మనకోసమే ఈ ఆరోగ్య బీమా సదుపాయాలు!

చిన్నదో, పెద్దదో.. ఏదైనా అనారోగ్యం ఎదురైతే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవడానికి చాలామంది మహిళలు వెనకాడుతుంటారు.. ఇందుకు ఆ సమస్యను తేలిగ్గా తీసుకోవడం ఒక కారణమైతే.. ఆర్థిక సమస్యలు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అలాగని వాటిని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి అవి మన ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆరోగ్యం విషయంలో ఆర్థిక భరోసా ఉండాలంటే ఆరోగ్య బీమా తప్పనిసరి అని సూచిస్తున్నారు నిపుణులు.

Published : 26 Jul 2021 20:40 IST

చిన్నదో, పెద్దదో.. ఏదైనా అనారోగ్యం ఎదురైతే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవడానికి చాలామంది మహిళలు వెనకాడుతుంటారు.. ఇందుకు ఆ సమస్యను తేలిగ్గా తీసుకోవడం ఒక కారణమైతే.. ఆర్థిక సమస్యలు మరో కారణంగా చెప్పుకోవచ్చు. అలాగని వాటిని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి అవి మన ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆరోగ్యం విషయంలో ఆర్థిక భరోసా ఉండాలంటే ఆరోగ్య బీమా తప్పనిసరి అని సూచిస్తున్నారు నిపుణులు. అయితే మారుతున్న కాలం, అవసరాలకు అనుగుణంగా పలు బీమా సంస్థలు కూడా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. ఈ క్రమంలోనే స్త్రీలకు సంబంధించిన ప్రత్యుత్పత్తి సమస్యల దగ్గర్నుంచి క్యాన్సర్‌ వంటి మహమ్మారులను ప్రారంభంలోనే గుర్తించేందుకు వీలుగా చేసే పరీక్షల దాకా వివిధ బీమా సదుపాయాల్ని అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి మహిళకు ఆరోగ్య బీమా తప్పనిసరి అని, తద్వారా వారు ఆర్థికంగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన అవసరం రాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహిళల కోసం అందుబాటులో ఉన్న వివిధ రకాల బీమా సదుపాయాల గురించి తెలుసుకుందాం..!

ఉద్యోగం చేసే మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దీంతో పాటే వారిలో ఒత్తిడీ పెరుగుతోంది. ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ పనులు, ఇతర బాధ్యతల్ని సమన్వయం చేసుకునే క్రమంలో మహిళలు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది వారిలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇక కొవిడ్‌ వెలుగు చూసిన నాటి నుంచి మహిళలపై అధిక పని భారం పడుతోందని చెప్పుకోవచ్చు. తద్వారా ప్రస్తుతం వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతోన్న స్త్రీలు సుమారు 71 శాతానికి పైగానే ఉన్నట్లు తాజా నివేదిక తేల్చింది. అందుకే ఇలాంటి మహిళలు వారి అనారోగ్యాల్ని జయించడానికి ఆరోగ్య బీమా కలిగి ఉండాలని, తద్వారా తమ బడ్జెట్‌కు ఎలాంటి లోటూ రాకుండా బీమా సదుపాయాల్ని పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎలాంటి ఆప్షన్లున్నాయి?!

ప్రస్తుతం బీమా కంపెనీలు మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక ఆప్షన్లను అందిస్తున్నాయి. వాటిని ఉపయోగించుకొని చిన్న చిన్న అనారోగ్యాల దగ్గర్నుంచి పెద్ద పెద్ద జబ్బుల దాకా తక్కువ ఖర్చుతోనే చికిత్స చేయించుకోవచ్చు.

* కొన్ని బీమా సదుపాయాల్లో భాగంగా రొమ్ము, వెజైనల్‌, ఒవేరియన్‌.. వంటి క్యాన్సర్ల చికిత్సకయ్యే ఖర్చును పాలసీ కింద క్లెయిమ్‌ చేసుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి.

* అలాగే ప్రసూతి సమయంలో తల్లీబిడ్డలిద్దరికయ్యే ఆస్పత్రి ఖర్చులతో పాటు పుట్టుకతోనే ఏదైనా అంగవైకల్యంతో జన్మించే చిన్నారుల కోసం బీమా కవరేజీని అందిస్తున్నాయి.

* రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించడానికి చేసే మామోగ్రఫీ, అండాశయ క్యాన్సర్‌ను గుర్తించేందుకు పాప్‌స్మియర్‌ టెస్ట్‌.. వంటి పరీక్షలకయ్యే ఖర్చును ఆరోగ్య బీమా కింద క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటును మరికొన్ని సంస్థలు అందిస్తున్నాయి.

* పీసీఓఎస్‌, థైరాయిడ్‌.. వంటి సమస్యలతో బాధపడే కొంతమంది మహిళలు తరచూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. ఈ క్రమంలో వివిధ రకాల స్కానింగులు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఖర్చు తడిసి మోపెడవుతుంది. కానీ ఈ ప్రయోజనాలను అందించే ఆరోగ్య బీమా పాలసీ తీసుకుంటే ఇలాంటి రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్స్‌, వివిధ పరీక్షల కోసం పెట్టే ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు.

* సంతానలేమితో బాధపడే మహిళలకు ఐవీఎఫ్‌, ఐయూఐ.. వంటి చికిత్సలతో సంతాన భాగ్యం పొందే అవకాశం ఉన్నా ఆర్థిక సమస్యల దృష్ట్యా ఈ ఆలోచనను విరమించుకొనే మహిళలెందరో! అలాంటి వారి కోసం ఈ సంతానలేమి చికిత్సల్ని తమ బీమా పాలసీల్లో భాగంగా కవర్‌ చేస్తున్నాయి కొన్ని బీమా సంస్థలు.

* ఆస్టియోపొరోసిస్‌, క్యాన్సర్‌.. వంటి సమస్యల్ని నిర్ధరించుకోవడానికి చేసే స్క్రీనింగ్‌ టెస్టులు, మానసిక సమస్యల్ని దూరం చేసుకోవడానికి తీసుకునే కౌన్సెలింగ్‌.. వంటి వాటికయ్యే ఖర్చును తమ బీమా పాలసీ కింద మాఫీ చేసుకోవచ్చంటూ కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి.

* ఇక వాహన బీమా పాలసీ కింద మహిళా వాహనదారులు వైద్య సేవల్ని పొందే వెసులుబాటునూ కల్పిస్తున్నాయి పలు సంస్థలు.

ప్రయోజనాలివే!

* ఈ తరం మహిళలంతా స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇదే స్వతంత్రతను బీమా మనకు అందిస్తుంది. ఏదైనా అనారోగ్యం ఎదురైనప్పుడు ఆర్థికంగా ఇతరులపై ఆధారపడకుండా.. దాని చికిత్సకయ్యే ఖర్చును పాలసీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే ఆ ఆరోగ్య సమస్య మనం తీసుకొనే పాలసీ కింద కవరవుతుందా, లేదా అనేది తీసుకునే ముందే సరిచూసుకోవాల్సి ఉంటుంది.

* ఆరోగ్య బీమా పాలసీ ద్వారా సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న ఆస్పత్రుల్లో (Network Hospitals) నగదు రహిత ట్రీట్‌మెంట్‌ని పొందచ్చు. తద్వారా మంచి నాణ్యతా ప్రమాణాలున్న వైద్య సేవలతో త్వరగా సమస్య నుంచి బయటపడచ్చు. అయితే క్లెయిమ్‌ చేసుకునే మొత్తం కంటే మీ చికిత్సలకయ్యే ఖర్చులు ఎక్కువైతే మాత్రం ఆ అదనపు ఖర్చును మీరే భరించాల్సి ఉంటుంది. కాబట్టి మన అంచనా కంటే కాస్త ఎక్కువ మొత్తానికే బీమా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

* బీమా తీసుకోవడం వల్ల పన్ను నుంచి మినహాయింపు పొందచ్చు. మీరు బీమా తీసుకున్న మొత్తానికి డాక్యుమెంట్లను జత చేస్తూ సెక్షన్‌ 80 సి కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

* క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు, ఇతర అనారోగ్యాలు తలెత్తినప్పుడు వాటికయ్యే భారీ ఖర్చును మనం తీసుకున్న పాలసీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. తద్వారా సమయానికి చేతిలో చిల్లిగవ్వ లేదే అని బాధపడాల్సిన పని ఉండదు.

అయితే ఇలా ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవడమే కాదు.. పాలసీ తీసుకునే క్రమంలో మీ వయసు, దశ, మీపై ఆధారపడిన వారు, మీకున్న అనారోగ్యాలు, మీరున్న ప్రదేశం.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. అలాగే మీ అనారోగ్యాలు పాలసీలో కవరయ్యాయో, లేదో చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. మీరు బీమా తీసుకోబోయే కంపెనీ నిర్దేశించే నియమ నిబంధనల్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పాలసీ తీసుకోవడం ఉత్తమం అన్న విషయం గుర్తుపెట్టుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్