సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

Updated : 08 Jul 2021 20:52 IST

Photo: Instagram

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తండ్రి సహాయంతో సైక్లింగ్‌!

ప్రపంచంలోని ముస్లిం దేశాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలుంటాయో ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇందుకు అఫ్గానిస్థాన్‌ కూడా అతీతమేమీ కాదు. పైగా తాలిబన్ల దాడులతో నిత్యం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుందీ దేశం. ఆడపిల్లలు బయటకు రావడమే తప్పుగా భావించే ఆ దేశంలో సైకిల్‌తో రోడ్ల పైకి అమ్మాయిలను రానిస్తారా?...సరిగ్గా ఇలాంటి వివక్షనే ఎదుర్కొంది మసోమా అలీ జాదా. అఫ్గానిస్థాన్‌లో పుట్టినప్పటికీ చిన్నతనంలో ఎక్కువగా ఇరాన్‌లోనే గడిపిందీ యంగ్‌ సైక్లిస్ట్‌. తన తండ్రి సహాయంతో సైక్లింగ్‌ కూడా నేర్చుకుంది. అయితే పదేళ్ల వయసులో మళ్లీ తన కుటుంబంతో కలిసి అఫ్గానిస్థాన్‌కు చేరుకుంది.

రాళ్లు విసిరారు!

ఈ క్రమంలోనే సైక్లింగ్‌లో మరిన్ని మెలకువలు నేర్చుకోవాలన్న మసోమాకు అక్కడి మత ఛాందసవాదులు అడ్డు తగిలారు. ‘చదువు, సైక్లింగ్‌ లాంటి పనులు చేయాల్సింది మగాళ్లు! నువ్వు గడప దాటి బయటికి రావడానికి వీల్లేదు’ అంటూ కఠిన ఆంక్షలు విధించారు. ‘సైక్లింగ్‌ అనేది ఏ మత సంప్రదాయానికి వ్యతిరేకం కాదు. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులకు మాత్రం ఇది తప్పుగా అనిపించింది. అమ్మాయిలు సైకిల్‌ తొక్కడం ముస్లిం మత సంప్రదాయాలకు వ్యతిరేకమంటూ నన్ను, నా స్నేహితులను బెదిరించారు. మా కమ్యూనిటీలోని కొందరు మాపై రాళ్లు కూడా విసిరారు. సైక్లింగ్‌ను మానేసి పెళ్లి చేసుకుని ఒద్దికగా ఇంట్లో ఉండమని హెచ్చరించారు’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ వుమన్‌.

డాక్యుమెంటరీ సహాయంతో!

ఈ క్రమంలో తాలిబన్ల కారణంగా అఫ్గాన్‌లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న దీన పరిస్థితులపై 2016లో ‘ది లిటిల్‌ క్వీన్స్‌ ఆఫ్‌ కాబూల్’ పేరుతో ఓ టీవీ డాక్యుమెంటరీ విడుదలైంది. ఇందులో మసోమాతో పాటు ఆమె సోదరి జహ్రా, సైక్లింగ్‌ నేర్చుకుంటున్న మరికొంతమంది అమ్మాయిలు భాగమయ్యారు. ఇక్కడి కఠిన ఆంక్షలతో తమ ఆశలు, ఆశయాలు ఎలా మూలన పడుతున్నాయో ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ డాక్యుమెంటరీని చూసిన ప్యాట్రిక్‌ కమ్యూనల్‌ అనే ఓ రిటైర్డ్‌ ఫ్రెంచి న్యాయవాది మసోమా, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. హ్యూమనిటేరియన్ (శరణార్థులకు రక్షణ కల్పించేందుకు కొన్ని దేశాలు అమలు చేస్తున్నాయి) వీసాపై వారందరూ ఫ్రాన్స్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. అలా 2017లో అఫ్గాన్‌ ఆంక్షల చట్రం నుంచి మసోమాకు విముక్తి లభించింది.

ఒలింపిక్స్‌కు ఎందుకు వెళ్లకూడదు?

అక్కడ మళ్లీ పాఠశాల మెట్లెక్కిన మసోమా క్రమంగా ఫ్రెంచిపై పట్టు సాధించింది. లిల్లేలోని యూనివర్సిటీ ఆఫ్‌ పాలిటెక్నిక్‌ స్కూల్‌లో చదువుకుంటూనే సైక్లింగ్‌లో మరిన్ని మెలకువలు నేర్చుకుంది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్‌ లిల్లే’లో సివిల్‌ ఇంజినీరింగ్‌లో సీటు దక్కించుకుంది. అక్కడి ప్రొఫెషనల్‌ కోచ్‌ల శిక్షణతో సైక్లింగ్‌లో మరింత రాటుదేలింది. క్లబ్‌ల తరఫున పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. అప్పుడే ఆమె మదిలో ఒలింపిక్స్‌ ఆలోచన మెదిలింది. తనను శరణార్థుల జట్టు విభాగంలో ఒలింపిక్స్‌కు పంపించాలని ఫ్రాన్స్‌ సైక్లింగ్‌ ఫెడరేషన్‌, ఒలింపిక్స్‌ గేమ్స్‌ కమిటీలను అభ్యర్థించింది. మసోమా నైపుణ్యాన్ని గుర్తించిన వారు కూడా ఆమెకు పచ్చజెండా ఊపారు.

నా దేశంలో శాంతిని కోరుకుంటున్నా!

ఈ క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న తొలి ఫ్రాన్స్‌ శరణార్థిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది మసోమా. దీనికి మరింత ఊతమిస్తూ 2019 నవంబర్‌లో ఐవోసీ రెఫ్యూజీ అథ్లెట్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించిందీ యంగ్‌ సెన్సేషన్‌. ‘సైక్లింగ్‌ అనేది కేవలం మగవారికి సంబంధించినది మాత్రమే అని చాలామంది అనుకుంటారు. ఇక మా దేశంలో అయితే సైకిల్‌ నడిపేంత శక్తిసామర్థ్యాలు ఆడవారికి ఉండవనుకుంటున్నారు. అయితే మేం అనుకుంటే ఏదైనా సాధించగలం. మగవారి లాగానే మాకు ఎన్నో ఆశలు, ఆశయాలుంటాయి. ఇష్టమైన దుస్తులు ధరించాలని, ఆసక్తి ఉన్న రంగంలో రాణించాలని అనుకుంటున్నాం. మగవారి లాగే మాకు సైకిల్‌, బైక్‌ నడిపే హక్కుందని చాటిచెప్పడానికి ఈ ఒలింపిక్స్‌ క్రీడలను వేదికగా చేసుకుంటున్నాను. అయితే ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో నా సొంత దేశం తరఫున అధికారికంగా పాల్గొనలేకపోతున్నందుకు ఎంతో బాధగా ఉంది. కానీ నేను ఎప్పటికీ అఫ్గాన్‌ మహిళనే. ఓ శరణార్థి క్రీడాకారిణిగా ఒలింపిక్‌ జెండా పట్టుకుని ఈ విశ్వక్రీడల్లో బరిలోకి దిగబోతున్నాను. ఈ జెండాలోని తెలుపురంగు శాంతికి చిహ్నమంటారు. అలాంటి శాంతిస్థాపన నా సొంతదేశంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ యంగ్‌ సైక్లిస్ట్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్