Published : 16/02/2022 18:01 IST

Young Entrepreneur: ఆ యాప్ కోసం అరకోటి పెట్టుబడి సంపాదించింది!

(Photo: Screengrab)

చాలామంది తాము ప్రారంభించే వ్యాపారాలు/స్టార్టప్‌లకు తమ స్వీయానుభవాలే కారణమని చెబుతుంటారు. ఈ క్రమంలోనే తమలాంటి సమస్యలు మరెవరూ ఎదుర్కోకూడదని వివిధ ఉత్పత్తులు/యాప్స్‌ రూపొందించి అందరిలో అవగాహన పెంచుతుంటారు. గురుగ్రామ్‌ విద్యార్థిని అనౌష్కా జోలీ కూడా ఇదే చేసింది. చిన్నతనంలో తానెదుర్కొన్న ఓ చేదు సంఘటనతో మానసిక ఒత్తిడిని అనుభవించిన తనలా మరెవరూ బాధపడకూడదనుకుంది. ఈ క్రమంలోనే ఓ యాప్‌ని రూపొందించింది. ఇలా తన సృజనాత్మక ఆలోచనతో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ రియాల్టీ షోకి ఎంపికై, రూ. 50 లక్షల పెట్టుబడి సంపాదించింది. అంతేకాదు.. ఈ రియాల్టీ షోలో తన ఆలోచనతో నిధులు గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగానూ నిలిచిందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌. మరి, ఇంతకీ అనౌష్క చిన్నతనంలో ఎదుర్కొన్న ఆ చేదు సంఘటనేంటి? దాని పరిష్కారం కోసం ఏం చేసింది.. తెలుసుకుందాం రండి..

13 ఏళ్ల అనౌష్కా జోలీ గురుగ్రామ్‌లోని Pathways పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి ఇటు చదువుతో పాటు అటు అన్ని వ్యాపకాల్లోనూ చురుగ్గా ఉండేది. అయితే కొన్నేళ్ల క్రితం స్కూల్లో కొంతమంది తోటి విద్యార్థులు తమ మాటలతో చేతలతో తనని వేధించారు.. దీంతో బెదిరిపోయిన అనౌష్క వాళ్ల ముందే ఏడ్చేసిందట!

ఆ అనుభవమే ఆలోచనకు బీజం!

ఇలా తనకే కాదు.. ఓసారి స్కూల్లో జరిగిన ఓ వేడుకలో భాగంగా మరో అమ్మాయిని ఇతర విద్యార్థులు వేధించడం గమనించింది. ఆ సమయంలో గతంలో తానెదుర్కొన్న చేదు అనుభవం మరోసారి తన కళ్ల ముందు మెదిలింది. ఇలా ఇది తన ఒక్కదాని సమస్యే కాదని, ఎంతోమంది చిన్నారులు అకారణంగా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని గ్రహించింది అనౌష్క. ఎలాగైనా దీనికి చెక్‌ పెట్టాలన్న ఆలోచనతో ‘కవచ్‌’ పేరుతో యాంటీ బుల్లీయింగ్‌ స్క్వాడ్ (ABS) యాప్ను రూపొందించింది. ఎవరైనా సరే తమ బుల్లీయింగ్ అనుభవాలను పంచుకోవడానికి ఉద్దేశించిందే ఈ మొబైల్‌ యాప్‌. ఈ క్రమంలో తనకు కొన్ని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు సహకరించారంటోందీ బ్రిలియంట్‌ గర్ల్.

‘అకారణంగా ఇతరుల వేధింపులకు గురైతే కలిగే బాధ నాకు అనుభవమే! అయితే ముందు ఇది నా ఒక్కదాని సమస్యే అనుకున్నా. కానీ నా కళ్ల ముందే మరో అమ్మాయి ఇలాంటి వేధింపులు ఎదుర్కోవడం చూశా. అప్పుడనిపించింది.. ఇలాంటి బాధితులు ఇంకా ఎంతోమంది ఉన్నారని! వారిలోనూ తమ అనుభవాలను పంచుకొని బాధను దించుకునేవారు చాలా తక్కువ. అందుకే వాళ్ల బాధను పంచుకొనే వేదికను రూపొందించాలనుకున్నా. దాని ఫలితమే ఈ కవచ్‌ యాప్‌..’ అంటోంది అనౌష్క.

యాప్‌లో ఏముంది?!

బుల్లీయింగ్‌పై చిన్నారుల్లో అవగాహన పెంచడంతో పాటు తమకు ఎదురైన వేధింపుల్ని ఈ వేదికగా పంచుకొని.. ఆ మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు నిపుణుల సలహాలు పొందడానికి కవచ్‌ ఒక మార్గమని చెబుతోందీ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్.
‘చాలామంది భయంతో, సిగ్గుతో తాము ఎదుర్కొన్న అనుభవాలు బయటికి చెప్పరు. తద్వారా లోలోపలే కుమిలిపోతారు. అలాంటప్పుడు సమస్య ఎలా పరిష్కారమవుతుంది?! అలాంటి రహస్యాల్ని బయటి ప్రపంచానికి చెప్పుకోవడానికి కవచ్‌ ఓ చక్కటి వేదిక. విద్యార్థి అయినా వాళ్ల తల్లిదండ్రులైనా.. తమ చిన్నారులు ఎదుర్కొన్న వేధింపుల్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా ఈ వేదికగా రిపోర్ట్‌ చేయచ్చు.. తద్వారా బాధితులు నిపుణుల కౌన్సెలింగ్‌ తీసుకోవచ్చు.. అలాగే ఈ క్రమంలో సదరు పాఠశాలలు సైతం పాల్గొని మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే బాధితులు కోలుకునే విధానాన్ని ట్రాక్‌ చేసే ఫీచర్‌ని కూడా ఇందులో పొందుపరిచాను. ఈ మొబైల్‌ యాప్‌తో బుల్లీయింగ్‌పై సమగ్ర అవగాహన సైతం పెంచుకోవచ్చు..’ అంటోంది అనౌష్క.

వారి మనసులు గెలుచుకుంది!

ఇలా తన కవచ్‌ యాప్‌తో వివిధ పాఠశాలలు, విశ్వవిద్యాలయాలకు చెందిన రెండు వేల మందికి పైగా విద్యార్థుల్లో సానుకూల దృక్పథం నింపిన అనౌష్క.. ఇటీవలే ప్రముఖ రియాల్టీ షో ‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ వేదికగా తన ఆలోచనను పంచుకుంది. తన యాప్‌ పుట్టుపూర్వోత్తరాలు, అందులోని ఫీచర్లు, అది పలు విద్యాసంస్థలకు చేరువైన తీరు.. వంటివన్నీ షార్క్స్‌ (పెట్టుబడి దారులు/న్యాయనిర్ణేతలు)తో సవివరంగా షేర్‌ చేసుకుంది. దీంతో ఆమె ఆలోచన నచ్చిన అనుపమ్‌ మిట్టల్‌ (షాదీ.కామ్‌ సహవ్యవస్థాపకుడు, సీఈఓ), అమన్‌ గుప్తా (ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌ boAt సహవ్యవస్థాపకుడు) అనౌష్క రూపొందించిన యాప్‌ అభివృద్ధి కోసం రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. ‘నా యాప్‌లో పెట్టుబడి పెట్టడానికి వాళ్లిద్దరూ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బును ఈ యాప్‌ అభివృద్ధికి, దీని సేవలు మరింత విస్తరించడానికి వినియోగిస్తా..’ అంటూ సంబరపడిపోతోందీ యంగ్‌ స్టూడెంట్.

‘షార్క్‌ ట్యాంక్‌ ఇండియా’ అనేది అంకుర పరిశ్రమలకు సంబంధించి వినూత్న ఆలోచనలను ప్రోత్సహించే ప్రముఖ రియాల్టీ షో. ప్రముఖ వ్యాపారవేత్తలే ఇందులో జడ్జిలుగా ఉంటారు. వారిని షార్క్స్‌ పేరుతో పిలుస్తారు. ఔత్సాహికులు ఇందులో పాల్గొని తమ వ్యాపార ఆలోచనల్ని/స్టార్టప్‌ ఐడియాల్ని పంచుకోవచ్చు. అవి జడ్జిలకు నచ్చితే నిధుల రూపంలో వాటిలో పెట్టుబడులు పెట్టడానికి, వాళ్లను మరింత ప్రోత్సహించడానికి వారు ముందుకొస్తారు. ఇటీవల అనౌష్క కూడా అదేవిధంగా తన ఆలోచనతో షార్క్స్‌ను ఆకట్టుకొని అరకోటి గెలుచుకుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని