ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌కి దారి చూపిస్తోంది!

పెళ్లి, పిల్లలు, పెద్ద వాళ్ల బాధ్యత.. ఇలా కారణమేదైనా మహిళల కెరీర్‌కు పలుమార్లు బ్రేక్‌ పడుతుంటుంది. బాధ్యతలన్నీ చక్కదిద్దుకొని తిరిగి వృత్తిలోకి రావాలనుకున్నప్పుడే అసలు సవాలు మొదలువుతుంది. అవకాశాలివ్వక, నైపుణ్యాల్ని పెంచుకునే దారి లేక, ఇంటా-బయటా ప్రోత్సాహం అందక.. ఎంతోమంది మహిళలు ఇష్టం లేకపోయినా తమ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వస్తోంది.

Published : 04 Sep 2023 19:08 IST

(Photos: Facebook)

పెళ్లి, పిల్లలు, పెద్ద వాళ్ల బాధ్యత.. ఇలా కారణమేదైనా మహిళల కెరీర్‌కు పలుమార్లు బ్రేక్‌ పడుతుంటుంది. బాధ్యతలన్నీ చక్కదిద్దుకొని తిరిగి వృత్తిలోకి రావాలనుకున్నప్పుడే అసలు సవాలు మొదలువుతుంది. అవకాశాలివ్వక, నైపుణ్యాల్ని పెంచుకునే దారి లేక, ఇంటా-బయటా ప్రోత్సాహం అందక.. ఎంతోమంది మహిళలు ఇష్టం లేకపోయినా తమ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సి వస్తోంది. భారత ఆర్థిక సర్వే కూడా ఇదే విషయం చెబుతోంది. గత దశాబ్దంతో పోల్చితే ఈ దశాబ్దం మహిళా కార్మిక శక్తి భాగస్వామ్య (FLEP) రేటు 36 శాతం నుంచి 24 శాతానికి తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సమీకరణాన్ని మార్చాలనుకుంది బెంగళూరుకు చెందిన మంజుల ధర్మలింగం. వృత్తిరీత్యా ఐటీ ఉద్యోగి అయిన ఆమెకు మహిళల్ని ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దడమంటే మక్కువ. ఈ ఇష్టంతోనే కెరీర్‌ బ్రేక్‌ తీసుకున్న మహిళల్ని.. తిరిగి ఉద్యోగంలో చేరేలా ప్రోత్సహించాలనుకుందామె. ఈ క్రమంలోనే ఓ సంస్థను స్థాపించిన మంజుల.. ఈ వేదికగా వేలాది మంది మహిళలు తిరిగి కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు దారి చూపిస్తోంది. మహిళా కార్మిక శక్తి పురుషులతో సమానంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధి సాధ్యమంటోన్న ఆమె.. మహిళల్ని కెరీర్‌ దిశగా ఎలా ప్రోత్సహిస్తోందో తెలుసుకుందాం రండి..

ఐటీ నేపథ్యమున్న మంజుల రెండు దశాబ్దాలకు పైగా సాంకేతిక రంగంలో వివిధ విభాగాల్లో పనిచేసింది. తన సుదీర్ఘ కెరీర్‌లో భాగంగా.. టెక్నాలజీ, వ్యాపారం, ట్రైనింగ్‌, మానవ అభివృద్ధి.. వంటి అంశాలపై పట్టు పెంచుకుంది. మహిళల్ని, అమ్మాయిల్ని ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దడమంటే మంజులకు ముందు నుంచే ఇష్టం. ఈ మక్కువతోనే అటు ఉద్యోగం చేస్తూనే.. ఇటు వందలాది మంది మహిళలు కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు ప్రేరేపించిందామె.

వాళ్ల పరిస్థితి చూశాక..!

అయితే ఇలా తాను పని చేసే చోట తోటి మహిళా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తోన్న క్రమంలోనే.. మరికొంతమంది మహిళలు పలు కారణాల రీత్యా కెరీర్‌ నుంచి విరామం తీసుకోవడం, తిరిగి ఉద్యోగంలో చేరడానికి పలు ఇబ్బందులు ఎదుర్కోవడం.. వంటివన్నీ గమనించింది మంజుల. అప్పటికే మహిళల్ని ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దిన అనుభవం ఉన్న ఆమె.. ఇలాంటి మహిళలకు చేయూతనందించాలనుకుంది. తద్వారా మహిళా శ్రామిక శక్తిని పెంచాలనుకుంది. ఈ ఆలోచనతోనే కొన్నేళ్ల క్రితం ‘హర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించిందామె. కెరీర్‌ నుంచి విరామం తీసుకున్న మహిళలకు తగిన నైపుణ్యాలు నేర్పించి.. ఉద్యోగావకాశాలు చూపించడమే ఈ వేదిక ముఖ్యోద్దేశం.

‘అమ్మాయిలు పెళ్లికి ముందు ఎంత స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతారో.. పెళ్లయ్యాక కొందరి పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. పిల్లల బాధ్యత, పెద్ద వాళ్లను చూసుకోవడం, లేదంటే భర్త ఉద్యోగ రీత్యా వేరే ప్రదేశానికి బదిలీ కావడం.. ఇలాంటి కారణాల వల్ల మహిళలు తమ కెరీర్‌కు కొన్నేళ్ల పాటు విరామమివ్వాల్సి వస్తోంది. సరే.. బ్రేక్‌ తీసుకున్నాం.. బాధ్యతలన్నీ తీరాయి.. తిరిగి పనిలోకి వద్దామనుకుంటే.. కంపెనీలు వారిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండట్లేదు.. నైపుణ్యాలు లేవనో, కెరీర్‌ బ్రేక్‌ వచ్చింది.. పనితనం తగ్గిపోతుందనో.. ఇలాంటి కారణాల వల్ల వాళ్లను ఇంటికే పరిమితం చేస్తున్నాయి. అందుకే ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేలా మహిళల్ని సిద్ధం చేసి.. కెరీర్‌ పరంగా వారు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించేలా ప్రోత్సహించడానికే సంస్థను ప్రారంభించా..’ అంటున్నారు మంజుల.

‘ఏఐ’తో నైపుణ్యాలు..!

కెరీర్‌ విరామం తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలనుకున్న మహిళలకు ముందు వారికి ఆసక్తి ఉన్న రంగాలు, పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు మంజుల. ఆపై కార్పొరేట్‌ నిపుణులతో ప్రత్యేక సెషన్స్‌ ఏర్పాటుచేయడం, ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించడం, కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ సహాయంతో మహిళల్లో నైపుణ్యాలు పెంపొందించడం.. వంటివి చేస్తున్నారు.

‘నైపుణ్యాల్ని పెంపొందించుకోవడానికి కార్పొరేట్‌ సెషన్స్‌, ఆన్‌లైన్‌ తరగతులు.. వంటివి చాలామంది మహిళలకు కొత్త కాకపోవచ్చు.. కానీ మేం అందించే ఏఐ టూల్స్‌ సదుపాయం మాత్రం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాలనుకునే మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ తరహా టూల్స్‌ మహిళలు ఎక్కడ వెనకబడ్డారో గుర్తించేందుకు ఉపయోగపడతాయి.. ఈ క్రమంలో కంప్యూటర్‌ అడిగే ప్రశ్నలకు మహిళలు చెప్పే సమాధానాల్ని రికార్డ్‌ చేసి, వాళ్ల ముఖకవళికల్ని పరిగణనలోకి తీసుకొని.. వాళ్లు ఏ అంశంలో వెనకబడ్డారో, ఎలాంటి నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలో కృత్రిమ మేధ వారికి సూచిస్తుంది. ఫలితంగా సులభంగా, తక్కువ కాలంలో తమ నైపుణ్యాల్ని పెంపొందించుకోగలుగుతారు..’ అంటూ తమ సంస్థ అందిస్తోన్న సదుపాయాల గురించి చెప్పుకొచ్చారు మంజుల.

ఇంటా-బయటా ప్రోత్సాహం!

కెరీర్‌ బ్రేక్‌ తర్వాత తిరిగి ఉద్యోగం చేయాలనుకునే మహిళలకు నైపుణ్యాలు నేర్పించడంతో పాటు.. వారికి సౌకర్యవంతంగా ఉండేలా ఇంటి నుంచి పని చేసే వెసులుబాటు కల్పించే సంస్థలకు సంబంధించిన సమాచారాన్నీ అందిస్తోందీ సంస్థ. ‘జావా రిటర్న్‌షిప్‌’, ‘రెడ్‌హ్యాట్‌ ట్రైనింగ్‌’, ‘ఐటీ రీఫ్రెషర్‌’, ‘పైథాన్‌ ట్రైనింగ్‌’తో పాటు ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌కు సంబంధించిన శిక్షణ కూడా అందిస్తోన్న ఈ వేదిక.. ఇప్పటివరకు వేలాది మంది మహిళలకు నైపుణ్యాలు నేర్పించి.. ఉద్యోగావకాశాలు చూపించింది. అక్కడితో వదిలేయకుండా అలాంటి విజయవంతమైన మహిళల కథల్నీ వెబ్‌సైట్‌/సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ తోటి మహిళల్లో స్ఫూర్తి నింపుతున్నారు మంజుల.

‘ఎలాంటి ప్రోత్సాహం లేకుండానే ఎదిగే మహిళలు కొందరుంటారు. అలాంటిది ఇంటా-బయటా, సమాజం నుంచి వారికి సరైన మద్దతు, ప్రోత్సాహం లభిస్తే వారు మరెన్నో అద్భుతాలు సృష్టించగలుగుతారు. వాళ్ల పిల్లలకు, తర్వాతి తరాల వారికీ స్ఫూర్తిగా నిలవగలుగుతారు. మహిళలకు కూడా పురుషులతో పాటుగా సమానమైన అవకాశాలు కల్పిస్తే.. దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది.. ఈ పురోగతి సాధించడానికే మా ఈ చిరు ప్రయత్నం!’ అంటున్నారీ బిజినెస్‌ ఉమన్.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని