ఆ లెక్చరర్ అంటే చాలా ఇష్టం.. ఎప్పుడూ అతని ఆలోచనలే..!

నేను బీటెక్ చదువుతున్నాను. మా లెక్చరర్లలో ఒకతనంటే నాకు చాలా ఇష్టం. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే అతనిపై తెలియకుండానే ఇష్టం పెరిగింది. అతను వయసులో నాకంటే పదేళ్లు పెద్దవాడు. అతనిపై ఉన్న ఇష్టంతో అతని సోషల్‌ మీడియా పేజీలను తరచుగా చూస్తుంటాను.

Published : 01 Jun 2024 15:18 IST

(Representational Image)

నేను బీటెక్ చదువుతున్నాను. మా లెక్చరర్లలో ఒకతనంటే నాకు చాలా ఇష్టం. కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే అతనిపై తెలియకుండానే ఇష్టం పెరిగింది. అతను వయసులో నాకంటే పదేళ్లు పెద్దవాడు. అతనిపై ఉన్న ఇష్టంతో అతని సోషల్‌ మీడియా పేజీలను తరచుగా చూస్తుంటాను. అతని గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాను. దీనివల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నా. తరగతి గదిలో అతనినే ఎక్కువగా చూస్తుండడంతో అతను కూడా అసౌకర్యానికి లోనవుతున్నాడు. నన్ను నేను నియంత్రించుకుని చదువుపై దృష్టి కేంద్రీకరించాలంటే ఏం చేయాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. చదువుకునే వయసులో ఇలాంటి భావనలు కలగడం సహజం. అయితే ఈ ఫీలింగ్స్‌ తాత్కాలికమేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. అలాగే మీరు ఇష్టపడుతున్న వ్యక్తి మీకు గురువు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఒక విద్యార్థినిగా అతని స్థానానికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది.

తరగతి గదిలో మీ చర్యల వల్ల అవతలి వ్యక్తి అసౌకర్యానికి లోనవుతున్నాడని మీరే చెబుతున్నారు. దీని ప్రభావం కేవలం ఒక వ్యక్తి పైనే కాకుండా మొత్తం తరగతి గదిపై కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం ఎంతో అవసరం. ఇలాంటి భావనలు కలిగినప్పుడు ‘అతను నా గురువు.. కేవలం చదువుకోవడం కోసం మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను.. నేను ఇలా ఆలోచించడం తప్పు..’ అనే విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి.

ఈ వయసులో ఎదుటి వ్యక్తిపై ఉండే ఆకర్షణతో ఇలా చేస్తుంటారు. దానినే నిజమైన ప్రేమగా భావిస్తారు. అయితే ఒక వ్యక్తిపై ఆకర్షణ మాత్రమే ఉంటే కొంతకాలం తర్వాత ఆ భావన పోతుంది. కాబట్టి, మీరు కూడా కొంతకాలం వేచి చూడండి. ఒకవేళ ఆ వ్యక్తిపై ఉన్నది నిజమైన ప్రేమ అయితే మీ ప్రాధాన్యాలను ఒక్కసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేయండి.

మీరు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. కెరీర్‌లో ముందుకెళ్లాలంటే తోటి విద్యార్థులతో పోటీపడాల్సి ఉంటుంది. కాబట్టి, అతనిపై ఉన్న ఆలోచనలు పక్కనపెట్టి చదువుకు ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇందులో భాగంగా చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకోండి. అలాగే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి. ఫలితంగా మీ ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ అతని ఆలోచనలు ఇంకా ప్రభావితం చేస్తున్నాయనిపిస్తే కొన్ని రోజులు సెలవు తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్లండి. తప్పకుండా ఆశించిన ఫలితం లభిస్తుంది. ఏది ఏమైనా ప్రేమ, పెళ్లి.. అనే విషయాలు చదువు తర్వాతే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్