‘బేకింగ్’ స్కిల్స్‌తో అద్భుతాలు చేస్తోంది!

‘సమాజం నుంచి చాలా తీసుకుంటాం... తిరిగి ఇచ్చేయాలి’ అన్న మాటలను చిన్న వయసులోనే తన మనసులో నాటుకుంది ఆ అమ్మాయి. అందుకే తనకున్న ‘బేకింగ్‌’ స్కిల్స్‌తో రుచికరమైన బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలు చేసి విక్రయిస్తోంది. వాటి ద్వారా వచ్చిన మొత్తంతో కరోనా బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.

Published : 25 Jul 2021 16:37 IST

Image for Representation

‘సమాజం నుంచి చాలా తీసుకుంటాం... తిరిగి ఇచ్చేయాలి’ అన్న మాటలను చిన్న వయసులోనే తన మనసులో నాటుకుంది ఆ అమ్మాయి. అందుకే తనకున్న ‘బేకింగ్‌’ స్కిల్స్‌తో రుచికరమైన బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలు చేసి విక్రయిస్తోంది. వాటి ద్వారా వచ్చిన మొత్తంతో కరోనా బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి?తన వెనక ఎవరున్నారు? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ!

కోరుకోని అతిథిలా వచ్చిన కరోనా అందరి జీవితాలను ఏదో ఒక రకంగా ప్రభావితం చేసింది. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను అలవాటు చేసింది. పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లో పాఠాలు నేర్చుకునేలా చేసింది. మొత్తానికి చాలామందిని ఇంటికి పరిమితం చేసిందీ మహమ్మారి. అదే సమయంలో వారిలో దాగున్న అద్భుత నైపుణ్యాలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కూడా కల్పించింది. అలా కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని 14 ఏళ్ల వయసులోనే బెస్ట్ ఆంత్రప్రెన్యూర్‌గా మారిపోయింది ఆరాదితా గోయెంకా. గతేడాది లాక్‌డౌన్‌లో బేకింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె రుచికరమైన, ఆరోగ్యకరమైన బేకరీ ఉత్పత్తులు, మిఠాయిలు తయారుచేసింది. వాటిని విక్రయించడం కోసం ‘మిరాకిల్‌ ప్రాజెక్టు 20’ పేరుతో ఓ ఆన్‌లైన్‌ వేదికను కూడా ఏర్పాటు చేసింది.

మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని!

ఇక ఈ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడే దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని సమాజ హితం కోసం వినియోగించాలనుకుంది ఆరాదిత.  ఇందులో భాగంగా కరోనాతో రోడ్డున పడిన మహిళలు, పిల్లలతో పాటు క్యాన్సర్‌ బాధితులకు సహాయార్థంగా ఆ సొమ్మును ఖర్చుపెట్టాలనుకుని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆరాదిత రుచికరమైన ఉత్పత్తులే కాదు... ఆమె ఉద్దేశమూ చాలామందిని ఆకట్టుకుంది. దీంతో కొన్ని రోజుల్లోనే ‘మిరాకిల్‌ ప్రాజెక్టు’కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఎంతో కొంత తిరిగివ్వాలి!

‘మిరాకిల్‌ ప్రాజెక్టు 20 ’అనేది నా డ్రీమ్‌ ప్రాజెక్టు. మనకెంతో ఇచ్చిన సమాజానికి తిరిగి కొంతైనా ఇవ్వాలన్న ఆశయంతోనే దీనిని ఏర్పాటుచేశాను. లాక్‌డౌన్‌ రూపంలో గతేడాది నాకు చాలా సమయం దొరికింది. దాదాపు ఇంటికే పరిమితమైపోయాను. నాకు బేకింగ్‌పై ఆసక్తి ఉంది....దీంతో పాటు సమాజానికి సేవ చేయాలన్న ఆశయమూ ఉంది. ఈ రెండింటి సమ్మేళనమే ‘మిరాకిల్‌ ప్రాజెక్టు’. వీటి ద్వారా వచ్చిన మొత్తాన్ని నాకు తెలిసిన కొన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేశాను. కరోనాతో రోడ్డున పడిన మహిళలు, పిల్లలతో పాటు క్యాన్సర్‌ బాధితులకు ఈ సొమ్మును అందజేయాలని వారిని కోరాను’ అని అంటోందీ యంగ్‌ గర్ల్.

ఆ పుస్తకమే నన్ను మార్చేసింది!

‘మిరాకిల్‌’ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ అవ్వడంలో తన తల్లిదండ్రుల కృషి కూడా ఉందంటోంది ఆరాదిత.  ‘ఈ ప్రాజెక్టు ప్రారంభం నుంచి మా అమ్మానాన్నలు నాకు అండగా నిలుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా నాన్న (అమిత్‌ గోయెంకా) నాకు బహూకరించిన Danielle అనే పుస్తకం నాపై బాగా ప్రభావం చూపింది. ఓ యువతి తనకున్న నైపుణ్యంతో సమాజానికి ఎలా సేవ చేసిందన్నదే Danielle పుస్తక సారాంశం. ఇది చదివిన తర్వాత నా ఆలోచనలు మారిపోయాయి. నాలాంటి యువత కూడా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని అర్థమైంది. మనం చేసే చిన్న సహాయం కొందరికైనా మేలు చేస్తుందని అర్థమైంది. ఇక వంటకాల తయారీలో అమ్మ (నవ్యతా గోయెంకా) తగిన సలహాలు, సూచనలు అందిస్తుంటుంది’ అని చెబుతోంది ఆరాదిత.

రుచితో పాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యం!

Panna cota, చాక్లెట్‌ మౌసీ, గ్రానోలా జార్స్‌, కుకీలు, బిస్కెట్లు ...తదితర ఎన్నో రుచికరమైన రెసిపీలను స్వయంగా తయారుచేసి ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తోంది ఆరాదిత. ఈ నేపథ్యంలో తన ఉత్పత్తులు కేవలం రుచికరంగా ఉండడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయంటోంది.

‘నా ఉత్పత్తులకు ప్రతిఫలంగా కేవలం డబ్బులే ఇవ్వాలని లేదు. పేదలకు ఉపయోగపడే ఎలాంటి సహాయమైనా అందజేయవచ్చు. ఇక నా బేకింగ్‌ ఐటమ్స్‌ అన్నీ గ్లూటెన్‌ ఫ్రీ, షుగర్‌ ఫ్రీ వంటకాలే. ప్రొడక్ట్స్‌ నాణ్యత విషయంలోనూ నేను ఏ మాత్రం రాజీ పడను. ఎందుకంటే నాకు రుచితో పాటు కస్టమర్ల ఆరోగ్యం కూడా ముఖ్యమే. ముఖ్యంగా కరోనా సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకునేలా నా ఉత్పత్తులు ఉండాలనుకుంటాను’ అని చెప్పుకొచ్చిందీ యంగ్‌ గర్ల్.

సమాజ హితం కోసం ఆరాదిత చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా పలువురు మెచ్చుకుంటున్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్