మెలానియా మెచ్చిన టీచరమ్మ!
సాధారణంగా టీచర్-స్టూడెంట్ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? టీచర్ పాఠాలు బోధించడం, విద్యార్థులు నేర్చుకోవడం వరకే పరిమితమవుతుంది. ఇలా వీళ్ల మధ్య ఓ క్రమశిక్షణతో కూడిన కఠిన వాతావరణం ఏర్పడుతుంది. కానీ దిల్లీకి చెందిన మనూ గులాటీ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాత్రం మరో అడుగు ముందుకేసి.. పిల్లలకు ఓ స్నేహితురాలిగా విద్యా బోధన....
(Photos: Instagram)
సాధారణంగా టీచర్-స్టూడెంట్ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? టీచర్ పాఠాలు బోధించడం, విద్యార్థులు నేర్చుకోవడం వరకే పరిమితమవుతుంది. ఇలా వీళ్ల మధ్య ఓ క్రమశిక్షణతో కూడిన కఠిన వాతావరణం ఏర్పడుతుంది. కానీ దిల్లీకి చెందిన మనూ గులాటీ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మాత్రం మరో అడుగు ముందుకేసి.. పిల్లలకు ఓ స్నేహితురాలిగా విద్యా బోధన చేస్తోంది. వినూత్న పద్ధతుల్లో పాఠాలు బోధిస్తూ పిల్లలకు సబ్జెక్టుపై, పాఠశాలపై మక్కువ పెంచుతోంది. విద్యార్థులకు స్కూల్లో సానుకూల వాతావరణం కల్పించినప్పుడే వాళ్లు చదువుపై శ్రద్ధ చూపగలుగుతారంటోన్న మను.. తన వినూత్న విద్యా బోధనతో పలు అవార్డులు, రివార్డులు సైతం అందుకుంది. అంతేకాదు.. తన టీచింగ్ వీడియోలతోనూ సోషల్ మీడియాలో పాపులర్‌గా మారిన ఈ టీచరమ్మకు.. అసలు క్రియేటివ్ టీచింగ్ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం రండి..
మనూ గులాటీ తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే! దీంతో ఇంట్లో ఒక క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉండేది. అలాగని చదువు విషయంలో తమను తమ పేరెంట్స్ ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని, వాళ్ల నిర్ణయాలు తమపై రుద్దలేదని చెబుతున్నారామె. కెరీర్‌ను ఎంచుకునే విషయంలో తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని అంటున్నారు మను.
వాళ్ల సమస్యలు తెలిశాక..!
‘అమ్మానాన్న స్కూలు నుంచి ఇంటికొచ్చాక బోలెడన్ని విషయాలు చెప్పేవారు. తమ స్కూల్ విశేషాలతో పాటు అక్కడి స్కూల్ పిల్లల సమస్యలూ వివరించేవారు. అలాగే ఆసక్తి లేని సబ్జెక్టుల్ని పిల్లలు నేర్చుకోవడానికి ఎంతగా కష్టపడేవారో కూడా చెప్పేవారు. ఇవన్నీ వినే క్రమంలోనే నా మనసులో ఒక ఆలోచన తట్టింది. నేనూ టీచర్‌నై పిల్లలకు అనువైన స్కూల్ వాతావరణం కల్పించాలని! వాళ్లకు సబ్జెక్టుపై మక్కువ పెంచాలని! ఎదిగే క్రమంలో ఈ కలనే కొనసాగిస్తూ ముందుకెళ్లా. ఇంగ్లిష్ ఆనర్స్‌లో డిగ్రీ, పీజీ పూర్తిచేసి.. ఆపై బీఈడీ కూడా చదివాను. రెండేళ్ల పాటు ప్రైవేటు పాఠశాలలో పనిచేశా. ఇక 2006లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. అయితే తొలిసారి నేను అడుగుపెట్టిన స్కూల్లో సదుపాయాలు, వాతావరణం నేను ఊహించిన దానికంటే భిన్నంగా ఉన్నాయి. దీంతో ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నా..’ అంటూ చెప్పుకొచ్చారు మను.
వినూత్న పద్ధతుల్లో బోధన..!
‘దిల్లీ ప్రభుత్వ పాఠశాల’లో సుమారు ఐదేళ్ల పాటు ప్రాథమిక తరగతులకు ఇంగ్లిష్ బోధన చేసిన ఈ టీచరమ్మ.. ఆపై అదే స్కూల్లో ఉన్నత తరగతులకు ప్రమోట్ అయ్యారు. సాధారణంగానే ఇంగ్లిష్ సబ్జెక్టు అంటే చాలామందిలో భయం, అనాసక్తి ఉంటాయి. వీటిని దూరం చేయడానికి వివిధ బోధనా పద్ధతుల్ని అనుసరించేవారు మను. ఈ క్రమంలో గేయాన్ని హాలీవుడ్ పాటలా మలిచేవారు. పాఠాల్ని ఆర్ట్స్-క్రాఫ్ట్స్‌గా, డ్యాన్స్-సంగీతం రూపంలో, సైన్స్-సాంకేతికతను జోడిస్తూ.. ఇలా విభిన్న పద్ధతుల్లో ఆమె చేసే బోధన పిల్లలను ఆకట్టుకునేది. వాళ్లూ టీచర్‌ని అనుకరిస్తూ ఉత్సాహంగా పాఠాలు నేర్చుకునేవారు. ‘నేను చెప్పే పాఠాలు పిల్లలు ఆసక్తిగా విన్నా.. కొంతమంది ఇతర ఉపాధ్యాయులకు ఇవి నచ్చకపోయేవి. అయినా నేను వెనక్కి తగ్గలేదు. నా పాఠాల ద్వారా పిల్లల్లో ఆసక్తి పెరిగి వారు లబ్ధి పొందితే చాలనుకున్నా..’ అంటున్నారు మను.
మెలానియా మెచ్చింది!
ఇలా తన వినూత్న ఆలోచనతో విద్యార్థుల్లో చైతన్యం కలిగించడమే కాదు.. 2018లో ప్రతిష్టాత్మక ‘బ్రైట్ స్కాలర్‌షిప్ ఆఫ్ అమెరికా’ అనే బోధనా కార్యక్రమానికి సైతం ఎంపికయ్యారు మను. 80 దేశాల నుంచి వచ్చిన టీచర్లు ఈ వేదికగా తమ సృజనాత్మక బోధనా పద్ధతుల్ని పంచుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ముగిసి అమెరికా నుంచి తిరిగొచ్చాక ‘జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలి’గా కేంద్ర ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారామె. ఇక అప్పట్నుంచి ఇటు స్కూల్లో విద్యార్థులకు పాఠాలు బోధించడంతో పాటు.. అటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తోన్న టీచర్లకు వినూత్న టీచింగ్ పద్ధతుల్ని పరిచయం చేస్తూ.. తద్వారా మరికొంతమంది చిన్నారులకు ఉత్తమ విద్యా ఫలాలు అందిస్తున్నారు మను.
‘నా కృషికి గుర్తింపుగా ఇప్పటివరకు ఎన్నో అవార్డులు అందుకున్నా. అయితే ఒక్క ప్రశంస మాత్రం ఎప్పటికీ నాకు ప్రత్యేకమే! అదేంటంటే.. 2020 ఫిబ్రవరిలో మెలానియా ట్రంప్ మా స్కూలుకొచ్చారు. ముఖ్యంగా నా తరగతిలోనే ఆమె చాలాసేపు కూర్చొని విద్యార్థులతో మాట్లాడారు. ఇక తిరిగి వెళ్లాక నన్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అది నా వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం!’ అంటూ నాటి సంఘటనను నెమరు వేసుకున్నారీ టీచరమ్మ.
‘సోషల్’ టీచరమ్మ!
పిల్లలకు పాఠాలు బోధించడంలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మను.. సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటారు. తమ విద్యార్థులతో సరదాగా గడిపిన క్షణాలు, తన వినూత్న విద్యా పద్ధతులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తుంటారామె. వాటిలో చాలా వీడియోలు గతంలో వైరల్‌గా మారాయి కూడా!
‘టీచింగ్ నా ఆరోప్రాణం. అందులో నాకు బోలెడంత సంతోషం, సంతృప్తి దొరుకుతున్నాయి. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం ఇద్దరే ఇద్దరు. ఒకరు నా స్టూడెంట్స్ అయితే మరొకరు నా భర్త-కుటుంబ సభ్యులు. ప్రస్తుతం నేను ఇంటిని, వృత్తిని సమర్థంగా బ్యాలన్స్ చేసుకుంటున్నానంటే అందుకు మావారు సుమీత్ అందించే ప్రోత్సాహమే అని చెప్తా. అందుకే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే ముఖ్యంగా కుటుంబం నుంచి తగిన ప్రోత్సాహం అందాలి’ అంటారు మను.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.