Published : 02/03/2023 00:09 IST

Nazeerunnisa Sharif: మనసైన వ్యాపకం

‘హమ్మయ్యా.. ఉద్యోగమొచ్చింది చాలు’ అనుకోవడం లేదీ తరం అమ్మాయిలు. వృత్తితోపాటు అభిరుచులపైనా దృష్టిపెడుతున్నారు. ఆ కోవలోకే వస్తుంది నసీరున్నీసా షరీఫ్‌! లిప్పన్‌లో కళాకృతులను తయారు చేస్తున్న తను.. దానికి సమాజ సేవనీ జోడిస్తోంది.

సీరున్నీసాది ఉయ్యూరు. ఎంఫార్మసీ చదివిన తను నోవార్టిస్‌ ఫార్మాలో అసోసియేట్‌ క్లినికల్‌ డేటాబేస్‌ డెవలపర్‌గా పనిచేస్తోంది. కొవిడ్‌ నుంచి ఇంటి వద్ద నుంచే పని. ఖాళీ సమయంలో ఏదైనా ప్రయత్నిస్తే బాగుంటుందన్న తనను లిప్పన్‌ ఆర్ట్‌ ఆకర్షించింది. గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతం లిప్పన్‌ ఆర్ట్‌కి ప్రసిద్ధి. అక్కడి ప్రజలు అద్దాలు, ప్రత్యేకమైన మట్టితో కళాకృతులను రూపొందించి, గృహాలంకరణలో వాడతారు. అది నచ్చి నసీరున్నీసా నేర్చుకుంది. గృహాలంకరణతోపాటు అందమైన ఆభరణాలనూ తయారు చేస్తోంది. ఈ ఆర్ట్‌కు ఒకరకమైన సిమెంట్‌ లాంటి మట్టిని వాడతారు. ఇది పర్యావరణానికి అంత మంచిది కాదని గ్రహించింది నసీరున్నీసా. దీంతో సహజ పదార్థాలు.. సజ్జపిండి, చాక్‌ పౌడర్‌, ఫెవికాల్‌, వెజిటబుల్‌ ఆయిల్‌, వెనిగర్‌లతో ముడిసరకు తయారు చేస్తోంది. దానికి అద్దాలు, పూసలు వంటివి జోడించి కళాకృతుల్ని తయారు చేస్తోంది. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మడం ప్రారంభించింది. తాజాగా నోవార్టిస్‌ వార్షికోత్సవంలో వీటిని ప్రదర్శించి, అమ్మకాలు చేపట్టింది. వ్యాపకమైనా దానికి సమాజ హితమూ తోడవ్వాలని నమ్ముతుంది నసీరున్నీసా. అందుకే వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని అనాథ శరణాలయాలకు ఖర్చు చేస్తోంది. ‘ఇది వ్యాపకమే కాదు.. ఒత్తిడిని దూరం చేసే మార్గం కూడా! అందుకే దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని సమాజ సేవకు వినియోగించాలనుకున్నా’నంటోంది నసీరున్నీసా.

- పాషా ఉయ్యూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి