అమ్మయ్యాక రెండు వాగ్దానాలు చేసుకున్నా!

పెళ్లైనా, పిల్లలు పుట్టినా మహిళలు తమ కెరీర్‌ను కొనసాగించలేరనుకుంటారు. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్‌ చేసుకోలేక కెరీర్‌ని మధ్యలోనే విడిచిపెడతారని భావిస్తుంటారు. అయినా ఎన్ని సవాళ్లు ఎదురైనా వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న.......

Published : 13 May 2022 15:08 IST

(Photos: Instagram)

పెళ్లైనా, పిల్లలు పుట్టినా మహిళలు తమ కెరీర్‌ను కొనసాగించలేరనుకుంటారు. ఇటు ఇంటిని, అటు వృత్తిని బ్యాలన్స్‌ చేసుకోలేక కెరీర్‌ని మధ్యలోనే విడిచిపెడతారని భావిస్తుంటారు. అయినా ఎన్ని సవాళ్లు ఎదురైనా వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతోన్న మహిళామణులెందరో ఉన్నారు. బాలీవుడ్‌ అందాల తార మలైకా అరోరా కూడా ఇదే కోవకు చెందుతుంది. తను గర్భం దాల్చినప్పుడు, తన కొడుకు అర్హాన్‌కు జన్మనిచ్చినప్పుడు తానూ ఇలాంటి నిరుత్సాహపూరిత మాటలెన్నో భరించానంటోందీ అందాల అమ్మ. అయినా వాటిని పక్కన పెట్టి పూర్తి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగింది.. సక్సెసైంది. అందుకే అమ్మతనం అనేది మన కెరీర్‌కు కామా మాత్రమే.. అంతేకానీ ఫుల్‌స్టాప్‌ మాత్రం కాదంటూ తన గత అనుభవాలను ఇటీవలే ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌తో పంచుకుంది. మరి, ఈ సెలబ్రిటీ మామ్‌ అంతరంగమేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మలైకా అరోరా.. ఓ నటిగా, డ్యాన్సర్‌గా, మోడల్‌గా, వీజేగానే కాదు.. అందాల అమ్మగానూ మనందరికీ సుపరిచితురాలే! ఎక్కువగా ప్రత్యేక గీతాల్లోనే ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ నిర్మాతగానూ తనదైన ముద్ర వేసింది. ప్రస్తుతం బుల్లితెరపై పలు డ్యాన్స్‌ షోలకు హోస్ట్‌గా/జడ్జిగా వ్యవహరిస్తోన్న ఈ బాలీవుడ్‌ అందం.. తన వ్యక్తిగత జీవితానికీ అత్యంత ప్రాధాన్యమిస్తుంటుంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయాల్లో శ్రద్ధ వహిస్తూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటుందీ ఫిట్టెస్ట్‌ బ్యూటీ.

‘కెరీర్‌ ముగిసినట్లే..’ అన్నారు!

1998లో నటుడు, దర్శకనిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ను వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ.. 2002లో అర్హాన్‌ ఖాన్‌ అనే కొడుక్కి జన్మనిచ్చింది. ఆపై 2017లో ఈ దంపతులిద్దరూ విడిపోయినా తమ కొడుకు బాధ్యతల్ని ఇప్పటికీ సమానంగా పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తనపై వచ్చే విమర్శల్ని ఎప్పటికప్పుడు తనదైన రీతిలో తిప్పి కొట్టే ఈ బాలీవుడ్‌ మామ్‌.. తల్లైన తొలినాళ్లలో తానెదుర్కొన్న పలు సవాళ్లు, అనుభవాల గురించి ఇటీవలే బయటపెట్టింది. అటు కెరీర్‌ను, ఇటు అమ్మతనాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన తీరును ఓ సోషల్‌ మీడియా బ్లాగ్‌తో పంచుకుంది. తన మనసులోని భావాలకు అద్దం పడుతోన్న ఈ సుదీర్ఘ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

‘‘ఇక నీ కెరీర్‌ ముగిసినట్లే!’.. నేను గర్భం ధరించినప్పుడు చాలామంది నాతో అన్న మాటలివి. ఇప్పుడే కాదు.. పెళ్లైనప్పుడూ ‘నీకు నటిగా అవకాశాలు రావడం అరుదు!’ అని నిరుత్సాహపరిచారు. అయితే వీటికి నేను తలొగ్గలేదు. ఎందుకంటే నేను చిన్నతనం నుంచే స్వంతంత్ర భావాలున్న అమ్మాయిగా పెరిగాను. అమ్మాయినన్న వివక్ష కాకుండా.. ఒకరకమైన ప్రోత్సాహకర వాతావరణం నా చుట్టూ ఉండేది. ఈ పాజిటివిటీనే ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నన్నుగా ముందుకు నడిపించింది.

అమ్మయ్యాక రెండు వాగ్దానాలు చేసుకున్నా!

అలాగే అమ్మతనాన్నీ ఏదో భారంగా భావించకుండా.. అది నా రోజువారీ పనుల్లో అదనపు బాధ్యతగా భావించా. అందుకే గర్భం ధరించినా నా వృత్తిని కొనసాగించగలిగా. షోలు, రిహార్సల్స్‌కి హాజరు కాగలిగాను. ఇక అర్హాన్‌ పుట్టాక ప్రపంచమే నా అరచేతుల్లోకి వచ్చినట్లనిపించింది. ఈ క్రమంలో నాకు నేను రెండు వాగ్దానాలు చేసుకున్నా. ఒకటి.. అమ్మగా అర్హాన్‌కు ఏ లోటూ రానివ్వనని! రెండోది.. నా కెరీర్‌ని పూర్తిగా పక్కన పెట్టేసి నా గుర్తింపును కోల్పోకూడదని! అప్పట్నుంచి ఇప్పటిదాకా.. ఈ రెండు బాధ్యతల్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నా. ఇక అర్హాన్‌ పుట్టిన రెండు నెలల తర్వాత ఓ అవార్డ్‌ షోలో డ్యాన్స్‌ ప్రదర్శన చేశా. అయినా సమయానికి తిరిగి ఇంటికి చేరుకోగలిగా. అప్పుడు నాపై నాకే ఆత్మవిశ్వాసం రెట్టించింది. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేయగలనన్న నమ్మకం ఏర్పడింది.. ఈ ఉత్సాహంతోనే డెలివరీ అయ్యాక సరిగ్గా ఏడాది తర్వాత ‘కరణ్‌ ఫర్‌ కాల్‌ ధమాల్‌’ అనే ప్రత్యేక గీతంలో నర్తించా.

విడిపోయినా.. కలిసే నిర్ణయాలు!

అయితే ఇంత చేసినా, వృత్తిని-ఇంటిని బ్యాలన్స్‌ చేసుకున్నా ఏదో అపరాధ భావన (వర్కింగ్‌ మామ్‌ గిల్ట్‌) నన్ను వేధించేది. అందుకే నా కొడుకు కోసం మరింత సమయం కేటాయించడం మొదలుపెట్టా. వాడి కోసం ఉదయాన్నే మలయాళం పాటలు పాడేదాన్ని.. నా చిన్నతనంలో మా అమ్మ కూడా ఈ పాటలతోనే నన్ను ఆడించేది. వేళకు షూటింగ్స్‌కి వెళ్లడం, తిరిగి ఇంటికి రావడం చేసేదాన్ని. దీనికి తోడు మా కుటుంబం కూడా నాకు వెన్నుదన్నుగా నిలిచింది. అంతెందుకు.. నేను, అర్బాజ్‌ కూడా మా అబ్బాయి విషయంలో కొన్ని రూల్స్‌ పెట్టుకున్నాం. మాకు ఎన్ని పనులున్నా.. ఎవరో ఒకరు తప్పకుండా వాడితో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాం. అర్హాన్‌ స్కూల్లో జరిగే పేరెంట్‌-టీచర్‌ మీటింగ్స్‌, ఇతర కార్యక్రమాల్నీ మిస్‌ కాకుండా జాగ్రత్తపడేవాళ్లం. ఇక వాడిని స్కూల్‌కి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం నా వంతు! అలాగే ఏ విషయం మిస్‌ కాకుండా ప్రతిదీ అర్హాన్‌తో పంచుకునేవాళ్లం. ఆఖరికి నేను, అర్బాజ్‌ ఎందుకు విడిపోతున్నామో కూడా వాడికి వివరించాం.. అది వాడు అర్థం చేసుకున్నాడు. మేం దంపతులుగా విడిపోయినా.. అర్హాన్‌ విషయంలో ఇప్పటికీ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నాం.

తనే నా బెస్ట్ ఫ్రెండ్!

ఓ అమ్మగానే కాదు.. అర్హాన్‌తో నాది అంతకుమించిన స్నేహబంధం. వాడే నా డియరెస్ట్‌ ఫ్రెండ్‌. వాడి చిన్నతనంలో మలయాళం పాటలతో వాడిని ఎంటర్‌టైన్‌ చేసేదాన్ని. ఇప్పుడు అందులో కాస్త మార్పొచ్చింది. పాటలకు బదులు వారాంతాల్లో నచ్చిన వంటకాలు చేసుకొని ఎంజాయ్‌ చేస్తుంటాం. అయితే ప్రస్తుతం వాడు పైచదువుల రీత్యా విదేశాల్లో ఉంటున్నాడు. దాంతో వాడిని చాలా మిస్సవుతున్నా.. అయినా సోషల్‌ మీడియా పుణ్యమాని ఇద్దరం దగ్గరగా ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇప్పటికీ అమ్మగా నా మొదటి వాగ్దానాన్ని నిర్వర్తిస్తున్నట్లే.. కెరీర్‌ విషయంలో తీసుకున్న నా రెండో వాగ్దానాన్నీ సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్నా. అమ్మతనం, కెరీర్‌, స్నేహితులు.. ప్రస్తుతం ఇవే నా జీవితాన్ని సంపూర్ణంగా, సంతృప్తిగా ముందుకు నడిపిస్తున్నాయి.
సో.. ఆఖరుగా మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ జీవితాన్ని మీరు ఆస్వాదించండి.. కలలు నెరవేర్చుకోండి.. కెరీర్‌ని కొనసాగించండి.. సంతోషంగా లేని వైవాహిక జీవితంలో నుంచి బయటికి వచ్చేయండి! మీకు మీరు ప్రాధాన్యమిచ్చుకోండి. తల్లిగా ఉండడమంటే మిమ్మల్ని మీరు త్యజించుకోవడం కాదని గుర్తు పెట్టుకోండి. అమ్మతనం మీ కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ అస్సలు కాదు.. అది కేవలం ఓ కామా మాత్రమే!’ అంటూ తన మనసులోని భావాల్ని అక్షరీకరించిందీ అందాల అమ్మ.

అతడితో డేటింగ్‌.. తప్పేముంది?!

ప్రస్తుతం మలైకా బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే! అయితే తనకంటే ‘12 ఏళ్లు చిన్న వాడైన వ్యక్తితో డేటింగ్‌ చేయడమేంటి?’ అంటూ నెటిజన్ల నుంచి పలుమార్లు విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉందీ అందాల తార. అయితే దీనిపై ఇటీవలే ఓ సందర్భంలో స్పష్టతనిచ్చింది మలైకా.

‘ఒక మహిళ వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో రిలేషన్‌లో ఉంటే ఈ సమాజం ఎందుకు తప్పుగా చూస్తుందో అర్థం కాదు. అయినా అందులో తప్పేముంది? బ్రేకప్‌/విడాకుల తర్వాత ఒక మహిళ.. తనకంటూ ఓ జీవితాన్ని సృష్టించుకోవాలి. స్వశక్తితో ముందడుగు వేయాలి. ధైర్యంగా ఎలా జీవించాలో మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. ‘నీకిష్టం వచ్చినట్లు నువ్వు జీవించు. ఎవరిపై ఆధారపడకు. నీకు ఏం చేయాలనిపిస్తే అది మనస్ఫూర్తిగా చేసేయ్‌!’ అని మా అమ్మ ఎప్పుడూ నాతో చెబుతుంటుంది.. ఆ మాటల్నే నేను ఎక్కువగా నమ్ముతుంటాను..’ అంది మలైకా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్