Published : 02/10/2021 11:30 IST

అందుకే చిన్నారి కిట్టయ్య బొమ్మలు గీస్తున్నా!

(Photo: Instagram)

జస్నా సలీంకు చిత్ర లేఖనమంటే చాలా ఆసక్తి. ఎలాంటి బొమ్మలైనా గీయగలదు. కానీ కుంచె పట్టుకుంటే మాత్రం ఆమె మనసు కృష్ణుడి వైపే మళ్లుతుంది. అలా ఇంట్లో వాళ్లు, బంధువులు కాదంటున్నా ఆరేళ్లలో 500కు పైగా గోపాలుడి బొమ్మలు గీసింది. ఇలా కృష్ణుడికి తన కళతో నీరాజనం అర్పిస్తోన్న ఈ యంగ్‌ ఆర్టిస్ట్‌కి... తన మువ్వగోపాలుడి బొమ్మ ఓ హిందూ ఆలయంలోనైనా పూజలందుకోవాలని కోరిక. తాజాగా ఆ కల నెరవేరింది.

ఆరేళ్లలో 500కు పైగా కృష్ణుడి బొమ్మలు!

28 ఏళ్ల జస్నాది కేరళలోని కోజికోడ్‌. ఆరేళ్లుగా కృష్ణుడి బొమ్మలు గీస్తోన్న ఆమె వాటిని త్రిస్సూర్‌లోని ప్రముఖ గురువాయూర్‌ ఆలయానికి అందిస్తోంది. అయితే ఆ ఆలయ సంప్రదాయాల ప్రకారం హిందూయేతరులు ఈ గుడిలో ప్రవేశించడానికి వీలు లేదు. ఈ కారణంతోనే జస్నా పెయింటింగ్స్‌ను కూడా బయట హుండీ పక్కనే ప్రదర్శనకు ఉంచారు. అయితే తాజాగా కోజికోడ్‌ సమీపంలోని పండలం అనే గ్రామంలోని ఉలనాడు శ్రీ కృష్ణుడి దేవాలయంలో జస్నా పెయింటింగ్‌ను ఉంచి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్నాతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో తాను ఇన్నేళ్లుగా ఎదురుచూస్తోన్న కల సాకారమవ్వడంతో తెగ సంబరపడిపోతోంది జస్నా.

నా కల నెరవేరింది!

హిందూ-ముస్లింల సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోన్న జస్నా గీసిన కృష్ణుడి చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ‘హిందూ దేవాలయంలో నా పెయింటింగ్స్ పూజలందుకోవడం చూడాలన్న నా కల నిజమైంది. నేను ఓ హిందూ దేవాలయంలోకి అడుగుపెట్టడం కూడా ఇదే మొదటిసారి. దేవాలయ సిబ్బంది ముందుగానే ఇక్కడి ఆచార వ్యవహారాల గురించి నాకు వివరించారు. వారి సూచనల ప్రకారమే పెయింటింగ్స్‌ను తీసుకుని గర్భగుడి దగ్గరకు వెళ్లాను. ఆ తర్వాత పూజారులు వచ్చి తులసి మాల వేసి పెయింటింగ్స్‌ను తీసుకెళ్లారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.’

అన్ని బొమ్మలూ వేయగలను... కానీ!

‘చాలామంది అనుకున్నట్లు నేను ప్రొఫెషనల్‌ ఆర్టిస్టును కాదు. స్కూల్‌ డేస్‌లో బొమ్మలు గీసేటప్పుడు నా చేతులు బాగా వణికేవి. అయితే మా ఇల్లు కొత్తగా నిర్మిస్తున్నప్పుడు ఇంటి అవసరాల కోసం కొన్ని పాత పేపర్లు కొన్నాం. వాటిని ఒకసారి తిరగేస్తుండగా వెన్న కుండను పట్టుకుని కూర్చున్న కృష్ణుడి బొమ్మ నన్ను బాగా ఆకట్టుకుంది. అలా అప్పటి నుంచే మువ్వ గోపాలుడి బొమ్మ నా మదిలో నిలిచిపోయింది. ఇక మేం మొత్తం ముగ్గురు అక్కాచెల్లెళ్లం. నేనే అందరి కన్నా చిన్నదాన్ని. దీంతో మా ఇంట్లో అందరూ నన్ను ‘కన్నా’ అని ముద్దుగా పిలిచేవారు. ఇది కూడా కృష్ణుడిపై ప్రేమ కలిగేలా చేసింది. నేను అన్ని రకాల బొమ్మలు వేయగలను. కానీ వెన్న తింటున్న గోపాలుడి బొమ్మను గీస్తున్నప్పుడు ఎంతో ఆసక్తిగా, సంతోషంగా ఉంటుంది. అదే ఇతర బొమ్మలు వేస్తున్నప్పుడు మాత్రం అలాంటి ఆసక్తి, ఆనందం ఉండవు’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది జస్నా.

సెలబ్రిటీలు కూడా వస్తున్నారు!

‘ఓ ముస్లిం మహిళ ఇలా కృష్ణుడి బొమ్మలు గీస్తుంటే ఎవరూ అభ్యంతరం చెప్పలేదా?’ అని ఆమెను అడిగితే ..‘ నేను 2015 నుంచి కృష్ణుడి బొమ్మలు గీయడం మొదలుపెట్టాను. అప్పుడు నేను గర్భంతో ఉన్నాను. దీనికి తోడు ఓ యాక్సిడెంట్‌ కారణంగా చాలా రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఖాళీ సమయంలో మొదటిసారి శ్రీకృష్ణుడి ప్రతిమ వేశాను. దాన్ని చూసి మా వారు తిట్టారు. అతడి తల్లిదండ్రులు, బంధువులకు తెలిస్తే అరచి గగ్గోలు పెడతారని వెంటనే నాశనం చేయాలన్నాడు. కానీ అలా చేయడం నాకు ఇష్టం లేదు. దీంతో ఇంటి సమీపంలో ఉన్న ఓ హిందూ ఫ్యామిలీకి ఇచ్చాను. వారు దాన్ని పూజగదిలో ఉంచి పూజలు నిర్వహించారు. ఇలా చేయడం వల్ల వారు అనుకున్న లక్ష్యాలు, కోరికలు నెరవేరాయని చెప్పడంతో నా మనసు ఉప్పొంగి పోయింది. ఇది జరిగిన తర్వాత కృష్ణుడి పెయింటింగ్స్ కావాలని చాలామంది నా వద్దకు వచ్చారు. అందులో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కేరళ నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా నాకు ఆర్డర్లు వస్తున్నాయి. ఇక ఏటా శ్రీకృష్ణాష్ణమి, విష్ణు జయంతి నాడు త్రిస్సూర్‌లోని గురువాయూర్‌ దేవాలయానికి నా పెయింటింగ్స్‌ను బహుమతిగా పంపుతుంటాను. ఒక నెలలో సుమారు ఆరుకు పైగా కృష్ణుడి చిత్రాలు గీస్తుంటాను. సైజును బట్టి ఒక్కోదానికి రూ.5 వేలు తీసుకుంటాను. నేను ముస్లిం మత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయడం లేదు. అందుకే నా భర్తతో పాటు అమ్మానాన్నలు కూడా పెయింటింగ్స్‌ విషయంలో పూర్తి సహకారం అందిస్తున్నారు. కాబట్టి బొమ్మలు గీయడం ఆపను’ అని అంటోందీ యంగ్‌ ఆర్టిస్ట్.

ఆయనకు గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నా!

మోహన్ లాల్, మమ్ముట్టి, కేఎస్‌ చిత్ర, సురేశ్‌ గోపి, జయరాం తదితర ప్రముఖ కళాకారులు కూడా ఈ కృష్ణుడి పెయింటింగ్స్‌ను తీసుకున్నట్లు జస్నా ఇన్‌స్టా ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒకరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి కూడా తన గోపాలుడి ప్రతిమను బహుమతిగా అందించాలన్న కోరిక ఉందంటోంది జస్నా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని