Published : 21/03/2023 00:13 IST

అక్కసంసారంలో చిచ్చు పెడుతున్నారు?

అక్కను మేనత్త కొడుక్కిచ్చి 2005లో ఘనంగా పెళ్లి చేశాం. ఈ విషయంలో ఏ సమస్యా లేదు కానీ, ఆస్తి తగాదాల వల్ల పెదనాన్న కుటుంబంతో మాత్రం మాకు మాటల్లేవు. అయితే, వాళ్లు మేనత్త భర్తతో సన్నిహితంగా ఉంటారు. మా మీద లేనిపోనివి చెప్పి అక్క అత్తింటివారితో శత్రుత్వం పెంచుతున్నారు. తనను శారీరకంగా, మానసికంగా బాధ పెడుతున్నారు. ఈ విషయమై ఆ రెండు కుటుంబాల మీద మేం కేసు పెట్టొచ్చా? ఈ నిర్ణయం సరైనదేనా..? అక్కాబావలిద్దరూ సంతోషంగా కాపురం చేసుకోవడానికి మరేదైనా పరిష్కార మార్గం ఉందేమో సూచించగలరు.

- ఓ సోదరి

మీ అక్కా బావల సంసారం బాగుండాలని కోరుకుంటే నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మంచిది కాదు. దీనివల్ల సమస్య మరింత పెద్దది అయ్యే అవకాశం ఉంది. ఎవరో చెప్పిన మాటలు విని ఆమెను బాధపెడుతున్నారంటే...అతడికి సొంత ఆలోచనా శక్తి లేదనుకోవాలా? ఈ విషయాన్ని చక్కదిద్దడానికి మధ్యవర్తుల సాయం ఏమైనా తీసుకున్నారా? అసలు వారామెను నొప్పించడానికి కారణమేంటో తెలుసుకునే ప్రయత్నమేమైనా చేశారా? లేదంటే ఓసారి తనని ఇంటికి తీసుకొచ్చి మాట్లాడండి. తను బాధపడతుంటే ఊళ్లోని అంగన్వాడీ కార్యకర్తల సాయంతో... గృహహింస చట్టం ద్వారా తనకు రక్షణ కల్పించమని కోరుతూ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇప్పించండి. ఈ చట్టంలోని సెక్షన్‌ 18 ప్రకారం కోర్టు నుంచి కూడా రక్షణ కోరవచ్చు. ఫిర్యాదు తర్వాత ఇద్దరినీ కూర్చోపెట్టి మాట్లాడతారు. సమస్య తీవ్రతను బట్టి కోర్టుకి రిఫర్‌ చేస్తారు. కోర్టులో సెక్షన్‌ 12 కింద పిటిషన్‌ దాఖలు అవుతుంది. ఇక్కడ కూడా తమని మధ్యవర్తిత్వానికి పంపమని అడగొచ్చు. వీలైనంతవరకూ అక్కడే సమస్యని సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. డీవీసీ యాక్ట్‌లో విడాకుల ప్రసక్తి లేదు కాబట్టి కాపురం చక్కబడొచ్చు. ఎవరైతే మీ అక్కాబావల గొడవలకు కారణం అనుకుంటున్నారో వారికి ఎవరితోనైనా మీ అక్క సంసారంలో జోక్యం చేసుకోవద్దని చెప్పించండి.  ఫలితం ఉండొచ్చు. కేసు పెట్టడం వల్ల తమ గౌరవానికి భంగం వాటిల్లిందని, స్వాభిమానాన్ని పోలీస్‌ స్టేషన్‌లో పెట్టారని భావించి బంధాల్ని తెంపుకోవడానికి సిద్ధపడే ప్రమాదమే ఉంది. అపార్థాలూ, అపోహలు, చిన్న చిన్న గొడవలే అయినా సున్నితంగా చర్చించి పరిష్కరించుకోవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని