Published : 30/08/2021 15:13 IST

అంతటా గోవిందుడే!

'జై శ్రీకృష్ణ', 'రాధే కృష్ణ', 'రాధే రాధే'.. ఉత్తరాదిన ఎవరు కనిపించినా.. ఒకరినొకరు ఇలా పలకరించుకోవడం సంప్రదాయం. సత్య, త్రేతా, ద్వాపర యుగాల్లోనే కాకుండా కలియుగంలోనూ తన లీలామృతంతో భక్తుల కోరికలు తీర్చే అందమైన దేవుడిగా మాధవుడు అశేష నీరాజనాలందుకుంటున్నాడు. యశోదకు ముద్దుల కొడుకుగా, రేపల్లె వాసులకు వెన్నదొంగగా, గోపికల మనసు దోచుకున్న మురళీధరుడిగా.. రాధకు ప్రేమికుడిగా, ప్రపంచానికి గీతాసారాన్ని బోధించిన గురువుగా.. ఇలా ఎన్నో రూపాల్లో దర్శనమిచ్చిన ఆ మువ్వగోపాలుడి పుట్టినరోజు సందర్భంగా దేశమంతా కొలువై ఉన్న శ్రీకృష్ణ మందిరాలపై ప్రత్యేక కథనం మీకోసం...


ప్రేమ మందిర్, ఉత్తరప్రదేశ్

వెయ్యిమంది కళాకారులు, శిల్పకారుల అద్భుత కళకు నిదర్శనంగా, పదకొండేళ్ల నిర్విరామ కృషికి ఫలితంగా ఉత్తరప్రదేశ్ మధుర జిల్లాలోని బృందావనం పట్టణంలో రాధా సమేతంగా కొలువై ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఆయన జన్మస్థలమైన బృందావనంలో జనవరి 14, 2001న జగద్గురు శ్రీ కృపాలుజీ మహరాజ్ శంకుస్థాపన చేసిన ఈ ఆలయ కట్టడం 2012లో ముగిసింది. రూ.150 కోట్ల వ్యయంతో 30వేల టన్నుల ఇటాలియన్ పాలరాతిని దిగుమతి చేసుకొని ఈ మందిరాన్ని నిర్మించారు. సుమారు 54 ఎకరాల్లో కట్టిన ఈ ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్థానికంగా ఉండే ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి మధురకు వచ్చే భక్తులు ఇక్కడి కృష్ణున్ని తప్పకుండా దర్శించుకుంటారు. మందిరంలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ పర్యటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. గుడి పక్కనే నిర్మించిన సత్సంగ్ హాల్ ఒకేసారి 25వేల మంది కూర్చునేందుకు వీలుగా ఉంటుందంటే ఆలయ ప్రాంగణం ఎంత విశాలమైనదో అర్థం చేసుకోవచ్చు. రాధాకృష్ణులతో పాటు సీతారాములు సైతం కొలువై ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించినవారు అక్కడి దేవతామూర్తుల అందమైన రూపాల గురించి, ఆలయ నిర్మాణ శైలి గురించి అమితాసక్తితో చర్చించుకుంటారు.


ద్వారకాధీశ్ ఆలయం, గుజరాత్

గోమతి నదీ తీరంలో సుమారు 2,500 ఏళ్ల క్రితం నిర్మించి ఉండవచ్చని భావిస్తున్నా.. ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో భక్తులకు మాధవుడి దర్శన భాగ్యం కల్పిస్తోంది ద్వారకాధీశ్ ఆలయం. దీనికి 'జగత్ మందిర్' అనే పేరు కూడా ఉంది. చార్‌ధామ్ యాత్రలో భాగంగా భక్తులు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. 60 స్తంభాలపై ఐదంతస్తుల్లో నిర్మించిన ఈ గుడి గోపురం భూమికి దాదాపు 78 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానిపై సూర్యచంద్రుల చిహ్నంతో రెపరెపలాడుతుండే పతాకం గర్భగుడికి ప్రత్యేక ఆకర్షణ. ఆలయానికి రెండు ముఖ్య ద్వారాలుంటాయి. ఉత్తరాన ఉండే 'మోక్ష ద్వారం' నుంచి భక్తులు ఆలయం లోపలకు ప్రవేశించి దర్శనం తర్వాత దక్షిణం వైపున్న 'స్వర్గ ద్వారం' నుంచి బయటకువస్తారు. గుడి బయట అందుబాటులో ఉండే కాషాయ రంగు జెండాలను పట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత దర్శనం చేసుకుంటే ఆ ద్వారకాధీశుడు కోరుకున్న వరాలిస్తాడని భక్తుల నమ్మకం.


