IFFK: బాంబు దాడిలో కాళ్లు కోల్పోయినా.. తన కలను వదులుకోలేదు!

‘అవయవ లోపం శరీరానికే కానీ సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి కాదం’టోంది టర్కీకి చెందిన దర్శకనిర్మాత లీసా కలాన్‌. ఐసిస్‌ ఉగ్రదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకున్న ఆమె.. ఏళ్ల పాటు మంచానికే పరిమితమైంది.. అయినా ‘ఇక నా జీవితం ఇంతే!’ అని అధైర్యపడలేదు. చిన్నతనం నుంచీ సినిమాల్నే ప్రేమించిన ఆమె.. తిరిగి అదే రంగంలో తన కెరీర్‌ను.......

Updated : 19 Mar 2022 16:39 IST

(Photo: Instagram)

‘అవయవ లోపం శరీరానికే కానీ సంకల్పానికి, ఆత్మవిశ్వాసానికి కాదం’టోంది టర్కీకి చెందిన దర్శకనిర్మాత లీసా కలాన్‌. ఐసిస్‌ ఉగ్రదాడిలో రెండు కాళ్లు పోగొట్టుకున్న ఆమె.. ఏళ్ల పాటు మంచానికే పరిమితమైంది.. అయినా ‘ఇక నా జీవితం ఇంతే!’ అని అధైర్యపడలేదు. చిన్నతనం నుంచీ సినిమాల్నే ప్రేమించిన ఆమె.. తిరిగి అదే రంగంలో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఎన్నో స్ఫూర్తిదాయక చిత్రాల్ని రూపొందిస్తూ, మహిళా సమస్యల్ని కళ్లకు కడుతూ.. ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఇందుకు ప్రతిగానే ప్రస్తుతం జరుగుతోన్న కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘స్పిరిట్‌ ఆఫ్‌ సినిమా’ అవార్డు అందుకుంది. ఈ చిత్రోత్సవంలో ఈ అవార్డును ఈసారే కొత్తగా ప్రవేశపెట్టడం, తొలి విడతలోనే లీసా దీన్ని అందుకోవడం విశేషం. మరి, సినిమా కథను మించిన ట్రాజెడీని తలపించే ఈ లేడీ ఫిల్మ్‌మేకర్‌ సక్సెస్‌ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి..

లీసా కలాన్‌.. టర్కీలోని దియార్‌బాకిర్‌ సిటీలో 1987లో జన్మించింది. రాజకీయ నేపథ్యం ఉన్న కుర్దిష్‌ కుటుంబం ఆమెది. అయితే తన చిన్నతనంలో తన ప్రాంతం అణచివేతకు గురవడంతో ఆ సమయంలో ఎన్నో కష్టాలు పడిందామె. తన మాతృభాషలో ఉన్నత విద్యను అభ్యసించే వీల్లేక.. టర్కిష్‌ భాషలో తనకు చదివే అర్హత లేకపోవడంతో హైస్కూల్‌ విద్యతోనే చదువు ఆపేయాల్సి వచ్చింది లీసా. అలాగని నిరాశ పడలేదామె. చిన్నతనం నుంచి తాను ఆసక్తి చూపే చిత్ర రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.

సినీ రంగంలో ఓనమాలు!

ఈ క్రమంలోనే ‘ఆరమ్‌ టైగ్రన్‌ సిటీ కన్జర్వేటరీ’లో సినీ రంగంలో ఓనమాలు దిద్దింది లీసా. అదృష్టవశాత్తూ ఈ కోర్సును తన మాతృభాషలోనే బోధించడం ఆమెకు కలిసొచ్చింది. అయితే రెండేళ్ల అనంతరం పలు కారణాల వల్ల తాను శిక్షణ పొందే కన్జర్వేటరీని మూసేశారు. అయినా ఈ రెండేళ్ల కాలంలోనే సినిమా గురించి బోలెడన్ని నైపుణ్యాలు/విషయాలు ఒంటబట్టించుకుందీ లేడీ ఫిల్మ్‌మేకర్‌. ఇక తన ప్రాంత వాసుల సమస్యలు, అక్కడి మహిళలు ఎదుర్కొంటోన్న సవాళ్లే తన సినిమాకు కథాంశాలుగా మార్చుకుంది. ఈ క్రమంలో కుర్దిష్‌ కమ్యూనిటీ ప్రజల జీవనశైలి, కొండ ప్రాంతాల్లో నివసించే తమ ఆచార వ్యవహారాల్ని, అక్కడి మహిళల వెతల్ని.. లఘుచిత్రాలుగా, డాక్యుమెంటరీలుగా రూపొందించి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది లీసా.

చావు అంచుల దాకా వెళ్లొచ్చింది..!

ఇలా సినిమా రంగంలో నిలదొక్కుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకునే క్రమంలోనే విధి తనను చిన్న చూపు చూసింది. 2015, జూన్‌ 5న నిర్వహించిన పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ ఎలక్షన్‌ ర్యాలీలో పాల్గొంది లీసా. ఇదే అదనుగా భావించిన ఐసిస్‌ ఉగ్రవాదులు పార్టీని లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులు జరిపారు. ఈ పేలుళ్లలో తన రెండు కాళ్లు పోగొట్టుకోవడంతో పాటు తీవ్ర గాయాల పాలైందామె. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు లీసా చికిత్స కోసం నిధులు సమీకరించారు. ఈ క్రమంలోనే టర్కీ, జర్మనీల్లో ఆమెకు సుమారు తొమ్మిదిసార్లు శస్త్రచికిత్సలు జరిగాయి. అయినా తన కాళ్లను తిరిగి పొందలేకపోయిందామె. జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైంది.. తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. అయితే అదే సమయంలో ఓ వైద్యుడు ఆమె కాళ్లకు టైటానియం ఇంప్లాంట్స్‌ని అమర్చి.. ఆమె కోసం ప్రత్యేకంగా ప్రోస్థటిక్‌ కాళ్లను తయారుచేయించారు. దీంతో అప్పట్నుంచి పెట్టుడు కాళ్లతోనే తన కెరీర్‌ని కొనసాగిస్తోంది లీసా.

పడి లేచిన కెరటంలా..!

శస్త్రచికిత్సలు, ఇతర ట్రీట్‌మెంట్లు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా సుమారు ఆరేళ్ల పాటు కెరీర్‌కి దూరమైన లీసా.. పడి లేచిన కెరటంలా మళ్లీ దూసుకొచ్చింది. దాడి రూపంలో విధి విసిరిన సవాళ్లకు ఎదురీది నిండైన ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని తన గుండెల్లో నింపుకొంది. ‘ది టంగ్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌’, ‘డ్రాప్‌’, ‘ది బటర్‌ఫ్లై దట్‌ క్రియేట్స్‌ ఇట్‌సెల్ఫ్‌’.. వంటి సినిమాల్ని రూపొందించి, నిర్మించింది.. మరికొన్ని సినిమాల్లో నటించింది కూడా! అంతేకాదు.. ఈమధ్యే వర్చువల్‌ రియాల్టీ (వీఆర్‌) టెక్నాలజీతో మరో చిత్రాన్ని కూడా రూపొందించింది లీసా. ఏదేమైనా బాంబు దాడి తర్వాత తాను ప్రపంచాన్ని చూసే దృష్టి కోణం మారిందని చెబుతోందీ ఫేమస్‌ డైరెక్టర్.

‘దాడికి ముందు నుంచి నాలో సహానుభూతి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు దాంతో పాటు చేయాలన్న పట్టుదల కూడా పెరిగింది. శారీరక లోపాలున్న వారిని ఈ సమాజం ఏమీ చేతకాని వారిలా చూస్తుంది. దాడి తర్వాత నేనెదుర్కొన్న ఇలాంటి సంఘటనలే బహుశా నన్ను ఇంత దృఢంగా మార్చాయేమో అనిపిస్తుంది. ఏళ్లు గడుస్తోన్నా కుర్దిష్‌ ప్రజలు ఇంకా అసమానతల్ని, పలు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. సినిమాల ద్వారా వాళ్ల గళానికి గొంతుకనవుతా.. అలాగే ఐసిస్‌ బాంబు దాడుల పైనా ఓ సినిమా రూపొందించాలనుకుంటున్నా..’ అంటోందీ దర్శకురాలు.

ప్రతిభకు పురస్కారం!

అయితే తాను రాసి, దర్శకత్వం వహించిన ‘ది టంగ్‌ ఆఫ్‌ ది మౌంటెయిన్స్‌’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వివిధ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలందుకుంది.. ఇక తాజాగా ‘కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవా’ల్లోనూ దీన్ని ప్రదర్శించారు. అంతేకాదు.. ఈ వేడుకలకు ముఖ్య అతిథి కూడా లీసానే! ఇలా జీవితం తనకు విసిరిన సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటూ.. చిత్ర రంగంలో తాను చేస్తోన్న కృషికి గుర్తింపుగా ఈ చిత్రోత్సవాల్లో ఆమెను ‘స్పిరిట్‌ ఆఫ్‌ సినిమా అవార్డు’తో సత్కరించారు. పైగా ఈ అవార్డును ఈసారే కొత్తగా ప్రవేశపెట్టడం, తొలి విడతలోనే లీసా దీన్ని అందుకోవడం విశేషం. కేరళ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకుంది.

తనలోని శారీరక లోపాన్ని, సమాజపు ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఈ ప్రపంచానికి తన సత్తాను చాటుతోన్న అరుదైన వ్యక్తి లీసా. ఆమె విజయగాథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్