Legal Advice: రెండో భార్య పిల్లలకు... ఆస్తి వస్తుందా?

60 ఏళ్ల వయసులో కొడుకు కావాలని పేదరికంలో ఉన్న మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు నాన్న. మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. అప్పటికి ఆమెకో కూతురు.

Updated : 12 Mar 2024 15:50 IST

60 ఏళ్ల వయసులో కొడుకు కావాలని పేదరికంలో ఉన్న మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు నాన్న. మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. అప్పటికి ఆమెకో కూతురు. మా అమ్మకు ముగ్గురాడపిల్లలం, తర్వాత తమ్ముడు పుట్టాడు. 5 సెంట్ల స్థలాన్ని పెద్దమ్మకి కొనిచ్చాడు నాన్న. దాన్ని ఆవిడ కూతురుకి ఇచ్చేసి తన దగ్గరే ఉండి పోయింది. నాన్న పోయే నాటికి మాకు 2 లక్షల అప్పుంది. దాన్ని ముగ్గురు కూతుళ్లం తీర్చేశాం. తమ్ముడు ఆయన వ్యాపారం చూసుకుంటున్నాడు. పెద్దమ్మ వాళ్ల అమ్మ అల్లుడూ, కూతురికి ఉమ్మడిగా ఓ ఎకరం రాసిచ్చింది. దాన్ని వాళ్లమ్మాయి అనుభవిస్తోంది. ఆ భూమిలో నాన్నకు వాటా, అందులో మాకు భాగం వస్తాయా? మరో 3 సెంట్ల భూమి (నాన్న స్వార్జితం)లో తనకి భాగం కావాలంటోంది. మొత్తం ఆస్తిలో న్యాయంగా మాకెంతొస్తుంది?

ఓ సోదరి

మీ పెద్దమ్మ పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ స్వార్జితం. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 14 ప్రకారం హిందూ స్త్రీలకు తల్లిదండ్రులూ, అత్త మామలు, భర్త ఇచ్చిన ఆస్తి స్వార్జితం కింద లెక్క. ఇక, భాగస్వామ్యంతోనూ, కోర్టు ఆర్డరు ద్వారానూ వచ్చిన ఆస్తులతో పాటు ఆమె సంపాదనని కూడా కోర్టులు ఇలానే లెక్కేస్తాయి. ఈ ఆస్తిని ఆవిడ తనకు నచ్చిన వారికి ఇచ్చుకునే హక్కు ఉంది. సెక్షన్‌ 15 ప్రకారం హిందూ మహిళ ఎవరైనా వీలునామా రాయకుండా చనిపోతే... ఆమె ఆస్తిపాస్తులు భర్తకూ, పిల్లలకూ చెందుతాయి. వారు లేకపోతే, ఆ భర్త వారసులకూ, ఆ తర్వాత ఆమె తలిదండ్రుల తరఫున వారికీ వస్తాయి. మీ నాన్న పెద్దమ్మకి కొనిచ్చిన 5 సెంట్ల స్థలం పూర్తిగా ఆమెదే. వాళ్లమ్మ గారు తన కూతురు, అల్లుడి పేరు మీద ఉమ్మడిగా పొలం మీద పూర్తి హక్కులు మీ పెద్దమ్మకే ఉంటాయి. జాయింట్‌ ప్రాపర్టీస్‌ ఏవైనా సరే... ఒకరు చనిపోతే, తర్వాత రెండో వారికి పూర్తి హక్కులు వస్తాయి. ఆస్తుల్లో మీ నాన్నగారి స్వార్జితం ఉంటే... హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం క్లాస్‌1- వారసులకు చెందుతుంది. ఇందులో భార్య, పిల్లలందరూ భాగస్వాములే. అంటే... అప్పుడు మీ నలుగురితో పాటు మొదటి భార్యకీ, కూతురికి కూడా సమాన భాగం వస్తుంది. ముందు మీకు జరిగిన అన్యాయాన్ని, మీ నాన్నగారి అప్పులు తీర్చిన వైనం గురించీ పెద్ద మనుషులకు చెప్పి... ఆయన ఆస్తిలో వాటా కోసం ప్రయత్నించండి. మీ నాన్నగారు ఎప్పుడు చనిపోయారో చెప్పలేదు. హిందూ వారసత్వ సవరణ చట్టం- 2005 ప్రకారం ఆస్తిని తీసుకున్న వారికే రుణం తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది. మీరు ఆస్తులేమీ తీసుకోకుండానే వాటిని తీర్చేశారు కాబట్టి ఆ విషయం చెప్పి.... పరిష్కారం కోసం ప్రయత్నించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్