గురువాయూర్ కృష్ణమందిరం, కేరళ

సుమారు ఐదువేల సంవత్సరాల చరిత్ర ఉన్న గురువాయూర్ ఆలయంలో కృష్ణుడు విష్ణురూపంలో దర్శనమిస్తాడు. ఒక వారంలో ద్వారక నగరం సముద్రగర్భంలో మునిగిపోతుందని తన స్నేహితుడైన ఉద్ధవుడికి చెప్పిన శ్రీకృష్ణుడు, సత్య యుగం నుంచి తాను పూజించే విష్ణు విగ్రహాన్ని బృహస్పతి, వాయుదేవుడికి అందజేయాలని ఆదేశించాడు. విగ్రహాన్ని అందుకున్న బృహస్పతి, వాయుదేవుళ్లు దాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలని ఆలోచిస్తుండగా, శివుడు విష్ణుమూర్తిని కొలిచే ఓ అందమైన అడవీ ప్రాంతం కనిపించింది. దాన్నే అనువైన ప్రదేశంగా భావించి, విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు గుడిని నిర్మించారు. ఇలా గురువు(బృహస్పతి), వాయువు కలిసి చేపట్టిన నిర్మాణం కాబట్టి దీనికి గురువాయూర్ ఆలయం అనే పేరు వచ్చింది. ఈ మందిరాన్ని 'భూలోక వైకుంఠం, దక్షిణ భారత ద్వారక' అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇక్కడి కృష్ణుడు నాలుగు చేతుల్లో శంఖు, చక్ర, గదా పద్మాలతో భక్తులకు దర్శనమిస్తాడు.


ఉడిపి శ్రీకృష్ణమఠ్, కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పట్టణంలో నెలకొన్న గోపాలుడి ఆలయాన్ని దాదాపు వెయ్యేళ్ల క్రితం నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. ఈ గుడి ఆ రాష్ట్రంలోని ప్రసిద్ధ కృష్ణ మందిరాల్లో కీలకమైనది. ద్వాపర యుగంలో మాధవుడి గుడి సముద్రంలో మునిగిపోయే సమయంలో.. గర్భగుడిలోని దేవుని విగ్రహం అక్కడ ఉన్న గంధంలో పడిపోయిందట. అలా గంధమయమైన విగ్రహాన్ని ఒక నావికుడు తన నావలో ఎక్కించుకొని, ప్రయాణం చేస్తుండగా తుపాను ధాటికి నావ అదుపు తప్పసాగింది. తపస్సులో ఉండి ఇదంతా తన మనోనేత్రంతో పరిశీలిస్తున్న మాధవాచార్య అనే మహర్షి తుపాను ప్రభావాన్ని తగ్గించి, నావికుడు క్షేమంగా ఒడ్డుకు చేరేలా సహకరించాడు. తనకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఏం కావాలని నావికుడు మహర్షిని అడగ్గా.. గంధభరితమైన కృష్ణ విగ్రహాన్ని తనకు ఇమ్మని కోరాడు. ఆ ప్రతిమనే మాధవాచార్యుడు ఇక్కడ స్థాపించాడనే కథ ప్రచారంలో ఉంది.


పూరీ జగన్నాథ్, ఒడిశా

ప్రపంచంలోనే అధిక భక్తసంచారం గల ఆలయాల్లో పూరీజగన్నాథ్ మందిరం ఒకటి. గర్భగుడిలో ప్రతిష్ఠించిన జగన్నాథ్, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు సంబంధించి చారిత్రకపరంగా ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా.. ఇంద్రద్యుమ్న అనే రాజు నరసింహస్వామి ఆలయం వద్ద నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి, సముద్ర తీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకు వస్తాయని, వాటితో విగ్రహాలు తయారుచేయించి తనను పూజించమని చెబుతాడు. రాజు నిద్ర లేవగానే కొయ్యలైతే కనిపిస్తాయి కానీ, వాటిని విగ్రహాల రూపంలో మలిచేందుకు శిల్పి దొరకడు. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చి విగ్రహాలను తాను తయారుచేస్తానని రాజుకు చెబుతాడు. అది విని సంతోషించిన రాజు శిల్పిని రాజ్యానికి తీసుకెళతాడు. అయితే తాను 21 రోజుల వరకు గది నుంచి బయటకు రాననీ, ఈలోపు మధ్యలో ఎవరూ తనను కలవొద్దని శిల్పి షరతు విధిస్తాడు. రాజు సరేనని ఒప్పుకున్నా, శిల్పి ఏం చేస్తున్నాడా అన్న ఆసక్తి మేరకు రాజు భార్య, భర్తను లోపలికి వెళ్లి చూడమని పదేపదే కోరుతుంది. దీంతో రాజు గది లోపలకు ప్రవేశిస్తాడు. అక్కడ శిల్పి వెంటనే మాయమై సగం చెక్కిన దేవతా విగ్రహాలు మాత్రం మిగిలిపోతాయి. పశ్చాత్తాపానికి గురైన రాజు, బ్రహ్మదేవుని ప్రార్థించగా, ఆ విగ్రహాలు అదేవిధంగా పూజలందుకుంటాయని వరం ఇస్తాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు పూరీలో సగం చెక్కిన విగ్రహాలను పూజించడమే సంప్రదాయంగా వస్తోంది. విగ్రహాలు కూడా పూర్తిగా చెక్కతో తయారుచేసినవే. సుమారు 4లక్షల 20వేల చదరపు అడుగుల్లో నిర్మించిన ఆలయ ప్రాంగణంలో 120 చిన్న చిన్న మందిరాలున్నాయి. ఇక్కడి వంటశాల దేశంలోనే పెద్దదని చెబుతారు. ఏటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు.


గోవింద్‌జీ ఆలయం, జైపూర్

శ్రీకృష్ణుడు, భూమిపై తన అవతారం చాలించే సమయంలో ఎలా దర్శనమిచ్చాడో, గోవింద్‌జీ ఆలయంలోని మాధవుడి విగ్రహం కూడా అచ్చం అలాగే ఉంటుందని చెబుతారు చరిత్రకారులు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక రోజుల్లో భక్తులు వేల సంఖ్యలో వస్తారు. కృష్ణుడి మునిమనవడైన వజ్రనాభుడు ఒక రోజు తన నాయనమ్మ ఒడిలో కూర్చొని, శ్రీకృష్ణుడి రూపం ఎలా ఉండేదని అడిగితే ఆమె వివరించిందట. దాని ప్రకారం మనసులో గీసుకున్న వూహాచిత్రాన్ని పటం రూపంలో తయారుచేసి, నాయనమ్మకు చూపిస్తే, ఆమె దాన్ని చూసి, ఆ చిత్రంలో కేవలం పాదాలు మాత్రమే కృష్ణుడిలా ఉన్నాయని చెప్పింది. రెండో చిత్రాన్ని తయారుచేసి మళ్లీ ఆమెకు చూపగా, ఈసారి ఛాతీభాగం బాగా కుదిరిందని చెప్పిందట. అతి జాగ్రత్తగా, శ్రద్ధతో ముచ్చటగా మూడోసారి మనవడు రూపొందించిన చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపడిన వజ్రనాభుడి నాయనమ్మ మూడు పటాలకు వరుసగా మదన్‌మోహన్‌జీ, గోపీనాథ్‌జీ, గోవింద్ దేవ్‌జీ అని పేర్లు పెట్టిందట. మూడో చిత్రమైన గోవింద్ దేవ్‌జీ రూపమే ఇక్కడి మురళీధరుడిగా భక్తులకు దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని సవాయ్ జల్‌సింగ్ అనే రాజు నిర్మించాడని ఆధారాలున్నాయి.

ఇవేకాకుండా జుగల్‌కిషోర్ ఆలయం, నికుంజవనం, మదనమోహన మందిరం, బంకీ బిహారీ ఆలయం, రంగ్‌జీ, రాధారమణ్ మందిరాలతో పాటు దేశవ్యాప్తంగా కృష్ణుడికి ప్రత్యేకంగా అందమైన ఇస్కాన్ టెంపుల్స్ అనేకం ఉన్నాయి. కేవలం మధురలోనే 5వేల ఆలయాలున్నాయంటే, ఉత్తర భారతంలో ఈ నందలాలుడి ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి