Published : 01/10/2022 16:24 IST

ఈ కాఫీ స్క్రబ్‌తో ఆ సమస్యలు దూరం..!

ముఖం ఉబ్బినట్లుగా తయారవడం, చర్మం పొలుసులుగా ఊడిపోవడం.. వంటి సమస్యలతో చాలామంది సతమతమవుతుంటారు. అయితే అలాంటి సమస్యలకు ఈ కాఫీ స్క్రబ్/ఫేస్‌మాస్క్ చక్కటి పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు.

ఇందుకోసం కావాల్సినవి..

బరకగా దంచిన కాఫీ పొడి - 2 టీస్పూన్లు

బ్రౌన్‌ షుగర్‌ - ఒకటిన్నర స్పూన్లు

ఆలివ్‌ నూనె - టీస్పూన్

తేనె - టీస్పూన్

పాలు - టీస్పూన్

ఒక మిక్సింగ్‌ బౌల్‌ తీసుకొని అందులో అన్ని పదార్థాలు వేసి పేస్‌్ిలా కలుపుకోవాలి.   ఈ మిశ్రమాన్ని ముఖానికి గుండ్రంగా రుద్దుతూ అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై చల్లటి నీటితో కడిగేసుకోవాలి.
ఈ కాఫీ స్క్రబ్ ఉబ్బిన ముఖాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడంతో పాటు పొలుసులుగా ఊడిపోయే చర్మానికి చక్కటి పరిష్కారం చూపుతుంది. అలాగే ముఖాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చుతుంది.. ఈ కాఫీ స్క్రబ్‌ని బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగించచ్చు.. అంటున్నారు సౌందర్య నిపుణులు.

ప్రయోజనాలెన్నో!

ఈ ఫేస్‌మాస్క్‌ తయారుచేసుకోవడానికి ఎంతో సులభంగా ఉంది కదూ! అంతేకాదు.. ఇందులో వాడిన పదార్థాల్లో బోలెడన్ని సౌందర్య రహస్యాలు కూడా దాగున్నాయి.

కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాతావరణ కాలుష్య ప్రభావం చర్మంపై పడకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా నవయవ్వనంగా మెరిసిపోవచ్చు. అలాగే మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించే శక్తి కూడా కాఫీకి ఉంది.

బ్రౌన్‌ షుగర్‌ చర్మం పొలుసులుగా ఊడే సమస్యను తగ్గించి మృదువుగా, యవ్వనంగా మార్చుతుంది. అలాగే మృతకణాల్ని తొలగిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు, గ్లైకోలికామ్లం చర్మానికి మెరుపునందించడంలో సహకరిస్తాయి.

ఆలివ్‌ నూనె చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే ‘ఎ’, ‘డి’, ‘ఇ’, ‘కె’ విటమిన్లు చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. ఇక ఆలివ్‌ నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు వాతావరణంలోని బ్యాక్టీరియా ప్రభావం చర్మంపై పడకుండా రక్షిస్తాయి.

తేనెలోని యాంటీ మైక్రోబియల్‌ గుణాలు మొటిమల్ని తగ్గించడంలో సహకరిస్తాయి. అలాగే మృతకణాలు, ముఖంపై ముడతలు-గీతల్ని తగ్గించే శక్తి తేనె సొంతం.

పొడిబారిన చర్మానికి సాంత్వన చేకూర్చడంలో పాలది మొదటి స్థానం. ఇందుకు పాలలోని ‘ఎ’ విటమిన్‌ తోడ్పడుతుంది. ఇక ఇందులోని విటమిన్‌ ‘డి’ ముఖంపై ముడతలు-గీతల్ని తగ్గించడంతో పాటు చర్మం సాగే గుణాన్ని పెంచుతుంది.

గమనిక:
ఈ స్క్రబ్/ ఫేస్‌మాస్క్‌లో ఉన్నవన్నీ సహజమైన పదార్ధాలే అయినా ఇది కొంతమందికి పడకపోవచ్చు. ఈ క్రమంలో- దీనిని  ఉపయోగించేటప్పుడు ముందు ఓసారి ప్యాచ్ టెస్ట్ కింద అప్లై చేసి, చర్మానికి సంబంధించి ఎలాంటి తేడాలు లేవనుకున్న తర్వాతే దీనిని వాడడం కొనసాగించాలి. అలాగే వాడుతున్నప్పుడు ఏవైనా తేడాలు కనిపించినా వెంటనే ఆపేసి, నిపుణులను సంప్రదించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని