Mahasweta Ghosh: ‘సహారా ఎడారి’లోనూ పరుగాపలేదు!

బరువు తగ్గాలని పరుగును ఎంచుకునే వారు చాలామంది ఉంటారు. కానీ అదే పరుగును ప్రవృత్తిగా మార్చుకునే వారు అరుదుగా కనిపిస్తుంటారు. గురుగ్రామ్‌కు చెందిన మహాశ్వేత ఘోష్‌ కూడా అదే కోవకు చెందుతారు. అధిక బరువును తగ్గించుకొని ఫిట్‌నెస్‌ సాధించాలని...

Updated : 10 Jun 2023 12:42 IST

(Photos: Instagram)

బరువు తగ్గాలని పరుగును ఎంచుకునే వారు చాలామంది ఉంటారు. కానీ అదే పరుగును ప్రవృత్తిగా మార్చుకునే వారు అరుదుగా కనిపిస్తుంటారు. గురుగ్రామ్‌కు చెందిన మహాశ్వేత ఘోష్‌ కూడా అదే కోవకు చెందుతారు. అధిక బరువును తగ్గించుకొని ఫిట్‌నెస్‌ సాధించాలని ఆమె మొదలుపెట్టిన పరుగు.. నేటికీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. మారథాన్లు, అల్ట్రామారథాన్లు, ట్రయల్‌ రన్స్‌.. అంటూ జాతీయంగా, అంతర్జాతీయంగా ఆమె పాల్గొనని పరుగు పందెం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరుగు పందెమైన Marathon Des Sablesనూ ఇటీవలే విజయవంతంగా పూర్తిచేసింది మహాశ్వేత. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్రకెక్కింది. ‘పరుగుతో ఆరోగ్యమే కాదు.. అరుదైన రికార్డులూ సృష్టించచ్చ’ని తన విజయాలతో నిరూపిస్తోన్న ఈ గురుగ్రామ్‌ రన్నర్‌.. పరుగుల జర్నీ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం!

గురుగ్రామ్‌కు చెందిన 44 ఏళ్ల మహాశ్వేత ఘోష్‌ ప్రస్తుతం ఓ సంస్థలో టెక్‌ మార్కెటింగ్‌ ఉద్యోగం చేస్తోంది. అయితే యుక్త వయసులో అధిక బరువుండే ఆమె.. తన శరీరాకృతి కారణంగా పలు విమర్శలూ ఎదుర్కొంది. ఒకానొక సమయంలో వెన్నెముక గాయం వల్ల సర్జరీ కూడా చేయించుకుంది. ఇలా ఈ సమస్యల నుంచి బయటపడి పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా మారాలని నిర్ణయించుకుందామె. అయితే అదే సమయంలో అధిక బరువును తగ్గించుకోవడానికి పరుగును వ్యాయామంగా ఎంచుకున్న తన స్నేహితురాలి స్ఫూర్తితో మహాశ్వేత కూడా పరుగును తన జీవనశైలిలో భాగం చేసుకుంది.

తపనే ప్రవృత్తిగా మారిన వేళ..!

అలా 2012 నుంచి పరుగును వ్యాయామంగా ఎంచుకున్న మహాశ్వేత.. క్రమంగా బరువు తగ్గుతూ వచ్చింది. ఇలా ఆశించిన ఫలితం దక్కడంతో దానిపై ఆసక్తిని పెంచుకుంది. ఇదే క్రమంగా తనను జాతీయ, అంతర్జాతీయంగా 50కి పైగా పరుగు పందేల్లో పాల్గొనేలా చేసిందని చెబుతోందామె.

‘పరుగు లేనిదే నా జీవితం లేదు అన్నంతగా ఇది నా జీవితంలో అంతర్భాగమైంది. ఇప్పటివరకు జాతీయంగా, అంతర్జాతీయంగా 60 కి పైగా పరుగు పందేల్లో పాల్గొన్నా. వీటిలో మారథాన్లు, అల్ట్రామారథాన్లు, ట్రయల్‌ రన్స్‌, 3 ప్రపంచ మారథాన్‌ మేజర్లు.. వంటి ప్రతిష్టాత్మక పరుగు పందేలూ ఉన్నాయి. ఇక కరోనా సమయంలోనూ రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో.. ఎడారిలో 75 కిలోమీటర్లు, ఒంటరిగా 100 కిలోమీటర్లు పరిగెత్తా. తొలుత ఆగకుండా వంద కిలోమీటర్లు పరుగెత్తేలా శిక్షణ తీసుకున్నా. ఆపై నా సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు.. రోజూ బహుళ సంఖ్యలో లాంగ్‌ రన్స్‌ సాధన చేశాను. ఇప్పటికీ నా వర్కవుట్‌ రొటీన్‌లో పరుగుతో పాటు స్ట్రెంత్‌ ట్రైనింగ్‌, ఫ్లెక్సిబిలిటీని పెంచే మొబిలిటీ వ్యాయామాలు తప్పనిసరిగా భాగం చేసుకుంటా..’ అంటూ చెప్పుకొచ్చారీ పరుగుల రాణి.

ఆ సిరీస్‌తో స్ఫూర్తి పొంది..!

అయితే ఇలా పరుగే తన ఆరోప్రాణంగా మార్చుకున్న మహాశ్వేత.. ఓసారి టీవీలో Losers అనే నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ చూసింది. ఇసుక నేలపై పరుగు పందెం నేపథ్యంలో సాగే ఈ సాహసోపేతమైన గేమ్‌ ఆమెలో ఆసక్తిని పెంచింది. ఇక దీని గురించి మరిన్ని విషయాలు శోధించే క్రమంలో సహారా ఎడారిలో నిర్వహించే Marathon Des Sables పరుగు పందెం గురించి తెలుసుకుందామె.

‘2019లో నా స్నేహితురాలి ద్వారా ఈ రేస్‌కు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకున్నా. రోజుల తరబడి ఎడారిలోనే ఉంటూ.. అక్కడి ఇసుక తిన్నెలపై జరిగే ఈ పందెం నాలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇదివరకు ఎన్నో పరుగు పందేల్లో పాల్గొన్నా.. కానీ ఇలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. ఇప్పుడు చేయాలనిపించింది..’ అంటూ చెప్పుకొచ్చిందామె.

ఇసుక తుపాన్లను ఎదుర్కొని..!

సహారా ఎడారిలో ఏడు రోజుల పాటు జరిగే ఈ పరుగు పందేన్ని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన రేస్‌గా పిలుస్తారు. ఇందులో పాల్గొనే ఔత్సాహికులు 250 కిలోమీటర్ల సుదీర్ఘ అల్ట్రామారథాన్‌లో భాగమవ్వాల్సి ఉంటుంది. ఈ దూరాన్ని ఆరు రోజుల పాటు సాధారణ మారథాన్లుగా విభజించి నిర్వహిస్తారు. సాధారణంగా ఎడారి అంటేనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంటుంది. అలాంటి సహారా ఎడారిలో, రాళ్లు-రప్పలతో కూడిన కొండల్ని దాటుతూ, ఇసుక తుపాన్లను ఎదుర్కొంటూ, ఇసుక తిన్నెలపై పరుగు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ ఏడు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు/సామగ్రిని స్వయంగా రన్నర్స్‌ తమ ఇంటి నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఇటీవలే నిర్వహించిన ఈ పరుగు పందెంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది రన్నర్స్‌ పాల్గొన్నారు. ఇక మన దేశం తరపున ఇందులో పాల్గొన్న మహాశ్వేత.. ప్రతికూల పరిస్థితులన్నీ దాటుకుంటూ విజయవంతంగా పరుగు పూర్తిచేసింది. తద్వారా ‘ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరుగు పందేన్ని పూర్తిచేసిన తొలి భారతీయురాలి’గా చరిత్రకెక్కింది.

ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తా!

ఏ పరుగు పందేన్నైనా ఉత్సాహంగా పూర్తిచేయగల సత్తా సాధించిన మహాశ్వేత.. ఇందుకు తాను పాటించే ఆహార, వ్యాయామ నియమాలే కారణమంటోంది. ‘పరుగుతో బరువు తగ్గడం, ఆరోగ్యంగా మారడమే కాదు.. అరుదైన రికార్డులూ సృష్టించచ్చు. అయితే నా ఈ పట్టుదల వెనుక నేను తీసుకునే ఆహారం కూడా ఓ కారణమే! ఎక్కువగా ఇంటి ఆహారానికే ప్రాధాన్యమిస్తాను. పరిశుభ్రంగా, తాజాగా వండిన ఆహార పదార్థాలు తీసుకుంటా. రోజుకు 1200లకు మించి క్యాలరీలు తీసుకోను. అలాగే గ్లూటెన్‌ రహిత పదార్థాల్ని నా మెనూలో భాగం చేసుకుంటా. ఎప్పట్నుంచో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తున్నా. ఇదే నన్ను అలసిపోకుండా కాపాడుతుంటుంది. అలాగే పరుగు పందెం పూర్తైన ప్రతిసారీ ఫోమ్‌ రోలింగ్‌/బ్యాండ్‌ వ్యాయామాలతో రిలాక్సవుతా. చన్నీటి స్నానం చేస్తా..’ అంటూ తన ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌ని పంచుకున్న మహాశ్వేత.. తన తదుపరి లక్ష్యం బెర్లిన్‌ మారథాన్‌లో పాల్గొనడమే అంటోంది. ప్రస్తుతం 44 ఏళ్లున్న ఆమె.. వయసుకు, మన మనసులోని తపనకు సంబంధం లేదంటోంది. పట్టుదలతో కృషి చేస్తే మహిళలూ అనుకున్నది సాధించగల సమర్థులు అంటూ తన విజయాలతోనే నిరూపిస్తోందీ మారథాన్‌ క్వీన్.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని