పాలంటే ఇష్టం లేదా.. అయితే ఈ ఓట్ మిల్క్‌ ట్రై చేయండి!

‘సంపూర్ణ ఆహారం’ అని పేరున్నప్పటికీ చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. కడుపులో తిప్పడం, ఇబ్బందిగా అనిపించడం, వికారంగా అనిపించడం, రుచి బాగోలేకపోవడం... ఇలా రకరకాల కారణాలతో పాలను పక్కన పెడుతుంటారు. ఇక వీగన్లుగా మారిన వారు కూడా పాలను...

Updated : 28 Jul 2022 21:53 IST

‘సంపూర్ణ ఆహారం’ అని పేరున్నప్పటికీ చాలామంది పాలు తాగడానికి ఇష్టపడరు. కడుపులో తిప్పడం, ఇబ్బందిగా అనిపించడం, వికారంగా అనిపించడం, రుచి బాగోలేకపోవడం... ఇలా రకరకాల కారణాలతో పాలను పక్కన పెడుతుంటారు. ఇక వీగన్లుగా మారిన వారు కూడా పాలను దూరం పెట్టేస్తుంటారు. అయితే పాలు తాగకపోయినా అందులోని పోషకాలను పొందేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి.  అందులో ఓట్‌ మిల్క్‌ కూడా ఒకటి.

అది పడనివారికి.. 

సాధారణ పాలల్లో ల్యాక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది చాలామందిలో కడుపుబ్బరం, కడుపునొప్పి, డయేరియా తదితర సమస్యలకు కారణమవుతుంది. ఈ నేపథ్యంలో ల్యాక్టోజ్ తో ఇబ్బంది పడేవారికి ఓట్ మిల్క్ మంచి ప్రత్యామ్నాయమంటున్నారు నిపుణులు. డెయిరీ ఉత్పత్తులు పడనివారు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని సూచిస్తున్నారు. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఓట్ మిల్క్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం రండి.

ఓట్‌ మిల్క్

కావాల్సిన పదార్థాలు

నానబెట్టిన జీడిపప్పులు - 12 లేదా 25 గ్రాములు

రోల్డ్‌ ఓట్స్ - ఒక కప్పు

చల్లని నీరు - ఒక లీటరు

తియ్యదనం కోసం

దాల్చిన చెక్క పొడి – అర టీస్పూన్

వెనీలా ఎసెన్స్‌ - 7 నుంచి 8 చుక్కలు

తయారీ విధానం

రోల్డ్‌ ఓట్స్‌, జీడిపప్పును మిక్సీలో వేసి 10 సెకన్ల పాటు గ్రైండ్‌ చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటిని కలిపి మరో 20 సెకన్ల పాటు గ్రైండ్‌ చేయాలి. చివరిగా మస్లిన్‌ క్లాత్‌ సహాయంతో ఈ మిశ్రమాన్ని వడకట్టుకుంటే ఓట్‌మిల్క్‌ సిద్ధం. పాలకు తియ్యదనం వచ్చేందుకు దాల్చిన చెక్కపొడి, వెనీలా ఎసెన్స్‌ను కలుపుకోవచ్చు.

ఓట్‌ మిల్క్‌ బాగా రావాలంటే..!

జీడిపప్పును ఎక్కువ సేపు నీటిలో నానబెట్టకూడదు.

ఓట్స్‌, జీడిపప్పులను మిక్సీలో ఎక్కువ సమయం గ్రైండ్‌ చేయకూడదు.

చల్లని నీటిని కలపడం వల్ల గ్రైండ్‌ చేసేటప్పుడు ఓట్స్‌ వేడెక్కకుండా నియంత్రించవచ్చు.

నీటిలో నానబెట్టిన జీడిపప్పు పాలల్లో అధిక క్రీమ్‌ వచ్చేందుకు సహాయపడతాయి.

ఈ పాలను 3-4 రోజుల పాటు ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవచ్చు. సాధారణ పాలలాగే వీటితోనూ టీ, కాఫీలు, చాక్లెట్లు, మిల్క్‌షేక్‌లు తయారుచేసుకోవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలివే!

ఓట్‌ మిల్క్‌లో శరీరానికి అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ పాలల్లో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారం.

ఇందులోని బీటా గ్లూకాన్‌ అనే ఫైబర్‌ జీవక్రియ సమస్యలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది.

ఓట్‌ మిల్క్‌లోని విటమిన్‌-బి, ఫోలేట్, ఇతర పోషకాలు ఎర్ర రక్తకణాల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఇందులోని విటమిన్‌-ఎ, డి, క్యాల్షియం, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌ పలు అనారోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా క్యాల్షియం, విటమిన్‌-డి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆస్టియోపొరోసిస్‌ లాంటి సమస్యలను నిరోధిస్తాయి.

ఓట్‌ మిల్క్‌లోని బీటా గ్లూకాన్‌ రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మధుమేహ రోగులకు ఇది మంచి ఆహారమని చెప్పుకోవచ్చు.

ఈ డెయిరీ ఫ్రీ మిల్క్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ (LDL) స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ (HDL) స్థాయులను పెంచుతుంది.

సాధారణ పాలల్లో మాదిరిగా ఓట్‌ మిల్క్‌లో ల్యాక్టోజ్ ఉండదు. గ్లూటెన్‌ ఫ్రీ కూడా.

ఈ పాలను తీసుకోవడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా జుట్టు పలచబడకుండా, తెల్లబడకుండా నిరోధిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్