బయటపెట్టారామె. ఇప్పటికీ ప్రతి వేడుకలోనూ ఈ నలుగురు లేడీ అంబానీలు (నీతా, ఈషా, శ్లోక, రాధిక) ఎలాంటి భేదాల్లేకుండా సందడి చేయడం విశేషం!
Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్