డియర్ నాన్నా.. మీతో గడిపిన ఆ క్షణాలు మాకెప్పటికీ పదిలమే!
ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం! అప్పటిదాకా వాళ్లతో గడిపిన క్షణాలు, ఆ సంతోషం ఇకపై పునరావృతం కావనే ఆలోచనలు వారికి తీరని వేదనను మిగుల్చుతుంటాయి. ప్రస్తుతం తమ కుటుంబం అలాంటి శోకసాగరంలోనే మునిగిపోయిందంటోంది ప్రముఖ సినీ దర్శకురాలు, నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని. తన తండ్రి కృష్ణ మరణాన్ని....
(Photos: Instagram)
ప్రియమైన వారిని కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం! అప్పటిదాకా వాళ్లతో గడిపిన క్షణాలు, ఆ సంతోషం ఇకపై పునరావృతం కావనే ఆలోచనలు వారికి తీరని వేదనను మిగుల్చుతుంటాయి. ప్రస్తుతం తమ కుటుంబం అలాంటి శోకసాగరంలోనే మునిగిపోయిందంటోంది ప్రముఖ సినీ దర్శకురాలు, నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని. తన తండ్రి కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటోన్న ఆమె.. ఆయనతో తనకున్న అనుభూతుల్ని, చిన్నతనం నుంచి ఆయనతో గడిపిన జ్ఞాపకాల్ని ఓ సుదీర్ఘ పోస్ట్ రూపంలో పంచుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.
నేనూ నాన్నకూచినే!
ఏ కుటుంబంలోనైనా నాన్నలకు కూతుళ్లతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. తండ్రిని ఓ స్నేహితుడిగా, స్ఫూర్తిగా, మార్గదర్శిగా భావిస్తుంటారు అమ్మాయిలు. తన తండ్రి కృష్ణతో తనదీ ఇంతకుమించిన అనుబంధం అంటోంది మంజుల. అందుకే పండగలు, పుట్టినరోజులు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో ఆయనతో కలిసి దిగిన ఫొటోలు, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుందామె. మొన్నామధ్య ‘ఫాదర్స్ డే’ సందర్భంగా.. కృష్ణను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. ఇక ఇటీవలే ‘మా నాన్న హోమ్‌టూర్’ పేరుతో తను రూపొందించిన వీడియోకు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే! ఇలా ఒకటా, రెండా.. ఈ తండ్రీకూతుళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే సందర్భాలు ఇంకా బోలెడు!
నాన్నా.. అడగకుండానే అన్నీ ఇచ్చావ్!
ఇలా ప్రతి సందర్భంలోనూ తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకునే మంజుల.. తాజాగా ఆయన మరణంతో కుంగిపోతున్నారు. ఈ క్రమంలో చిన్నతనం నుంచి తన తండ్రితో తనకున్న జ్ఞాపకాల్ని ఓ సుదీర్ఘ పోస్ట్ రూపంలో పంచుకున్నారామె.
‘ప్రియమైన నాన్నా.. మీరు ప్రపంచానికే కాదు.. ఇంట్లోనూ సూపర్‌స్టారే! మీ ప్రేమ అజరామరం. బయట మీరు ఎంత గొప్ప నటులైనా.. ఇంట్లో ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. మీ వృత్తిలో మీరు ఎంత బిజీగా ఉన్నా.. ఇంట్లో మాకెప్పుడూ అందుబాటులో ఉండేవారు. మాతో వీలైనంత ఎక్కువ సమయం గడిపేవారు. మేము అడగకుండానే మా మనసు తెలుసుకొని అన్నీ మా ముందుంచేవారు. మాటల ద్వారా కాకుండా.. మీ చేతల ద్వారానే ఎలా జీవించాలో మాకు నేర్పారు. మీ నిరాడంబరత, సౌమ్య స్వభావం, వివేకం, క్రమశిక్షణ, సమయపాలన, దాతృత్వం అసమానమైనవి. సినీ పరిశ్రమకు మీరు చేసిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.
మిమ్మల్ని ఎంతగా మిస్సవుతున్నానో చెప్పడానికి మాటలు రావట్లేదు. రోజూ ఉదయం 11 గంటలకు మన ఫోన్ సంభాషణలు, మధ్యాహ్నం కలిసి చేసే భోజనం, ఇతర చర్చలు.. ఇవేవీ ఇకపై ఉండవన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. మీరు లేరన్న కఠిన సత్యాన్ని కూడా నా మనసు అంగీకరించలేకపోతోంది. మీరే నా బలం, ప్రోత్సాహం, స్ఫూర్తి.. లవ్యూ నాన్నా!’ అంటూ భారమైన హృదయంతో తన మనసులోని మాటల్ని అక్షరీకరించారామె. ఇక ఇటీవలే తన తల్లి ఇందిరాదేవిని కూడా కోల్పోయిన మంజుల.. ఆ సమయంలోనూ ఆమె జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
నాన్నను చూసి..!
నటుడిగా గొప్ప ప్రస్థానమున్న తన తండ్రి కృష్ణను చూస్తూ పెరిగిన మంజులకు నటి కావాలన్న కోరిక చిన్నతనం నుంచే బలంగా నాటుకుపోయింది. అయితే తన తండ్రి అందుకు మద్దతు తెలిపినా పలు కారణాల వల్ల అప్పుడు తన కోరిక నెరవేరలేదంటూ ఓ సందర్భంలో పంచుకుంది మంజుల.
‘నాన్న నటనను చూస్తూ పెరిగిన నాకూ సినీ రంగంపై మక్కువ పెరిగింది. వేసవి సెలవుల్లో నాన్న మా సోదరుల కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించేవారు. ఓసారి నాకూ ఓ చిన్న పాత్ర ఇచ్చారు. ఇలా కెమెరా ముందు నటించడం ఎంతో సరదాగా అనిపించింది. ఇవన్నీ నటి కావాలన్న తపనను నాలో రెట్టింపు చేశాయి. అయితే నా కోరికను ఎప్పుడూ నాన్నకు చెప్పలేదు. ఎందుకంటే ఆ సమయంలో సినీ రంగంలో ఉన్న ప్రముఖుల కుటుంబాల్లోని ఆడవాళ్లు సినిమాల్లో నటించడం చాలా అరుదు. ఇక కళాశాల చదువు పూర్తయ్యాక సినిమా దర్శకత్వంలో నాన్నకు సహాయకురాలిగా ఉన్నప్పటికీ.. నా మనసంతా నటన పైనే ఉండేది. ఇక ఓసారి ధైర్యం తెచ్చుకొని నా మనసులోని మాటను నాన్న ముందుంచా. కానీ నాన్న అందుకు ససేమిరా అన్నారు. దాంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గానే నా ప్రయాణం సాగింది. ఆపై మరో సందర్భంలోనూ పరోక్షంగా నా కోరిక నాన్నకు తెలియజేశా. నా తపనను గమనించిన ఆయన.. నన్ను హీరోయిన్‌గా పెట్టి తానే ఓ సినిమా తీద్దామనేసరికి నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆ తర్వాత పలు కారణాల వల్ల అదీ నెరవేరలేదు. ఏదేమైనా ఆ రోజుల్లో నాకు నటిగా అవకాశం రాకపోవడం ఎంతో బాధ కలిగించింది. కానీ నా కోరిక ముందు ముందు నెరవేరుతుందని అప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయా..’ అంటూ చెప్పుకొచ్చిందామె.
తాత గారూ.. మీరే నా హీరో!
హీరో మహేశ్ బాబు కూతురిగానే కాదు.. తన ప్రతిభతో చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకుంది సితార. ఆమెకు నాన్నమ్మ, తాతయ్యలతో అనుబంధం ఎక్కువ. ఈ క్రమంలో ఇటీవలే తన నాన్నమ్మ ఇందిరా దేవి చనిపోయినప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె.. ఇప్పుడు తనకు రోల్‌మోడల్ లాంటి తాత గారు కూడా దూరమవడంతో వర్ణించలేని బాధను అనుభవిస్తోంది. తను సోషల్ మీడియాలో పంచుకున్న తాజా పోస్ట్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
‘ఇకపై లంచ్ ఇంతకు ముందులా ఉండదు. తాతగారూ.. మీరు నాకు ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. ప్రతి క్షణం నా సంతోషాన్నే కోరుకున్నారు. ఇప్పుడు మీరు నాతో లేరు.. ఇవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు మిగిలిపోయాయి. మీరే నా హీరో! ఏదో ఒక రోజు మీరు నన్ను చూసి గర్వపడేలా చేస్తా. మిమ్మల్ని ఎంత మిస్సవుతున్నానో, ఇకపైనా ఎంత మిస్సవుతానో మాటల్లో చెప్పలేను..’ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సితార.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.