అందుకే ఎక్కువ భాషలు నేర్పించండి!

అప్పుడప్పుడే మాటలు నేర్చుకొంటున్న చిన్నారులు పాఠశాలకు వెళ్లేంతవరకు కుటుంబ సభ్యుల మధ్యే ఉంటారు. దీంతో తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్లు ఏ భాష మాట్లాడితే దాన్నే అనుసరిస్తుంటారు. పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత ఆంగ్లం, హిందీ వంటి భాషలను సైతం తమ సిలబస్‌లో భాగంగా నేర్చుకొంటారు.

Published : 15 Jun 2024 12:34 IST

అప్పుడప్పుడే మాటలు నేర్చుకొంటున్న చిన్నారులు పాఠశాలకు వెళ్లేంతవరకు కుటుంబ సభ్యుల మధ్యే ఉంటారు. దీంతో తల్లిదండ్రులు, ఇంట్లో వాళ్లు ఏ భాష మాట్లాడితే దాన్నే అనుసరిస్తుంటారు. పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత ఆంగ్లం, హిందీ వంటి భాషలను సైతం తమ సిలబస్‌లో భాగంగా నేర్చుకొంటారు. ఈ క్రమంలో కొందరు తాము నేర్చుకొన్న భాషల్లో రాయడం, చదవడం వరకు మాత్రమే పరిమితమైతే.. మరికొందరు వాటిలో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యాన్ని సంపాదించగలుగుతారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగే చిన్నారుల్లో.. మెదడు చాలా చురుగ్గా పనిచేయడంతో పాటు.. ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకొనే సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఏడేళ్ల వయసు లోపు చిన్నారుల్లో దేన్నైనా త్వరగా గ్రహించి నేర్చుకోగల సామర్థ్యం ఉంటుంది. అయితే వారు ఉండే పరిస్థితుల ప్రభావం కారణంగా కొందరిలో ఈ గ్రాహ్య శక్తి ఎక్కువగా ఉంటే.. మరికొందరిలో చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే వారికి అనువైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల బాధ్యత. చిన్నారులకు దేన్నైనా నేర్పించే ముందు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకీ ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల చిన్నారుల్లో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకొందామా..

మల్టీటాస్కింగ్!

ఈ తరం పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటున్నారు. చిన్న వయసులోనే ఎన్నో కొత్త విషయాలను నేర్చుకొంటున్నారు. ఓవైపు చదువుకొంటూనే.. మరోవైపు తమకు నచ్చిన వ్యాపకాల్లో రాణిస్తున్నారు. అయితే సాధారణ చిన్నారులతో పోలిస్తే.. ఎక్కువ భాషలు నేర్చుకొన్న చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మనం ఏ భాషలో ప్రశ్న సంధిస్తే తిరిగి అదే భాషలో సమాధానమివ్వగల సామర్థ్యం వారి సొంతమవుతుంది. ఒకే సమయంలో వేర్వేరు భాషల్లో మాట్లాడినప్పటికీ దానికి తగిన విధంగా వారు మారిపోగలరు. దీన్నే ఇంగ్లిష్‌లో 'జగ్లింగ్ స్కిల్స్' అని పిలుస్తారు. ఇలాంటి వారికి మల్టీటాస్కింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. వారి దృష్టిని మరల్చాలని ఇతరులు ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలం కాదు. ఇలాంటి చిన్నారులు భవిష్యత్తులో మల్టీటాస్కింగ్ చేయడంలో సిద్ధహస్తులుగా మారతారు. అంతేకాదు.. టాస్క్ స్విచ్చింగ్‌ (వేగంగా, వరుసగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పనులు చేయడం)లోనూ నేర్పరులుగా రాణిస్తారు. ఎక్కువ భాషలు నేర్చుకొన్న చిన్నారుల్లో ఒకే సమయంలో రెండు పనుల్ని చేయగలిగే సామర్థ్యం పెరుగుతుందని అధ్యయనాల్లో కూడా తేలింది.

మెదడు చురుగ్గా..

భాషలు నేర్చుకోవడానికి, మెదడు చురుగ్గా పనిచేయడానికి ఏంటి సంబంధమని ఆలోచిస్తున్నారా? ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకొన్నప్పుడు వాటికి సంబంధించిన పదజాలమంతా మెదడులోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. అంతేకాదు.. ఏ భాషనైతే మాట్లాడుతున్నామో.. దానికి సంబంధించిన పదజాలాన్ని మాత్రమే ఎంచుకొనేలా మెదడు వేగంగా స్పందిస్తూ ఉంటుంది. ఇలా దానికి చురుకుదనం అలవాటవుతుందన్నమాట. దీనికి సంబంధించి నిర్వహించిన వివిధ పోటీల్లో ఒకే భాషపై పట్టున్నవారి కంటే రెండు కంటే ఎక్కువ భాషలు మాట్లాడగలిగేవారు.. చాలా చురుగ్గా ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు.

మతిమరపు సమస్యే ఉండదు..!

ఇటీవలి కాలంలో వయసు మీరిన వారిలో అల్జీమర్స్, డిమెన్షియా వంటి మతిమరపు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్న వారిని చూస్తున్నాం. అయితే ఒక్క భాషలో మాత్రమే నైపుణ్యం ఉన్నవారితో పోలిస్తే.. ఎక్కువ భాషలు నేర్చుకొన్న వారిలో ఈ సమస్య చాలా తక్కువగా ఉన్నట్లు కొన్ని పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే వీరి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. వీరికి జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. దీనికి వారి బహు భాషా పరిజ్ఞానమే కారణమంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే ప్రతి భాషకు ప్రత్యేకమైన పదజాలం, వాక్య నిర్మాణ శైలి ఉంటాయి. అందుకు తగినట్లుగానే వారు మాట్లాడుతూ ఉంటారు. దీనంతటికీ కారణం వారి అమోఘమైన జ్ఞాపకశక్తే. అంతే కాదండోయ్.. సాధారణ చిన్నారులతో పోలిస్తే.. ఎక్కువ భాషలు మాట్లాడే పిల్లల్లో ఐక్యూ కూడా ఎక్కువేనట!

స్వీయ నియంత్రణ..

చిన్నారులకు సంతోషమొచ్చినా.. కోపమొచ్చినా.. వారిని నియంత్రించడం కష్టం. కానీ ఒకటి కంటే ఎక్కువ భాషలు తెలిసిన చిన్నారులు మాత్రం అలా కాదట. తమ భావోద్వేగాలను తామే నియంత్రించుకోగలరట. అదెలాగబ్బా? అని ఆలోచిస్తున్నారు కదా..! ఎక్కువ భాషలు తెలిసిన చిన్నారులు ఒక భాషలో మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన పదాలను మాత్రమే ఉపయోగిస్తారు. వాటిలో ఇతర భాషలకు చెందిన పదాలు రాకుండా జాగ్రత్తపడతారు. ఈ క్రమంలో ఎలాగైతే ఇతర భాషా పదాలు రాకుండా తమని తాము నియంత్రించుకొంటారో.. అలాగే భావోద్వేగాల విషయంలోనూ ప్రవర్తిస్తారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వీరిలో ఏకాగ్రత కూడా ఎక్కువే.. ఏ పనైనా సరే పూర్తి దృష్టి దాని పైనే పెట్టగలరు. అంతేకాదు.. తాము అనుకొన్న దాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ఉండడం బహుభాషా ప్రావీణ్యం ఉన్న చిన్నారుల నైజం. పైగా తాము చేసే పని వినూత్నంగా ఉండాలని కోరుకుంటారట!

చూశారుగా.. చిన్నారుల్లో బహుభాషా ప్రావీణ్యం పెరగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో..! ఇంకెందుకాలస్యం.. మీరు కూడా మీ చిన్నారికి వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించండి. వారి మెదడు పనితీరు సామర్థ్యాన్ని పెంపొందించండి. అయితే ఈ విషయంలో వారిని బలవంతపెట్టకుండా చిన్నారుల ఇష్టం మేరకు వ్యవహరించడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్