అమెరికా వెళ్లాక అమ్మను పట్టించుకోవట్లేదు!
మా తమ్ముడు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి... అక్కడే స్థిరపడ్డాడు. అమ్మ ఒంటరి తల్లిగా... ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచింది. తమ్ముడిని మెకానికల్ ఇంజినీరింగ్ చదివించడానికి తినీ, తినక డబ్బు ఖర్చు చేసింది.
మా తమ్ముడు ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లి... అక్కడే స్థిరపడ్డాడు. అమ్మ ఒంటరి తల్లిగా... ఎన్నో కష్టాలు పడి మమ్మల్ని పెంచింది. తమ్ముడిని మెకానికల్ ఇంజినీరింగ్ చదివించడానికి తినీ, తినక డబ్బు ఖర్చు చేసింది. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. కానీ తమ్ముడు మాత్రం అమ్మ బాగోగులు పట్టించుకోవడం మానేశాడు. దాంతో ఆవిడ కొడుకు నుంచి మెయింటెనెన్స్ కోరుతూ కేసు వేసింది. తను ఇండియాకి రావడం లేదు. కోర్టుకి హాజరు కావడం లేదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని పోలీస్ స్టేషన్లూ, కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి?
- ఓ సోదరి
మీ తమ్ముడికే కాదు... ఆడపిల్ల అయిన మీకూ అమ్మను చూడాల్సిన బాధ్యత ఉంది. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూడటానికి ఆడ, మగ అనే తేడా లేదు. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా తమని తాము పోషించుకోలేని స్థితిలో ఉంటే... ఆ బాధ్యత మిగిలిన వారి మీద పడుతుంది. మీ అమ్మ తన పోషణ నిమిత్తం మీ తమ్ముడి మీద మెయింటెనెన్స్ కేసు వేయాల్సి రావడం... దురదృష్టంగా భావించాలి. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు తల్లిని పోషించలేకపోవడం ఏంటి? అతడు ఆమె ఖర్చులకు డబ్బు పంపకపోవడానికి కారణంగా ఏమి చెబుతున్నాడో ముందు తెలుసుకోండి. ‘హిందూ దత్తత భరణ పోషణముల చట్టం- సెక్షన్ 20’లో ‘హిందూ ఈజ్ బౌండ్’ అని రాసి ఉంటుంది. అంటే అందులోని క్లాజ్(3) ప్రకారం హిందూ వ్యక్తికి... తమని తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులనూ, పెళ్లి కాని ఆడపిల్లల బాగోగులనూ చూడాల్సిన బాధ్యత ఉంది. ఇందులోని సెక్షన్ 21, 22 ప్రకారం పిత్రార్జితపు ఆస్తినీ, తల్లి మరణానంతరం.. ఆమె ఆస్తినీ అనుభవిస్తున్న వారు ఈ బాధ్యతల్ని విస్మరించడానికి అసలు వీలు లేదు. ఇక, మీ అమ్మ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అతని మీద ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కేవలం ఆ కారణంతోనే ఇండియాకి వస్తే అరెస్ట్ చేస్తారని అతడు భయపడి కోర్టుకి హాజరు కావడం లేదేమో! కోర్టులో మీ తమ్ముడి ఉద్యోగం, అతని ఆదాయానికి సంబంధించిన వివరాలు సరిగా సమర్పించారా? నోటీస్‌ని పంపిన చిరునామా సరైనది కాకపోతే ఎంబసీ ద్వారా ఆ వివరాలు తెలుసుకోవచ్చు. అలానే, ఈ విషయం గురించి విదేశీ వ్యవహారాల శాఖకూ, సీనియర్ సిటిజన్ ట్రైబ్యునల్‌కూ, మహిళా కమిషన్‌కూ ఫిర్యాదు చేయొచ్చు. అసలు అతను తల్లి పోషణ నిమిత్తం డబ్బులు పంపించడానికి ఎందుకు విముఖత చూపిస్తున్నాడో కారణం ముందు తెలుసుకోగలగాలి. సమస్య ఏదైనా కౌన్సెలింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. అప్పుడైనా తల్లిని బాధ్యతను తీసుకుంటాడేమో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.