Published : 25/11/2022 20:01 IST

లెన్స్ పెట్టుకున్నప్పుడు మేకప్ ఎలా?

ఫ్యాషన్ పేరుతోనో.. లేక సౌందర్య సృహతోనో.. ఏదో ఒక కారణంతో కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం ఇప్పుడు కామనైపోయింది. మామూలుగానే మేకప్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేవాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అందుకే మేకప్ వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. మరి ఆ జాగ్రత్తలేంటో చూద్దాం రండి..

మేకప్ చేసుకోవడానికి ఉపయోగించే సామగ్రిని చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా కళ్ల మేకప్‌కు సంబంధించిన ఉత్పత్తులు సునిశితంగా పరిశీలించాకే ఎంపిక చేసుకోవాలి. కంటి వైద్యనిపుణులు ధృవీకరించిన ఉత్పత్తులు కూడా ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి వాడకం వల్ల కళ్లకు ఎలర్జీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అలాగే ఎలాంటి ఉత్పత్తులను ఎంచుకున్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే వాటి ప్రభావం లెన్స్ మీద, కళ్ల ఆరోగ్యం మీద పడే అవకాశం ఉంది.

ఎప్పుడు వేసుకోవాలి?

మనం ఉపయోగించే మేకప్ ఉత్పత్తులు పొరపాటున కంటికి తగిలినా దాని ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే వీలైనంత వరకు ప్రయాణ సమయాల్లో మేకప్‌కు దూరంగా ఉండాలి. లేదంటే ఉత్పత్తుల అవశేషాలు లెన్స్ మీద, కంటి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మేకప్ ఉత్పత్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. కంటి వైద్యనిపుణులు సూచించిన మేకప్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోవడం మంచిది. వాటి వాడకం వల్ల కళ్లకు ఎలర్జీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

ఎప్పుడు కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకోవాలన్నా ముందు చేతులు చాలా శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి. హెయిర్ డ్రయర్, స్ప్రేయర్, డియోడరెంట్.. మొదలైన వాటిని లెన్స్ పెట్టుకున్న తర్వాత వాడకపోవడం మంచిది. అలాగే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న తర్వాత మేకప్ వేసుకోవడం ప్రారంభించాలి. లేదంటే చేతుల మీద ఉండే మేకప్ అవశేషాలు లెన్స్‌కి, కంటి కార్నియాకు సమస్యలు తెచ్చిపెడతాయి.

ఈ విషయాల్లో జాగ్రత్త!

⚛ మీ మేకప్ ఉత్పత్తులను ఎవరితోనూ పంచుకోవద్దు. అలాగే వీలున్నంత వరకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేకప్ ఉత్పత్తులను మార్చుకుంటూ ఉండాలి. అంటే పాతవి పాడేసి, కొత్తవి కొనుక్కోవాలి.

⚛ మేకప్ వేసుకోవడానికి ఉపయోగించే సామగ్రి అంటే బ్రష్, స్పాంజ్.. ఇలాంటివన్నీ చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే ఇన్‌ఫెక్షన్స్ రావడానికి ఇవి కూడా కారణమవుతాయి.

⚛ కంటికి మేకప్ వేసుకునేటప్పుడు అంటే ఐ లైనర్ పెట్టుకునేటప్పుడు కంటి లోపలి భాగానికి తగలకుండా జాగ్రత్తపడాలి. అలాగే ఐ షాడో ఎంచుకునేటప్పుడు క్రీమ్, పౌడర్స్ కాకుండా వాటర్ బేస్డ్ కలర్స్ ఎంచుకోవాలి.

⚛ ఇక మస్కారా విషయానికొస్తే పౌడర్ బేస్డ్ మస్కారాలకు దూరంగా ఉండాలి. లేదంటే వాటి తునకలు లెన్స్‌పై పడి కళ్లు ఎర్రబడటం, ఎలర్జీలు రావడం జరగొచ్చు. అలాగే మస్కారా వేసుకునేటప్పుడు రెప్పలకు మరీ దగ్గర్నుంచి కాకుండా మధ్య నుంచి వేసుకోవాలి.

⚛ కాంటాక్ట్ లెన్స్‌లు వాడేవారు సాధ్యమైనంత వరకు కృత్రిమ ఐ లాషెస్‌కు దూరంగా ఉంటే మంచిది.

⚛ ముఖానికి మేకప్ చేసుకునేటప్పుడు పౌడర్ ఉత్పత్తులు ఏవైనా ఉపయోగించే సమయంలో కళ్లు మూసుకుని జాగ్రత్తగా వేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి.

ఇలా చేయకండి..

కళ్లు ఎర్రబడటం, నీళ్లు కారడం.. వంటి సమస్యలుంటే మేకప్‌కు దూరంగా ఉండటమే మంచిది. అలాగే ఒకవేళ మేకప్ వేసుకోవాల్సి వస్తే నూనె ఆధారిత ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. మేకప్ వేసుకునేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తారో, తీసే సమయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లెన్స్‌లను కూడా వాటి సమయ పరిధి బట్టి ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. పెట్టుకున్నంత కాలం వాటిని జాగ్రత్తగా, శుభ్రంగా భద్రపరుచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని