ఈ ముద్దుగుమ్మల వయసు చెప్పగలరా?

సాధారణంగా ఎవరినైనా చూస్తే.. కాస్త అటూ ఇటుగా వారి వయసును అంచనా వేయచ్చు. కానీ ఈ దేశ అతివల వయసును అంచనా వేయడం కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ టీనేజర్స్‌కి, కాస్త వయసు మీద పడిన వారికి మేని మెరుపులో, అందంలో పెద్దగా తేడా కనిపించదు.

Published : 17 Sep 2021 20:05 IST

(Photo: Instagram)

సాధారణంగా ఎవరినైనా చూస్తే.. కాస్త అటూ ఇటుగా వారి వయసును అంచనా వేయచ్చు. కానీ ఈ దేశ అతివల వయసును అంచనా వేయడం కష్టమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ టీనేజర్స్‌కి, కాస్త వయసు మీద పడిన వారికి మేని మెరుపులో, అందంలో పెద్దగా తేడా కనిపించదు. అందుకే వయసు పైబడుతున్నా వన్నె తరగని అందానికి చిరునామాగా నిలుస్తున్నారు ‘మలేషియా’ మగువలు. ప్రపంచంలోనే అత్యంత సుందరమైన బీచ్‌లను కలిగిన ఈ దేశం పర్యటక పరంగానే కాదు.. విదేశీ అతివలకు సౌందర్య పాఠాలనూ నేర్పడంలోనూ ముందే ఉంది. అందుకు వారు తరతరాలుగా పాటిస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతులే ప్రధాన కారణం. మరి, ఎంతో సింపుల్‌ చిట్కాలతోనే అపురూప సౌందర్య రాశులుగా విలసిల్లుతున్న మలేషియా భామల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకుని మనమూ పాటిద్దాం రండి..

పెరుగుతో మేని ఛాయ..

భోజనంలో భాగంగా ఎన్ని కమ్మని పదార్థాలు తిన్నా కూడా పెరుగుతో ముగించకపోతే అసలు భోజనమే పూర్తికాదు. ఇలా భోజనంలో ముఖ్య పాత్ర పోషిస్తూ ఆరోగ్యాన్ని అందించే కమ్మని పెరుగుకు.. మేని ఛాయను రెట్టింపు చేసే శక్తి కూడా ఉందంటున్నారు మలేషియా మగువలు. కాలుష్యం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి కారణంగా ఛాయ తగ్గిన చర్మాన్ని తిరిగి కాంతులీనేలా చేస్తుంది పెరుగు. అందుకోసం చిక్కటి పెరుగుకు, ఉడికించిన ఓట్స్‌ని కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. దాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. ఆపై దాన్ని మృదువుగా మసాజ్‌ చేస్తూ రుద్దుకోవాలి. చివరగా చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పెరుగు చర్మం లోలోపలి నుండి పోషణనందించి తేమను నిలిపి ఉంచుతుంది. ఇక ఓట్స్‌ చర్మంపై ఏర్పడిన మృతకణాల్ని తొలగించి మేని ఛాయ మెరుగుపడేలా చేస్తుంది. ఎంతో సింపుల్‌గా ఉండి కదూ ఈ టిప్‌! మరి, మీరూ ఓసారి ట్రై చేసి చూడండి!

గంజితో అందం!

బియ్యం కడిగిన నీళ్లతో పాటు అన్నం ఉడికించిన తర్వాత వార్చిన గంజిలోనూ ఎన్నో పోషకాలుంటాయంటున్నారు మలేషియా భామలు. అందుకే ఆ నీటిని తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారా దేశపు మగువలు. దానికోసం కాస్త ఎక్కువ నీటిని జత చేసి అన్నాన్ని ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత ఆ నీటిని వేరు చేసి గిన్నెలోకి తీసుకోవాలి. ఆ నీరు చల్లారాక అందులో దూదిని ముంచి చర్మంపై ఫేస్‌ ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. అలా 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇందులో విటమిన్‌ ‘సి’ శాతం అధికంగా ఉండడం వల్ల అది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతేకాదు, వయసు పైబడిన ఛాయలను తగ్గించి నవయవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ఈ నీరు చర్మంపై ఏర్పడిన ముడతలను మటుమాయం చేస్తుందంటున్నారు మలేషియా మగువలు.

పుదీనాతో మచ్చలకు చెక్‌..

ఎండ త్రీవత వల్ల చర్మం కమిలిపోవడం, చెమట వల్ల మొటిమలు రావడం, మచ్చలు, అలర్జీ.. ఇలా సౌందర్యం విషయంలో ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. వాటన్నింటినీ పుదీనాతో పరిష్కరించుకోవచ్చంటున్నారు మలేషియా అతివలు. దీని కోసం కొన్ని పుదీనా ఆకులకు తగినంత నీరు చేర్చి మెత్తని మిశ్రమంలా తయారుచేయాలి. దీన్ని మచ్చలు, మొటిమలు ఉన్న ప్రాంతంలో పూతలా రాసుకుని ఓ 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్లే తమ చర్మం ఎటువంటి సమస్యలు లేకుండా నిగారిస్తుందంటున్నారీ మలేషియన్‌ మగువలు. ఇందులోని మెంథాల్‌, యాంటీ బయాటిక్స్‌.. చర్మ అలర్జీ, మచ్చలు వంటి వాటిని పోగొట్టి చర్మానికి సహజ తేమనందిస్తాయి. దాని వల్ల చర్మం పొడిబారకుండా నివారించవచ్చు.

కాఫీ స్క్రబ్‌తో మృదువుగా..!

కాఫీ తాగందే చాలామందికి రోజు మొదలవ్వదు.. కాఫీ వాసన మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇలా కాఫీ మనలో హుషారు నింపే టానిక్‌లానే కాకుండా చర్మానికి నిగారింపునందించే ఔషధంలా కూడా పని చేస్తుందని అనుభవంతో చెప్తున్నారు మలేషియా అతివలు. చర్మానికి ఎన్ని ఫేస్‌ప్యాక్‌లు అప్లై చేసుకున్నా వారంలో కనీసం ఒకటి లేదా రెండు సార్లు స్క్రబ్‌ చేస్తే మృతకణాలు తొలగిపోయి నిగారింపు చేకూరుతుంది. అందుకోసం కాఫీతో తయారుచేసిన స్క్రబ్‌ని ఎంచుకుంటున్నారీ అందాల భామలు. కాఫీ పొడికి బ్రౌన్‌ షుగర్‌, కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెలను కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. దీన్ని స్నానమాచరించడానికి ముందు శరీరమంతా రాసుకొని మృదువుగా రుద్దడం ద్వారా శరీరంపై పేరుకుపోయిన ట్యాన్‌, మృతకణాలు తొలగి మేని ఛాయ ఇనుమడించడంతో పాటు.. మృదువైన చర్మం సొంతమవుతుందంటున్నారీ మగువలు.

ఆహారంతో అందం..

ఇలా సింపుల్‌ బ్యూటీ టిప్స్‌ పాటించడంతో పాటు.. తాము తీసుకునే ఆహారం కూడా తమ అందంపై ప్రభావం చూపుతుందంటున్నారు మలేషియన్‌ ముద్దుగుమ్మలు. ఈ క్రమంలో ప్రొటీన్లు నిండిన మాంసాహారం, పాల ఉత్పత్తులు, గుడ్లు, పండ్లు.. వంటివి కచ్చితంగా తమ ఆహారంలో భాగం చేసుకుంటారు. దుంపలు, రైస్‌, నూడుల్స్‌, బ్రెడ్‌.. వంటి పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటామంటున్నారీ దేశపు అతివలు. ఇలా కార్బోహైడ్రేట్స్‌ తక్కువగా తీసుకుంటూ చక్కని వ్యాయామం చేయడం ద్వారా తమ బరువు కూడా అదుపులో ఉంటుందని చెప్తున్నారీ బుట్టబొమ్మలు. కాబట్టి బయటి నుంచి పోషణను అందించడం ఎంత ముఖ్యమో.. మనం తీసుకునే ఆహారం సమతులంగా ఉండాలనేది కూడా అంతే ముఖ్యం అని నిరూపిస్తున్నారు ఈ అందాల భామలు.

సో.. ఇవండీ.. మలేషియా భామలు తమ అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి ఉపయోగించే సౌందర్య చిట్కాలు. చాలా సింపుల్‌గా ఉన్నాయి కదూ ఈ టిప్స్‌! సింపుల్‌గానే ఉన్నా.. ఎంతో ప్రభావవంతంగా పనిచేసే ఈ చిట్కాల్ని మనమూ మన రోజువారీ బ్యూటీ రొటీన్‌లో భాగం చేసుకుందాం.. మరింత అందంగా మెరిసిపోదాం.. ఏమంటారు!!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్