Published : 15/11/2022 21:01 IST

పెదాలు పొడిబారుతున్నాయా?

చలికాలంలో పెదాలు పొడిబారడం అనేది చాలామందిలో తలెత్తే సమస్యే! తద్వారా అధరాలు నల్లగా మారిపోయి, నిర్జీవంగా కనిపిస్తుంటాయి. మరి, వీటికి తిరిగి జీవం పోయడం కొన్ని సహజసిద్ధమైన ప్యాక్స్‌తోనే సాధ్యమంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

తేనెతో కోమలంగా..

పెదాలు ఎర్రగా, మృదువుగా, కోమలంగా మారేందుకు తేనె ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకోసం టీస్పూన్ తేనెలో అరటీస్పూన్ దానిమ్మ రసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే సరి. ఇలా తరచూ చేస్తుంటే కోమలమైన పెదాలు మీ సొంతమవుతాయి. ఇందులో తేనె చర్మానికి తేమను అందించి వాటిని సుతిమెత్తగా మారిస్తే.. దానిమ్మ రసం పెదాలకు మంచి రంగును తెచ్చిపెడుతుంది.

‘గులాబీ’ అందం కోసం..

గులాబీ పువ్వులో విటమిన్ 'ఇ' ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మానికి తేమను అందిస్తుంది. అందుకే పావు కప్పు పాలల్లో కొన్ని గులాబీ రేకులను వేసి చేత్తో నలుపుతూ మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో టీస్పూన్ బాదం నూనె, టీస్పూన్ గ్లిజరిన్ కూడా వేసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. ఆరిపోకుండా అప్పుడప్పుడూ మరో కోటింగ్ వేస్తూ ఇరవై నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై చల్లని నీటితో కడిగేస్తే సరి. గులాబీ రేకులు పెదాలకు మంచి రంగును అందించి తేమగా ఉండేలా చేస్తాయి. పాలలోని లాక్టిక్ ఆమ్లం పెదాలపై ఉన్న మృతచర్మాన్ని తొలగిస్తే, బాదం నూనె అధరాల్ని మృదువుగా మారుస్తుంది.

గ్లిజరిన్ వాడుతూ..

గ్లిజరిన్‌ని రోజూ ఉపయోగించడం వల్ల పెదాలు సున్నితంగా తయారవుతాయట. నల్లబడిన పెదాల రంగును తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. అందుకే ఐదు వంతుల నిమ్మరసంలో ఒక వంతు గ్లిజరిన్ వేసి రోజూ పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. ఆపై పావుగంట అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే సరి.. ఇలా కొన్నిరోజుల పాటు చేస్తే పెదాలు మృదువుగా మారతాయి.

బీట్‌రూట్ రసంతో..

బీట్‌రూట్ పెదాలకు చక్కటి రంగును అందించడంతో పాటు నలుపుదనాన్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. పెదాలను మృదువుగా చేసేందుకు గ్లిజరిన్ తోడ్పడుతుంది. అందుకే ఈ రెండింటి కలయికతో ప్యాక్ వేసుకుంటే పెదాలు మెరిసిపోవడం ఖాయం. దీనికోసం బీట్‌రూట్‌ని తురుముకొని జ్యూస్ చేసుకోవాలి. దీన్ని ఒక రోజంతా ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. లేదా కాస్త వేడిచేయచ్చు కూడా..! ఇలా చేయడం వల్ల అది కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు అందులో ముప్పావు టీస్పూన్ గ్లిజరిన్ వేసి ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకోవాలి. ఆపై అరగంటకు చల్లటి నీటితో కడిగేసుకుంటే సరి. ఈ ప్యాక్‌ని రోజూ ఉదయం వేసుకోవడం వల్ల రోజంతా ఎర్రని, మృదువైన పెదాలను సొంతం చేసుకోవచ్చు.

నిమ్మరసంతో..

నిమ్మరసం, తేనె.. పెదాల సంరక్షణలోనూ ఇవి బాగా తోడ్పడతాయి. ఇందుకోసం టీస్పూన్ చొప్పున నిమ్మరసం, తేనె తీసుకొని అందులో అరటీస్పూన్ ఆముదం వేసి పెదాలకు అప్త్లె చేసుకోవాలి. నిమ్మరసం బ్లీచ్‌లా పనిచేస్తే.. తేనె, ఆముదం చర్మానికి తేమనందిస్తాయి. కాబట్టి పెదాలు చక్కటి రంగుతో, మృదువుగా మెరిసిపోతూ కనిపిస్తాయి.

రాస్బెర్రీతో ఎర్రటి పెదాలు..

పండ్లలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకే కాదు.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. పెదాల సంరక్షణకు రాస్బెర్రీ చక్కగా సహాయపడుతుంది. ఇందుకోసం రాస్బెర్రీ గుజ్జును కొద్దిగా తీసుకొని తేనె, కలబంద గుజ్జు టేబుల్ స్పూన్ చొప్పున అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్త్లె చేసుకొని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే సరి. ఎర్రని మృదువైన పెదాలు సొంతమవుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని