Published : 17/11/2021 17:09 IST

Winter Health: ఈ ఆసనంతో బద్ధకానికి చెక్‌..!

(Photo: Instagram)

చలికాలమంటేనే ఏదో తెలియని బద్ధకం ఆవహిస్తుంటుంది.. శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది. అలాగని ఎప్పుడూ ఇలా రిలాక్సవుతూ కూర్చోవడం కుదరని పని. అందుకే శరీరాన్ని లోలోపలి నుంచి వెచ్చగా, చురుగ్గా మార్చుకుంటే బద్ధకం దానంతటదే మాయమవుతుందంటోంది బాలీవుడ్‌ ఫిట్టెస్ట్‌ బ్యూటీ మలైకా అరోరా. చలికాలంలో శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఓ ఆసనం కూడా సూచించిందీ అందాల తార. ఇంతకీ ఏంటా ఆసనం? దాన్నెలా సాధన చేయాలి? దానివల్ల ఆరోగ్యపరంగా చేకూరే ప్రయోజనాలేంటి? తెలుసుకుందాం రండి..

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించే ముద్దుగుమ్మల్లో మలైకా అరోరా ముందు వరుసలో ఉంటుంది. వివిధ రకాల వ్యాయామాలు, యోగాసనాలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. తమ ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతుంటుందీ చక్కనమ్మ. ఈ క్రమంలోనే తాజాగా ‘అశ్వ సంచలనాసనం’ అనే మరో ఆసనంతో మన ముందుకొచ్చింది మలైకా. చలిని దూరం చేసి శరీరానికి చురుకుదనాన్ని అందించే ఈ ఆసనం ఎలా వేయాలో కూడా వివరించిందీ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

ఎలా చేయాలంటే..!

‘చలికాలంలో ఏ పని చేయాలన్నా బద్ధకంగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు శరీరాన్ని తిరిగి చురుగ్గా మార్చుకోవాలంటే అశ్వ సంచలనాసనం చక్కటి ప్రత్యామ్నాయం. ఈ భంగిమ తుంటి, పిక్క కండరాలకు మంచి వ్యాయామాన్ని అందిస్తుంది. వెన్నెముకను సాగేలా చేసి దృఢంగా మారుస్తుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణనూ మెరుగుపరుస్తుంది. దీన్నెలా చేయాలంటే..!

* రెండు చేతుల్లో రెండు ఇటుకల్ని పట్టుకొని (ఇటుకకు బదులు కాస్త బరువైన వస్తువును కూడా పట్టుకోవచ్చు) రివర్స్‌ ‘V’ ఆకృతిలో వంగాలి.

* ఇప్పుడు గాలి పీల్చుకుంటూ కుడి కాలిని కాస్త వెనక్కి తీసుకెళ్లాలి. పీల్చిన గాలి వదులుతూ ఎడమ పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి.

* ఈ భంగిమలో రెండు పాదాల మధ్య ఉండే దూరాన్ని మీ సౌకర్యాన్ని బట్టి అడ్జస్ట్‌ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ దూరం ఉండి.. అసౌకర్యంగా, ఒత్తిడిగా అనిపిస్తే పాదాల మధ్య దూరాన్ని కాస్త తగ్గించుకోవచ్చు.

* ఇప్పుడు ఎడమ మోకాలిని 90 డిగ్రీల కోణంలో వచ్చేలా వంచాలి. ఈ క్రమంలో మోకాలు, చీలమండకు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

* ఇటుకలు పట్టుకున్న చేతుల్ని నెమ్మదిగా పైకెత్తుతూ.. ఛాతీని విస్తరిస్తూ చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపాలి. ఈ క్రమంలో ఛాతీని ఎడమ తొడపై ఆనకుండా చూసుకోవాలి.

* ఈ భంగిమలో ఉండి ఐదుసార్లు గాలి పీల్చి-వదలాలి. ఆ తర్వాత కాళ్లు మార్చి ఇదే ఆసనం వేయాలి.

ప్రయోజనాలెన్నో!

* ఈ ఆసనం వల్ల వెన్నెముకకు చక్కటి వ్యాయామం అందుతుంది. తద్వారా వీపు ఫ్లెక్సిబుల్‌గా, దృఢంగా మారుతుంది.

* ఈ భంగిమ సాధన చేయడం వల్ల ఛాతీ కండరాలపై ఒత్తిడి పడుతుంది. తద్వారా అవి దృఢంగా మారడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా మెరుగవుతుంది.

* శరీరంలో రక్తప్రసరణ సవ్యంగా జరగడానికి ఈ ఆసనం తోడ్పడుతుంది. ఫలితంగా కాలేయం, మూత్రపిండాల పనితీరు మెరుగవుతుంది.

* ఈ వ్యాయామం వల్ల పొట్ట కండరాలకు చక్కటి మసాజ్‌ అందుతుంది. తద్వారా అక్కడి అవయవాలు ప్రేరేపితమై, వాటి పనితీరు మెరుగవుతుంది.

* బద్ధకం, అలసట, నీరసం.. వంటివి దూరం చేసి శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని అందించే శక్తి అశ్వ సంచలనాసనానికి ఉందంటున్నారు నిపుణులు.

* ఈ ఆసనాన్ని తరచూ సాధన చేస్తుంటే కాళ్లలోని కండరాలు దృఢమవుతాయి.

* రక్తప్రసరణను మెరుగుపరిచే ఈ వ్యాయామం పలు చర్మ సమస్యల్ని దూరం చేసి ముఖ కాంతిని ఇనుమడింపజేస్తుంది. చర్మాన్ని బిగుతుగా మార్చి.. వృద్ధాప్య ఛాయలు దరిచేరనీయదు.

* ఈ వ్యాయామం చేసే క్రమంలో గాలి పీల్చడం, వదలడం.. వంటి ప్రక్రియలు మానసిక ఒత్తిళ్లను దూరం చేసి ప్రశాంతతను, పాజిటివిటీని అందిస్తాయి. తద్వారా మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది.

ఎవరెవరు చేయకూడదు?!

* మోకాళ్ల నొప్పులు, గాయాలు, ఇతర శారీరక నొప్పులు ఉన్న వారు ఈ వ్యాయామం చేయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

* ఈ ఆసనం వేసే క్రమంలో కండరాలు పట్టేసినా, అసౌకర్యానికి గురైనా.. దాన్ని కొనసాగించకుండా అక్కడే ఆపేయడం మంచిది.

* గర్భిణులు మాత్రం ఈ భంగిమను సాధన చేయకపోవడమే ఉత్తమం.

* పరగడుపున మాత్రమే ఈ వ్యాయామం సాధన చేయాలట!

ఇక తొలిసారి ఈ ఆసనం వేసే వారు యూట్యూబ్‌ వీడియోల్లో చూసి సొంతంగా సాధన చేయడం కంటే.. నిపుణుల పర్యవేక్షణలో వేయడమే మంచిది. అలాగే ఈ భంగిమ విషయంలో ఇంకా ఏవైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని