అమ్మ ఉన్నా అనాథలా పెరిగా..!

ఆమెకు ఐదేళ్లున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో సొంత ఊరికి దూరంగా అనాథాశ్రమంలో పెరగాల్సి వచ్చింది. అయినా పట్టుదలతో చదివి మంచి ఉద్యోగం సంపాదించింది. అదనంగా ఫుట్‌బాల్‌పై అమితమైన ప్రేమను పెంచుకుంది. మైదానంలో దిగి ఆడకపోయినా అందులోనే కెరీర్‌ను వెతుక్కుంది. ఆ ఆసక్తితోనే ప్రతిష్ఠాత్మక ‘ఫిఫా మాస్టర్‌ ప్రోగ్రామ్‌ - 2021’కు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 మంది దీనికి ఎంపిక కాగా.. అందులో ఆమె ఒక్కర్తే భారతీయురాలు కావడం విశేషం.

Updated : 23 Jul 2021 19:57 IST

Photo: Instagram

ఆమెకు ఐదేళ్లున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో సొంత ఊరికి దూరంగా అనాథాశ్రమంలో పెరగాల్సి వచ్చింది. అయినా పట్టుదలతో చదివి మంచి ఉద్యోగం సంపాదించింది. అదనంగా ఫుట్‌బాల్‌పై అమితమైన ప్రేమను పెంచుకుంది. మైదానంలో దిగి ఆడకపోయినా అందులోనే కెరీర్‌ను వెతుక్కుంది. ఆ ఆసక్తితోనే ప్రతిష్ఠాత్మక ‘ఫిఫా మాస్టర్‌ ప్రోగ్రామ్‌ - 2021’కు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 మంది దీనికి ఎంపిక కాగా.. అందులో ఆమె ఒక్కర్తే భారతీయురాలు కావడం విశేషం. ఆమే.. కేరళకు చెందిన 26 ఏళ్ల ఐషా నజియా.

ఏకైక భారతీయురాలిగా!

దేశంలో ఫుట్‌బాల్‌కు బాగా ఆదరణ ఉన్న ప్రాంతాల్లో కేరళలోని కోజికోడ్‌ కూడా ఒకటి. కోల్‌కతా తర్వాత ఫుట్‌బాల్‌కు ఇక్కడే ఎక్కువ క్రేజ్‌ ఉంది. అందుకే కోజికోడ్‌ను ‘సెకండ్‌ మక్కా ఆఫ్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌’ అని కూడా పిలుస్తారు. అదే ప్రాంతానికి చెందిన ఐషా కూడా ఫుట్‌బాల్‌పై ప్రేమ పెంచుకుంది. మంచి జీతమొచ్చే ఇంజినీర్‌ ఉద్యోగాన్ని వదిలేసి ఆ ఆటలోనే కెరీర్‌ను వెతుక్కుంది. ‘స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రొఫెషనల్‌’గా తన ప్రతిభేంటో నిరూపించుకుంది. ఈ క్రమంలోనే ప్రతిష్ఠాత్మక ‘ఫిఫా మాస్టర్‌ ప్రోగ్రామ్‌ - 2021’ కోర్సుకు అర్హత సాధించింది. ఈ కోర్సు కోసం ప్రపంచవ్యాప్తంగా సుమారు 700మందికి పైగా దరఖాస్తు చేసుకుంటే తుదిగా 30 మంది ఎంపికయ్యారు. అందులో ఏకైక భారతీయురాలు ఐషా నజియానే!

అలాంటి వారి కోసం నిరీక్షించాను!

ఒకవైపు చదువు, మరోవైపు ఫుట్‌బాల్‌.. ఇలా రెండింటిలో సత్తా చాటుతోన్న నజియా జీవితం పూలపాన్పేమీ కాదు. ఆమె జీవితంలోనూ కన్నీటి సుడులున్నాయి. తల్లిదండ్రులున్నా అనాథాశ్రమంలో పెరిగిన ఐషా.. ఒకానొక సమయంలో తనను ఎవరైనా దత్తత తీసుకుంటే బాగుండేదనుకుందట! ‘నాకు ఐదేళ్లున్నప్పుడే అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు. అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంది. ఇంట్లో సవతి తండ్రి.. ప్రేమగా పలకరించని అమ్మతో నిత్యం నాకు అగ్ని పరీక్షే ఎదురయ్యేది. చివరకు చెన్నైలోని ఓ అనాథాశ్రమానికి అనుబంధంగా నడిచే పాఠశాలలో నన్ను చేర్పించారు. మొదట్లో రోజూ ఏడ్చేదాన్ని. మంచి తల్లిదండ్రులెవరైనా వచ్చి నన్ను దత్తత తీసుకుంటారేమోనని ఆశగా ఎదురుచూసేదాన్ని. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆ సమయంలో ఒక నన్‌ చెప్పిన మాటలు జీవితంపై నాకు మళ్లీ ఆశలు చిగురించేలా చేశాయి. ‘జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే కొన్ని కష్టాలను ఎదుర్కోక తప్పదు’ అని ఆమె చెప్పిన మాటలు నా మెదడులో బలంగా నాటుకుపోయాయి. బాగా చదువుకుంటే ఈ కష్టాలన్నింటినీ అధిగమించవచ్చని అర్థం చేసుకున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది ఐషా.

చదువే లోకంగా ముందుకు!

చదువే లోకంగా ముందుకు సాగిన ఐషా ప్రతి తరగతిలోనూ టాపర్‌గానే నిలిచింది. ఆమె ప్రతిభను మెచ్చుకుంటూ కేరళ ప్రభుత్వం 8లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ను కూడా మంజూరు చేసింది. ఈ డబ్బుతోనే కొల్లామ్‌లోని టీకేఎమ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సును అభ్యసించింది. ఈ కాలేజీలో చేరేటప్పటికి నజియా వయసు 18 ఏళ్లు. కోర్సు చేస్తున్నప్పుడే కొందరు స్నేహితులు ఆమెకు పరిచయమయ్యారు. కాలక్రమేణా వాళ్లే తన కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు.

‘వర్క్‌ ఫోర్స్‌ మేనేజర్‌’గా!

కోర్సు పూర్తయిన వెంటనే కొచ్చిలోని ‘ఇండియన్ ఆయిల్‌-అదానీ గ్యాస్‌’ కంపెనీలో మెకానికల్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించింది ఐషా. ఇదే సమయంలో టీవీలో ఎక్కువగా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చూస్తూ గడిపిన ఆమె క్రమంగా ఆ ఆటపై ఆసక్తి పెంచుకుంది. ఉద్యోగం చేస్తూనే అందులో ఏదైనా కొత్త కెరీర్‌ను వెతుక్కోవాలనుకుంది. ‘2017లో ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ పోటీలకు భారత్‌ ఆతిథ్యమిచ్చింది. ఈ మెగా ఈవెంట్‌లో నేను భాగమవ్వాలనుకున్నాను. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బృందంలో పనిచేయడానికి దరఖాస్తు పంపించాను. నాకు స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ డిగ్రీ లేకపోవడంతో అవకాశం వస్తుందన్న ఆశ లేదు. అయితే మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు విశ్లేషణాత్మక శక్తి, సమస్యలను పరిష్కరించే లక్షణాలను అలవర్చుకున్నాను. దీంతో ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేశాను. ‘వర్క్‌ ఫోర్స్‌ మేనేజర్‌’గా అవకాశం వచ్చింది. అప్పుడు నా వయసు 23 ఏళ్లు. ఆ మెగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ బృందంలో నేను అత్యంత పిన్న వయస్కురాలిని’.

ఉద్యోగం వదిలేసి!

‘వర్క్‌ ఫోర్స్‌ మేనేజర్‌’ అనేది ఒక ‘చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌’ రోల్‌ లాంటిది. వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్ని సమన్వయం చేసుకొని నిర్వర్తించాల్సిన బాధ్యత అది. కొంచెం కష్టమైనా సమర్థంగా పనిచేశాను. ఆ అనుభవంతోనే నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌(NBA)లో పాలుపంచుకున్నాను. 200మంది అమెరికన్లున్న టీంతో కలిసి పనిచేశా. ఇది నాకు మరింత ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. దాంతో ఇంజినీర్‌గా ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌పైనే దృష్టి సారించాను. అయితే ఆదాయం కోసం బెంగళూరులోని కొన్ని స్టార్టప్‌ కంపెనీల్లో పార్ట్‌ టైం ఉద్యోగాలు చేశాను. వారు కూడా నా ఆసక్తిని అర్థం చేసుకుని ఏవైనా స్పోర్ట్స్‌ ఈవెంట్లుంటే వెంటనే నన్ను అక్కడకు పంపించేవారు.’

వందల సార్లు పిచ్‌ దగ్గరకు వెళ్లాలి!

‘సాధారణంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌, స్పో్ర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెద్దగా కనిపించదు. ఇక్కడ డెస్కుకు పరిమితమై చేసే ఉద్యోగాలేమీ ఉండవు. చాలా వరకు ఫీల్డ్‌ వర్కే ఉంటుంది. అయితే నేను ఈ రెండింటినే కెరీర్‌గా ఎంచుకున్నాను. స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో ఉంటే నిరంతరం ఎండలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రోజుకు కొన్ని వందల సార్లు మైదానంలోకి వెళ్లి పిచ్‌ను పరిశీలించాలి. ఇంకా శారీరక శ్రమతో కూడిన ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది’ అని చెబుతోందీ టీనేజ్‌ గర్ల్‌.

అందుకే ఈ ‘క్రౌడ్‌ ఫండింగ్‌’!

ఆరేళ్ల క్రితం మొదటిసారిగా ‘ఫిఫా మాస్టర్‌ ప్రోగ్రామ్‌’ గురించి తెలుసుకుంది ఐషా. అప్పుడే ఈ కోర్సును పూర్తి చేయాలని మనసులో గట్టిగా అనుకుంది. ఇప్పుడు అది నెరవేరే సమయం ఆసన్నమైంది. ‘ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ స్టడీస్‌ అందించే ఈ కోర్సులో భాగంగా ఆటల్లో మేనేజ్‌మెంట్‌, లా, హ్యుమానిటీస్‌.. వంటి అంశాల్లో నైపుణ్యాల్ని నేర్పిస్తారు. ఇందులో చేరడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. కోర్సులో భాగంగా ఫిఫా, ఐఓసీ, ఫార్ములా వన్‌ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు మొత్తం 80 ప్రదేశాలకు ఫీల్డ్‌ ట్రిప్స్‌ కోసం మేం వెళ్లాల్సి ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఫిఫా ముగ్గురిని ఎంపిక చేసుకుని ఉద్యోగం కూడా కల్పిస్తుంది. అందుకే ఎప్పుడెప్పుడు ఈ కోర్సులో చేరదామా? అనిపిస్తుంది. ఇది మొత్తం ఏడాది కోర్సు. దీనికి అయ్యే ఖర్చులో సగం స్కాలర్‌షిప్‌గా వస్తుంది. మిగతాది అంటే సుమారు 28 లక్షల రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు కోసం పలు ఆర్గనైజేషన్లు, సంస్థల చుట్టూ తిరిగాను. కానీ ఫలితం లేకపోయింది. బ్యాంకు లోన్‌ కోసం ప్రయత్నించాను. కానీ నా పేరిట ఆస్తులేమీ లేకపోవడంతో అక్కడా నిరాశే ఎదురైంది. అందుకే చేసేదేమీ లేక క్రౌడ్‌ ఫండింగ్‌ మార్గాన్ని ఎంచుకున్నాను. ‘లింక్డ్ ఇన్‌’ లో నా వివరాలు షేర్‌ చేస్తే సుమారు 38 వేల మంది చూశారు. కానీ వంద రూపాయలకు మించి రాలేదు. అయితే కోర్సు ప్రారంభం కావడానికి చాలా సమయముంది. ఆలోపు డబ్బు సమకూరుతుందని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది ఐషా.

మరి, ఐషా కోర్సుకయ్యే డబ్బు త్వరలోనే సమకూరాలని, తన జీవిత లక్ష్యం నెరవేరాలని మనమూ కోరుకుందాం!!

ఆల్‌ ది బెస్ట్‌ ఐషా!!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్