సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..
close
Published : 16/01/2022 13:35 IST

సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!

సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మనకు ఎన్నో జీవన రహస్యాలు అవగతమవుతాయి. మరి, సంక్రాంతి మనకు నేర్పే ఆ విషయాలేంటో తెలుసుకుందామా...

కష్టపడితే ఆనందమే..

'అబ్బా.. నా జీవితంలో ఎప్పుడూ కష్టాలే..', 'ఇన్ని కష్టాలు నాకే ఎందుకొస్తున్నాయో..' అనుకునేవాళ్లని మనం చూస్తూ ఉంటాం. అయితే కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. దాన్ని వారు చూసే కోణం వేరుగా ఉండొచ్చు. మనం ఎంత కష్టపడితే అంత సుఖంగా ఉండొచ్చని పెద్దలు చెబుతుండడం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. ఇదే విషయాన్ని సంక్రాంతి పండగలోనూ చూడచ్చు. పాలు, బియ్యం వేడివేడి మంటపై ఉడికి పొంగలిగా మారతాయి. కష్టాలకు తట్టుకొని నిలబడితే మనమూ కొత్త వ్యక్తిలా మారతాం.. మన జీవితమూ మధురంగా తయారవుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం.

ముగ్గు నేర్పే పాఠం!

జీవితం చాలా చిన్నది.. ఈ లోకంలోకి వచ్చిన ఎవరికీ తమ జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కానీ కొంతమంది ఉన్న కొద్దిపాటి జీవితాన్ని కూడా 'నాకు ఎన్ని కష్టాలున్నాయో..' అనుకుంటూనే ముందుకు సాగుతారు. ఇది సరైన పద్ధతి కాదని సంక్రాంతి పండగ రోజు వేసే ముగ్గు మనకు నేర్పిస్తుంది. ఉదయాన్నే లేచి వాకిలి వూడ్చి, కల్లాపి చల్లి, ముగ్గు పెట్టడం మనందరికీ తెలిసిందే. సాధారణంగా రోజూ ఇంటిముందు ముగ్గు పెట్టడానికి పెద్దగా ఆసక్తి కనబర్చనివారు కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలు.. రంగురంగుల ముగ్గులు వేయడానికి ఇష్టపడుతుంటారు. దీన్ని ఎంతో ఓపికతో శ్రమకోర్చి మరీ వేస్తారు. ఆ ముగ్గు ఒక రోజుకే పరిమితం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ నా ముగ్గే అందంగా ఉండాలి అనుకుంటూ వేస్తాం.. ఒకరోజు ఉండిపోయే ముగ్గు గురించే అంత జాగ్రత్త తీసుకునేవాళ్లం.. మన జీవితం గురించి, ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త వహించాలి..? అని ఆలోచించేలా చేస్తుందది..

అంతేకాదు.. ఉండేది ఒకరోజే అయినా అందంగా మెరుస్తూ కనిపిస్తూ, మనల్ని మరింత సంతోషంలో ముంచెత్తుతుంది. మధ్యలో వచ్చే గాలి, అటూఇటూ వెళ్తూ తొక్కే మనుషులు.. వీటన్నింటినీ తట్టుకుంటూ రోజంతా నిలుస్తుంది. మనమూ దాన్ని ఆదర్శంగా తీసుకుని మన జీవితంలోనూ ఎన్ని కష్టాల సుడిగాలులెదురైనా.. మనల్ని దాటుకుంటూ ఎంతమంది ముందుకు వెళ్లిపోయినా.. వాటన్నింటినీ తట్టుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలి.. అన్నదే ముగ్గు చెప్పే పాఠం!

చెడును కాల్చేయండి..

మూడు రోజుల పండగ సంక్రాంతిలో మొదటి రోజు భోగి.. ఆరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి భోగిమంటలు వేస్తాం. ఇంట్లో అవసరం లేని చెక్క సామగ్రిని అందులో వేసి మంట పెడతాం. సామగ్రి కొన్నప్పుడు ఎంత ఖర్చయినా కావచ్చు.. కానీ అది పాడైపోయిన తర్వాత మాత్రం ఇంట్లో ఉంచుకుంటే దానివల్ల ఇతర వస్తువులకు స్థానం ఉండదు. అంతేకాదు.. అడ్డుగా కూడా అనిపిస్తుంది. అందుకే అలాంటిదాన్ని భోగిమంటలో వేసేస్తారు. మనలోని చెడు జ్ఞాపకాలు కూడా అంతే.. అవి మనసులో ఉండిపోయినంత కాలం మంచి నడవడికకు చోటుండదు. దానివల్ల మన జీవితానికి ఎలాంటి లాభం ఉండదు సరికదా.. కొత్తగా, సరైన దారిలో జీవితాన్ని ప్రారంభించడానికి అది అడ్డుగా మారచ్చు. అందుకే ఇలాంటి జ్ఞాపకాలేవైనా ఉంటే వాటిని కూడా మంటలో వేసి మసి చేసేయాలి. ఇదే భోగి మంట చెప్పే తత్వం. కేవలం పాత జ్ఞాపకాలనే కాదు.. అవసరం లేని వస్తువులను మంటలో వేసినట్లు మనలోని దుర్గుణాలను కూడా మసి చేయాలన్నది భోగి మంట సారాంశం.

ఎల్లుబెల్ల తిండు..

మన దగ్గర కాస్త తక్కువే అయినా.. మన చుట్టు పక్కన ఉన్న రాష్ట్రాల్లో సంక్రాంతికి తప్పనిసరిగా నువ్వుల లడ్డూలను తీసుకుంటారు. ఇది శరీరంలో వేడి పుట్టిస్తుందట. కనుమ రోజు మినుము తప్పక తినాలి.. అని మన పెద్దలు అనేది అందుకే.. అయితే కేవలం నువ్వుల ఉండలు తినడమే కాదు.. దాన్ని పక్కవాళ్లకు పంచుకోవడం కూడా మనం గమనిస్తుంటాం.. మన పక్కనే ఉన్న కర్ణాటకలో నువ్వుల ఉండలను పంచుకుంటూ 'ఎల్లుబెల్ల తిండు ఒల్లె మాతడి' అని, మహారాష్ట్రలో 'తిల్‌గుడ్ గ్యా అనె గొడ్‌గొడ్ బోల్' అని చెప్పుకుంటూ వీటిని పంచుకుంటారు. అంటే ఈ తీపి పదార్థం తిని ఇకపై మంచిగా మాట్లాడు అని అర్థం. ఎలాంటి విభేదాలున్నా.. అవతలి వారికి తీపిని అందించి.. గొడవలకు అంతం పలకాలని చెప్పడమే దీనిలోని పరమార్థం. అంతేకాదు.. ఈ పండగ సమయంలోనైనా మన మనసులను ఒక్కసారి పరిశీలించుకొని తిల్‌గుల్ (నువ్వుల లడ్డు)లా తియ్యని మాటలు మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చెడు మాటలను, చెడు ప్రవృత్తిని వదిలేద్దాం అని చెబుతుందీ సంప్రదాయం.

సాయం మరవొద్దు..

రైతులు ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తారు. దీనికి వారు పడే కష్టం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వారి కష్టంలో తోడ్పాటునిస్తూ.. తమ సాయాన్నందించేవి పశువులు. అందుకే సంక్రాంతి పూట వాటిని పూజించడం ఆనవాయితీ. కష్టంలో ఉన్నప్పుడు సహాయపడిన వారిని ఆనందంలో ఉన్నప్పుడు తలచుకోవడం అనేది ఈ పద్ధతి నుంచి తెలుసుకోవచ్చు. మనం కష్టంలో ఉన్నప్పుడు మనల్ని నమ్మి సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. జీవితంలో ఆపై కష్టాలొచ్చినా.. సుఖాలొచ్చినా.. వారి సాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. అన్నది దీనిద్వారా మనకు అవగతమవుతుంది. ఇదే పద్ధతిని జీవితంలోనూ పాటిస్తే.. అందరితో కలిసి ఆనందంగా గడిపే అవకాశం దొరుకుతుంది. ఏమంటారు?


Advertisement

మరిన్ని