Updated : 23/09/2021 19:56 IST

అలా రెండేళ్లలో 40 కిలోల బరువు తగ్గాను!

(Photo: Instagram)

లాక్‌డౌన్‌ రూపంలో దొరికిన ఖాళీ సమయాన్ని బరువు తగ్గించుకునేందుకు వినియోగించుకున్నారు చాలామంది సినీ తారలు. ఎలాంటి శస్త్రచికిత్సల జోలికి పోకుండా ఇంట్లోనే హెల్దీ డైట్‌, ఫిట్‌నెస్‌ టిప్స్‌ పాటిస్తూ నాజుగ్గా మారిపోయారు. ఇందులో భాగంగా కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌ 10 నెలల కాలంలో 15 కిలోల బరువును తగ్గించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆ జాబితాలోకి నిర్మాత లిజెల్ డిసూజా కూడా చేరింది. గతంలో 105 కిలోలతో ఎంతో బొద్దుగా ఉన్న ఆమె రెండేళ్లలో 40 కిలోల బరువును తగ్గించుకుని నాజుగ్గా మారిపోయింది.

2 ఏళ్లలో 40 కిలోలు తగ్గింది!

ప్రముఖ కొరియోగ్రాఫర్ రెమో డిసూజా సతీమణి అయినప్పటికీ నిర్మాతగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది లిజెల్. 2013లో ఓ బెంగాలీ సినిమాతో నిర్మాతగా కెరీర్‌ ఆరంభించిన ఆమె ఆ తర్వాత తన భర్తతో కలిసి ‘ఏబీసీడీ (ఎనీ బడీ కెన్‌ డ్యాన్స్‌)’, ‘ఎ ఫ్లయింగ్‌ జాట్‌’, ‘టైమ్‌ టు డ్యాన్స్‌’, ‘నవాబ్‌ జాదే’, ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ - 3D’ చిత్రాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే లిజెల్ తన ఫ్యాషనబుల్‌ ఫొటోలు, ఫిట్‌నెస్‌, వర్కవుట్‌ విషయాలను షేర్‌ చేసుకుంటుంది. గత రెండేళ్ల నుంచి బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న ఆమె ఇప్పుడు 65 కిలోలతో ఎంతో నాజుగ్గా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తన ‘వెయిట్‌ లాస్‌ జర్నీ’ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

సర్జరీకి వెళదామనుకున్నా... కానీ!

‘నాకు రెండుసార్లు సిజేరియన్ అయింది. అదేవిధంగా కొన్ని కారణాలతో నా బరువు విపరీతంగా పెరిగిపోయింది. అందుకే 2018 చివరిలో బరువు తగ్గించుకోవడం కోసం బెరియాట్రిక్‌ సర్జరీకి వెళదామనుకున్నాను. సలహా కోసం నాకు తెలిసిన ఓ డాక్టర్‌ను కలిశాను. కానీ సర్జరీ తర్వాత మళ్లీ బరువు పెరిగే అవకాశం ఉందని ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలన్నాడు డాక్టర్‌. అన్నిటికంటే ముఖ్యంగా బరువు తగ్గేందుకు మన మెదడును బాగా ట్యూన్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు నా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ను పిలిచి ‘నన్ను స్లిమ్‌గా మార్చకపోతే నువ్వు బెస్ట్‌ ట్రైనర్‌ అన్న విషయాన్ని ఒప్పుకోను’ అన్నాను. ఆ సమయంలో అతను ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ గురించి చెప్పాడు. 2019 జనవరి నుంచి దీనిని పాటిస్తున్నాను. మొదట 15 గంటల పాటు ఉపవాసం ఉండేదాన్ని. క్రమంగా దానిని 16 గంటలకు పొడిగించాను. పిండి పదార్థాలు, జంక్‌ఫుడ్స్‌ను బాగా తగ్గించాను. ఇలా చేయడం వల్ల మొదటి ఏడాది 15-20 కిలోల బరువు తగ్గాను.’

రోజుకు ఒకపూట మాత్రమే తిన్నాను!

‘ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌తో నా శరీరంలో ఎన్నో సానుకూల మార్పులొచ్చాయి. దీంతో ఉపవాస సమయాన్ని 18-20 గంటలకు పెంచాను. రోజుకు ఒకపూట మాత్రమే తిన్నాను. అది కూడా ఇంట్లో తయారుచేసిన ఆహార పదార్థాలనే తీసుకున్నాను. రెమో (భర్త)తో కలిసి జిమ్‌లో వ్యాయామాలతో పాటు సాయంత్రం పూట ఇంటి ఆవరణలో వాకింగ్‌ ఎక్కువగా చేశాను. ఇక చీట్‌ మీల్స్‌ విషయానికొస్తే.. పిజ్జాలు, బర్గర్లను దూరం పెట్టాను. వాటి స్థానంలో నాకు ఇష్టమైన చాట్‌, పానీ పూరి, సింధీ కధీ, కీటో ఐస్‌ క్రీం, కీటో పిజ్జాలను తీసుకున్నాను.’

కీటో డైట్‌తో!

‘గతేడాది డిసెంబర్‌లో నా భర్త గుండె సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. అప్పుడు ఒత్తిడి, ఇతర సమస్యలతో కీటో డైట్‌ను దూరం పెట్టాను. అది ఎంత తప్పో వెంటనే తెలిసొచ్చింది. ఉన్నదాని కంటే మళ్లీ 6 కిలోల బరువు పెరిగాను. కానీ దాన్ని ఎలా తగ్గించుకోవాలో అప్పటికే నాకు అర్థమైంది. ‘కొవ్వులు ఎక్కువగా ఉన్నా ఫిట్‌గా మారడానికి కీటో డైట్‌ ఉత్తమ మార్గమని నేను భావిస్తాను. నేను పెరుగు, అవకాడోలను ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గాను.’

మరో 10 కిలోలు తగ్గాలనుకుంటున్నా!

‘డైట్‌, ఫిట్‌నెస్‌ విషయంలో మనం చేసే తప్పులను అప్పుడప్పుడు మన శరీరమే మనకు తెలియజేస్తుంది. కఠినమైన ఉపవాసం పాటించడం వల్ల కొన్నిసార్లు నాకు వర్టిగో (తల గిర్రున తిరగడం) సమస్య తలెత్తింది. దీంతో అప్పుటికప్పుడు నేను బ్రేక్‌ తీసుకున్నాను. వర్కవుట్లు చేస్తున్నప్పుడు శరీరం సహకరించకపోతే కూడా కాసేపు విరామం తీసుకుని మళ్లీ ప్రారంభించేదాన్ని. అలా మొత్తానికి రెండేళ్లలో 40 కిలోల బరువును కరిగించుకున్నాను. వచ్చే డిసెంబర్ నాటికి మరో 10 కిలోలు తగ్గేలా ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఇక నా వెయిట్‌ లాస్‌ జర్నీలో నా భర్త, ఇద్దరు పిల్లలకు కూడా ఎంతో ప్రాధాన్యముంది. వాళ్ల కారణంగానే నేను ఇలా నాజుగ్గా మారిపోయాను’ అంటోంది లిజెల్.

నువ్వు నాకంటే బలంగా ఉన్నావు!

బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోయిన లిజెల్‌పై ఆమె భర్త రెమో ప్రశంసల వర్షం కురిపించాడు. గతంలో, ప్రస్తుతం తనతో దిగిన రెండు ఫొటోలను కొలేజ్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆయన ..‘ఈ స్థితికి చేరుకోవడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. నీ శక్తి సామర్థ్యాల గురించి నాకు ముందే తెలుసు. నిన్ను చూసి గర్వపడుతున్నాను. నువ్వు నాకంటే బలంగా ఉన్నావు. నువ్వే నాకు స్ఫూర్తి’ అని సతీమణిపై ప్రేమ కురిపించాడు రెమో.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని