ఆ పట్టుదలతోనే.. ఐఏఎస్‌ అయింది!

‘జీవితంలో గెలవాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. కాస్త ఓపిక కూడా ఉండాలి. ఓటములను కూడా సానుకూలంగా స్వీకరించేటంత సహనం ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం’...ఈ మాటలను సరిగ్గా విశ్వసించింది కేరళకు చెందిన మిన్ను. అందుకే సివిల్స్‌ పరీక్షల్లో ఐదుసార్లు ఫెయిలైనా ‘పట్టువదలని విక్రమార్కుడి’లా ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయం సాధించి తన ఐఏఎస్‌ కలను సాకారం చేసుకుంది.

Published : 29 Sep 2021 19:13 IST

(Photo: Twitter)

‘జీవితంలో గెలవాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. కాస్త ఓపిక కూడా ఉండాలి. ఓటములను కూడా సానుకూలంగా స్వీకరించేటంత సహనం ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం’... ఈ మాటలను సరిగ్గా విశ్వసించింది కేరళకు చెందిన మిన్ను. అందుకే సివిల్స్‌ పరీక్షల్లో ఐదుసార్లు ఫెయిలైనా ‘పట్టువదలని విక్రమార్కుడి’లా ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయం సాధించి తన ఐఏఎస్‌ కలను సాకారం చేసుకుంది.

ఆత్మవిశ్వాసంతో.. ఆరోసారి!

ఎప్పటిలాగే సివిల్‌ సర్వీసెస్‌-2020 ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిలతో పోటీపడి ఆలిండియా ర్యాంకులు సాధించారు. ఇక అక్షరాస్యతతో పాటు బాలికల విద్యలో దేశంలోనే ముందున్న కేరళ ఈ ఫలితాల్లోనూ తన పేరు నిలుపుకొంది. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు అమ్మాయిలు అద్భుత ప్రతిభ చాటారు. అందులో తిరువనంతపురంకు చెందిన 30 ఏళ్ల మిన్ను కూడా ఉంది. చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ అవ్వాలనుకున్న ఆమె తండ్రి మరణంతో అదే స్థానంలో పోలీస్‌ ఉద్యోగంలో చేరింది. కుటుంబాన్ని పోషించింది. కానీ తన కలల ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు సన్నద్ధమైంది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా ఐదుసార్లు పరీక్షలు రాసినా పరాజయాలే పలకరించాయి. కొన్నిసార్లు మెయిన్‌లో ఫెయిలైతే మరికొన్నిసార్లు ఇంటర్వ్యూల్లో వెనక్కు వచ్చింది. అయినా తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఆరోసారి మరింత ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసింది. ఆలిండియా స్థాయిలో 150వ ర్యాంక్‌ తెచ్చుకుంది.

తండ్రి స్థానంలో ఉద్యోగానికి!

కేరళలోని కరియవట్టం అనే ప్రాంతానికి చెందిన మిన్ను పోలీస్‌గా పనిచేస్తున్న తండ్రిని చూసి ఐఏఎస్‌ అవ్వాలనుకుంది. అందుకు తగ్గట్లుగానే కేరళ యూనివర్సిటీ నుంచి బయోకెమిస్ట్రీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. అందులో యూనివర్సిటీ స్థాయిలో రెండో ర్యాంకును సొంతం చేసుకుంది. అయితే తండ్రి అకాల మరణం ఆమెతో పాటు కుటుంబానికి ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టింది. దీంతో కుటుంబ పోషణ కోసం తండ్రి స్థానంలో పోలీస్‌ స్టేషన్‌లో క్లర్క్‌గా చేరాల్సి వచ్చింది.

అలా ఇంటర్వ్యూలో నెగ్గా!

ఉద్యోగంలో చేరిన కొన్ని నెలలకు పెళ్లి కూడా చేసుకుంది మిన్ను. ఆ తర్వాత ఓ అబ్బాయికి జన్మనిచ్చింది. దీంతో ఇటు పోలీస్‌గా, అటు గృహిణిగా కొన్నేళ్ల పాటు తీరిక లేకుండా గడిపిందామె. అయితే ఎప్పుడైతే మిన్నును తిరువనంతపురం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు పంపించారో అప్పుడే ఆమెలోని ఐఏఎస్‌ కల మళ్లీ నిద్ర లేచింది. అక్కడి ఐపీఎస్‌ అధికారులను చూసి స్ఫూర్తి పొంది మళ్లీ సివిల్స్‌కు సన్నద్ధమైంది.

‘నాన్న చనిపోవడంతో 2013లో పోలీస్‌ ఉద్యోగంలో చేరాను. ఆ తర్వాత డీజే జోషీతో నాకు వివాహమైంది. దీంతో సివిల్స్‌కు సన్నద్ధమయ్యేందుకు సమయం లేకుండాపోయింది. 2015లో మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించాను. మూడో ప్రయత్నంలో కానీ మెయిన్స్‌ దాకా వెళ్లలేకపోయాను. ఆ తర్వాత మెయిన్స్‌ను అధిగమించినా ఇంటర్వ్యూల్లో నెగ్గుకు రాలేకపోయాను. ఐదో ప్రయత్నంలో కేవలం 13 మార్కులతో ఇంటర్వ్యూను కోల్పోయాను. అందుకే ఆరోసారి మరింత గట్టిగా ప్రయత్నించాను. పరీక్షకు ముందు కొన్ని రోజులు సెలవు తీసుకున్నాను. ఇంట్లో కూడా నా భర్త, రెండేళ్ల కుమారుడు నాకు పూర్తిగా సహకరించారు. ఇక ఫైనల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ప్రధాన కారణం మా ఉన్నతాధికారులే. మా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఉండే డీజీపీ, ఏడీజీపీ, ఇతర ఐపీఎస్‌ అధికారులు నాకు విలువైన సలహాలు, సూచనలు అందించారు. అదృష్టవశాత్తూ ఈసారి ఇంటర్వ్యూలో బయోకెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా అడిగారు. దీంతో సులభంగా సమాధానాలు చెప్పేశాను’.

‘నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ అవ్వాలనే కోరిక ఉంది. నాన్న కూడా నన్ను ఈ స్థాయిలోనే చూడాలనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కల కూడా నిజమైంది’ అని అంటోంది మిన్ను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్