IIT Madras: టాంజానియా క్యాంపస్‌కు తొలి మహిళా డైరెక్టర్ ఇన్‌ఛార్జిగా..!

విద్యాబుద్ధులు నేర్పి, మనకో అందమైన భవిష్యత్తును అందించిన విద్యాసంస్థలో పని చేయడమంటే గౌరవంగా, గర్వంగా ఫీలవుతుంటాం. నిజానికి ఇలాంటి అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. ఈ అరుదైన అవకాశం....

Published : 12 Jul 2023 17:36 IST

(Photo: Screengrab)

విద్యాబుద్ధులు నేర్పి, మనకో అందమైన భవిష్యత్తును అందించిన విద్యాసంస్థలో పని చేయడమంటే గౌరవంగా, గర్వంగా ఫీలవుతుంటాం. నిజానికి ఇలాంటి అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. ఈ అరుదైన అవకాశం అందుకోవడమే కాదు.. ఎవరూ సాధించని ఘనతను, అత్యున్నత హోదానూ సొంతం చేసుకున్నారు ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రీతి అఘలయమ్‌. ఐఐటీ మద్రాస్‌లో ఉన్నత విద్యనభ్యసించి.. అదే క్యాంపస్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమె.. తాజాగా ‘ఐఐటీ మద్రాస్‌ జంజిబర్‌’ క్యాంపస్‌కు తొలి మహిళా డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఐఐటీ డైరెక్టర్‌గా బాధ్యతలందుకోనున్న తొలి మహిళగానూ ఘనత సాధించారు ప్రీతి. ఈ నేపథ్యంలో ఈ ఐఐటీ పూర్వ విద్యార్థిని గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

తొలి మహిళగా.. రెండు ఘనతలు!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌ త్వరలోనే తన అంతర్జాతీయ క్యాంపస్‌ను టాంజానియాలోని జంజిబర్‌లో ప్రారంభించనుంది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు భారత్‌, టాంజానియా ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నాయి. తద్వారా అంతర్జాతీయ క్యాంపస్‌ను ప్రారంభించనున్న తొలి ఐఐటీగా.. ఐఐటీ మద్రాస్‌ గుర్తింపు పొందింది. ప్రస్తుతానికి జంజిబర్‌లోని Bweleoలో తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేసినట్లు, 2026 నాటికి జంజిబర్‌ ద్వీపంలో 200 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్‌ను నిర్మించనున్నట్లు ఐఐటీ మద్రాస్‌ అధికారులు ప్రకటించారు. ఇక ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి తరగతులు ప్రారంభమయ్యే ఈ క్యాంపస్‌కు డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా ప్రొఫెసర్‌ ప్రీతి తాజాగా నియమితులయ్యారు. దీంతో ఐఐటీ మద్రాస్‌ జంజిబర్‌ క్యాంపస్‌కు తొలి మహిళా డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా, ఐఐటీలకు డైరెక్టర్‌గా బాధ్యతలందుకోనున్న తొలి మహిళగా.. పలు ఘనతలు తన పేరిట లిఖించుకున్నారు ప్రీతి. ఇక ఈ క్యాంపస్‌లో ఈ ఏడాది రెండు కోర్సుల్ని బోధించనున్నారట!

పూర్వ విద్యార్థే ప్రొఫెసర్‌గా!

చెన్నైకి చెందిన ప్రీతి ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థిని. 1995లో ఈ క్యాంపస్‌లోనే కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బీటెక్‌ పూర్తిచేసిన ఆమె.. 2000లో మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఆపై కేంబ్రిడ్జిలోని ‘మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’లో పోస్ట్‌ డాక్టొరల్‌ రీసెర్చర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఐఐటీ బాంబేలో లెక్చరర్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే భూగర్భ బొగ్గు వాయువులు, వాహనాల నుంచి వెలువడే వాయువుల తగ్గింపు.. వంటి పలు అంశాలపై పరిశోధనలు చేశారు. మరోవైపు ఆయా అంశాలపై పలు ఆర్టికల్స్‌ కూడా రాశారు. ఇక 2010లో ఐఐటీ మద్రాస్‌లో లెక్చరర్‌గా చేరిన ప్రీతి.. ప్రస్తుతం ఇదే క్యాంపస్‌లో ‘కెమికల్‌ ఇంజినీరింగ్’ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె సేవల్ని మరింత విస్తరించాలన్న లక్ష్యంతో.. తాజాగా ఐఐటీ మద్రాస్‌ జంజిబర్‌ క్యాంపస్‌కు డైరెక్టర్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించి ఆమెను గౌరవించిందీ అత్యున్నత విద్యా సంస్థ.

గొప్ప బాధ్యత.. సమర్థంగా..!

ఇక ఇటీవలే ‘ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్స్‌ కార్యాలయం’ దేశవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో (STEM) రాణిస్తోన్న 75 మంది మహిళల్ని గుర్తించింది. వారిలో ప్రీతి కూడా ఒకరు కావడం విశేషం. మరోవైపు ఐఐటీ మద్రాస్‌ తనకు అప్పగించిన తాజా బాధ్యతను సమర్థంగా నిర్వర్తించేందుకు సన్నద్ధమవుతున్నానంటున్నారామె.

‘ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థిగా.. ఇదే విద్యాసంస్థలో అత్యున్నత హోదాను అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ క్యాంపస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నప్పుడు చాలాసార్లు జంజిబర్‌ శాఖను సందర్శించాను. ఈ క్రమంలోనే ఈ క్యాంపస్‌ నిర్వహణ కోసం మహిళలకు ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తించాను. వారు అప్పగించిన ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానన్న నమ్మకం నాకుంది..’ అంటున్నారు ప్రీతి. ఈ కొత్త బాధ్యతలో భాగంగా.. అకడమిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, అంతర్జాతీయ విద్యార్థులు, రీసెర్చ్‌ పార్ట్‌నర్స్‌తో కలిసి పనిచేయనున్నారామె. ఇలా ప్రొఫెసర్‌గా, రీసెర్చర్‌గానే కాదు.. మారథానర్గా, బ్లాగర్‌గానూ ప్రీతి పలువురికీ సుపరిచితురాలే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని