Published : 08/03/2023 18:05 IST

ఆరోగ్యం బాగుండాలంటే.. ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే!

ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడే స్త్రీలు తమ ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోరు. 'నాకేం కాలేదు. నేను బాగానే ఉన్నాను..' అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తారు చాలామంది. అలాంటివారిలో మీరూ ఉంటే వెంటనే తప్పక మారాలి. మీ ఇంట్లో వాళ్లందరూ ఆనందంగా ఉండాలంటే ముందు మీరు ఆరోగ్యంగా ఉండాలని గుర్తుంచుకోండి. అనారోగ్యం వచ్చిన తర్వాత కంగారుపడకుండా.. అది రాకముందే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం వల్ల మీకేదైనా వ్యాధి వచ్చే అవకాశాలున్నాయేమో ముందుగానే తెలుస్తుంది. ఈ క్రమంలో- వైద్యుల సలహా మేరకు అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షల గురించి ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా తెలుసుకుందాం...

క్యాన్సర్‌ను గుర్తించే పరీక్షలు

క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన వ్యాధో అందరికీ తెలిసిందే.. అయినా మనదాకా వచ్చినప్పుడు చూడచ్చులే.. అని చాలామంది దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రారంభ దశల్లోనే గుర్తిస్తే తప్ప క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలించడం సాధ్యం కాదు. వంశపారంపర్యంగానే కాకుండా, జీవన శైలి; వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే వాయువులలోని విషరసాయనాలు పీల్చడం.. మొదలైనవాటి వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయి. అందుకే సంవత్సరానికి ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

రొమ్ము క్యాన్సర్

దీన్ని గుర్తించడానికి మమో అనే పరీక్షను నిర్వహిస్తారు. ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతి స్త్రీ దీన్ని చేయించుకోవడం మంచిది. అలాగే నెలకోసారైనా ఎవరికి వారు ఇంట్లోనే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల రొమ్ముల్లో ఏవైనా గడ్డలుంటే గమనించి, వెంటనే డాక్టరు వద్దకు వెళ్లడానికి వీలుంటుంది.

పెద్దపేగు క్యాన్సర్

పెద్దపేగులో వచ్చే క్యాన్సర్‌ను నిర్ధరించడానికి చాలా పరీక్షలున్నాయి. ఫ్లెక్సిబుల్ సిగ్మాయిడోస్కోపీ, కోలనోస్కోపీ, డబుల్‌కాంట్రాస్ట్ బేరియం ఎనిమా, పెద్దపేగు సీటీస్కాన్ వంటి వాటి ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. మొదటి దశలో మల పరీక్షల ద్వారా దీన్ని గుర్తిస్తారు.

గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్

ఈ క్యాన్సర్‌ను గుర్తించడానికి పాప్‌స్మియర్, హెచ్‌పీవీ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఇరవై ఏళ్లు దాటిన ప్రతి మహిళా ఈ పరీక్షలు కూడా చేయించుకోవాలి.

చర్మ క్యాన్సర్

దీన్ని గుర్తించేందుకు ఎప్పటికప్పుడు నిర్వహించే చర్మ పరీక్షలు ఉపయోగపడతాయి. చర్మ క్యాన్సర్ లక్షణాలు మన కంటికి వెంటనే కనిపిస్తాయి. మన చర్మం మీద ఉండే మచ్చల సంఖ్యలోనైనా, ఆకారంలోనైనా మార్పు రావడం, బొడిపెలాంటి మచ్చలు ఏర్పడటం, మూడు వారాలు దాటినా పుండు మానకపోవడం వంటి లక్షణాలు కనిపించగానే అనుమానించి వెంటనే వైద్యుని సంప్రదించాలి.

కొలెస్ట్రాల్

ఎక్కువగా కూర్చొని పనిచేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగే అవకాశాలున్నాయి. మనం తీసుకునే ఆహారంలోని చెడ్డ కొలెస్ట్రాల్ మన రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీనివల్ల గుండెపోటు రావచ్చు. అందుకే దీన్ని గుర్తించడానికి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి. ఇరవై సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ ఈ పరీక్ష చేయించుకోవాలి. ప్రస్తుత కొలెస్ట్రాల్ స్థాయిని బట్టి మనకు గుండెజబ్బు వచ్చే అవకాశాలున్నాయా? లేదా? అన్న సంగతి నిర్ధరించచ్చు.

డయాబెటిస్

కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్న వారితో పాటు, స్థూలకాయులకు, బీపీ, పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్) వంటి సమస్యలున్నవారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్‌ను గుర్తించేందుకు వివిధ రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చేయించుకోవడం వల్ల మధుమేహం ఉందా? లేదా? అన్న విషయం తెలుస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాని బారిన పడకుండా ఉండొచ్చు.

ఎముకల పరీక్ష

ఈ మధ్య కాలంలో స్త్రీలలో ఆస్టియోపొరోసిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే ఎముకల గట్టిదనాన్ని గుర్తించే 'బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్' (BMD) స్త్రీలందరూ చేయించుకుంటే మంచిది. 60 సంవత్సరాలు పైబడిన వారు ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయి.

కంటి పరీక్షలు

ఎక్కువ సమయం కంప్యూటర్, టీవీల ముందు కూర్చోవడంతో ఇటీవలి కాలంలో మహిళలకు కంటికి సంబంధించిన వ్యాధులు అధికంగా వస్తున్నాయి. అందుకే కంటికి సంబంధించిన పరీక్షలు సంవత్సరానికోసారి తప్పనిసరి. వైద్యుల సలహా మేరకు కంటిచూపు పరీక్షతో పాటు ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్ వంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే గ్లకోమా రాకుండా ప్రతి రెండు సంవత్సరాలకోసారి కార్నియా మెజర్‌మెంట్ పరీక్ష చేయించుకోవాలి.

దంత పరీక్షలు

దంతాలకు సంబంధించి దాదాపుగా ప్రతిఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. కొంతమంది పిప్పిపళ్లతో బాధపడితే, మరికొందరికి చిగుళ్లలో సమస్య. అందుకే ప్రతిఒక్కరూ సంవత్సరానికోసారైనా.. దంత పరీక్షలు చేయించుకోవాలి. ప్రత్యేకించి పొగాకు, ఆల్కహాల్ తీసుకునే వారిలో నోరు, దంత సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండచ్చు. ఇలాంటివారు ఆరునెలలకోసారి దంత వైద్యుడిని సంప్రదించాలి.

మానసిక ఆరోగ్యానికీ..

కేవలం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగానూ సంతోషంగా ఉండాలి. లేకపోతే డిప్రెషన్, బైపోలార్, డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. సాధారణ ప్రవర్తనలో మార్పు, అనవసర ఆందోళన, చాలా త్వరగా కోపం రావడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మానసిక ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి సంబంధిత నిపుణులను సంప్రదించాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

సాధారణ పరీక్షలు

ప్రత్యేకంగా సంవత్సరానికోసారి చేయించుకోవాల్సిన పరీక్షలతో పాటు నెలకు, ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవాల్సిన పరీక్షలూ ఉన్నాయి. రక్తపోటు, బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) వంటివి ఈ కోవలోకి వస్తాయి. బీపీ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండటం వల్ల అధిక రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు. గుండె సంబంధిత వ్యాధుల నుంచీ రక్షణ పొందొచ్చు.

అలాగే మన బరువు ఎంతుంది? మన ఎత్తును బట్టి ఎంత బరువుండాలి? అనే విషయాలను తెలుసుకోవడానికి కొన్ని పరీక్షలు చేస్తారు. బీఎంఐ 25 కంటే తక్కువుంటే సాధారణ బరువు ఉన్నట్లు లెక్క. 18 కంటే తక్కువుంటే ఉండాల్సిన దానికంటే తక్కువ బరువున్నామని గమనించాలి. 25 నుంచి 29 వరకు అధికబరువు కింద లెక్కగడతారు. ఎవరి బీఎంఐ అయితే 30 కంటే ఎక్కువగా ఉంటుందో వారు స్థూలకాయులన్నమాట. ఈ పరీక్ష ద్వారా మనం ఉండాల్సిన బరువును తెలుసుకొని ఎక్కువ బరువుంటే దాన్ని తగ్గించుకోవడం వీలవుతుంది. ఫలితంగా రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు.

మరి తెలిసిందిగా.. తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కొన్ని పరీక్షల గురించి! క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకొంటూ, డాక్టర్లు సూచించిన విధంగా జీవనశైలిలో మార్పులు పాటించగలిగితే ఎలాంటి వ్యాధులూ మన దరికి రాకుండా జాగ్రత్తపడచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని